27, డిసెంబర్ 2011, మంగళవారం

నూరేళ్ల న్యూఢిల్లీ



నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో ఉండాలనీ, సంతోషంగా ఉండాలనీ ఎవరికుండదు చెప్పండి! మనిషి ఎప్పుడూ మార్పు కోరుకొంటాడు. కొత్త ఆలోచనలు చేస్తాడు. ఐతే రాజులకూ, చక్రవర్తులకూ కొత్త ఆలోచనలు వస్తే ఏవౌతుంది? ఏకంగా పౌర జీవితమే మారిపోతుంది. కాదూ కూడదూ అంటే, ఏకంగా రాజధాని నగరాలూ మారిపోతాయి. అలా ఏర్పడిందే కొత్త ఢిల్లీ మహానగరం. కొత్త ఢిల్లీ ప్రస్తావన వచ్చి వందేళ్లు నిండిన సందర్భంగా..
ఈ అనంత కాల గమనంలో దేశాలూ, రాజ్యాలూ మారిపోయాయి. ప్రజల ప్రయోజనాలు పక్కనబెడితే రాజులకూ, చక్రవర్తులకూ ఎపుడూ ఏదో ఒక కొత్తదనం కావల్సి రావడం వల్లే కొత్త పట్టణాలూ, కొత్త నగరాలూ వచ్చాయి. ‘కొత్త ఢిల్లీ’ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

1911 డిసెంబర్ 12నాడు నాటి (పాత) ఢిల్లీలోని నిరంకారీ సరోవర్ ప్రాంతానికి సమీపంలో జరిగిన ‘్ఢల్లీ దర్బారు’లో అలనాటి బ్రిటిష్ చక్రవర్తి జార్జి , కలకత్తా నుంచి దేశ రాజధానిని ‘్ఢల్లీ’కి మారుస్తున్నట్టూ పరిపాలనా సౌకర్యం కోసం ‘కొత్త ఢిల్లీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఐతే ఆ ప్రకటన వెలువడి 2011 డిసెంబర్ 12 నాటికి వందేళ్లు పూర్తయింది. ఈ ప్రస్తావన ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాల గురించి చర్చించడం, విభేదించడం పక్కనబెడితే, కొత్త్ఢిల్లీ రూపకల్పనకు నాంది పలికి వందేళ్లు నిండిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడం మన తక్షణ కర్తవ్యం.

‘కొత్త ఢిల్లీ’ రూపకల్పనకై 12 డిసెంబర్ 1911 నాడు ప్రస్తావన జరిగినా, కొత్త ఢిల్లీ దేశ రాజధానిగా పరిపుష్టిని పొందింది మాత్రం 1931లో. ఆ తర్వాత 16 ఏళ్లకు బ్రిటిష్ పాలకులు తామెంతో ముచ్చట పడి నిర్మించుకున్న నగరానే్న కాదు, ఏకంగా దేశానే్న వదిలి వెళ్లిపోయారు. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎన్నో మార్పులూ చేర్పులూ కలిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి. సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని నడుపుతున్నాయి. వీటన్నిటికీ సాక్షీభూతంగా నేటికీ నిలిచి ఉంది కొత్త ఢిల్లీ. ఎపుడూ నూతనంగానే ఉంటోంది.

చరిత్ర పుటల్లోకి..
ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే, ఢిల్లీ నగరం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తుంది. ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులూ, చక్రవర్తులూ - వారి ప్రభావం ఎలా ఢిల్లీ మీద పడిందో కూడా తెలియజేస్తుంది. ఆయా చక్రవర్తుల, రాజుల ధర్మమా అని ఢిల్లీ నగరం వివిధ సమయాల్లో ఐదు, ఆరుసార్లు పునర్ నిర్మింపబడిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. మహాభారత కాలంలో పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థ - పౌరాణిక, చారిత్రక నగరంగా విలసిల్లింది. ఇప్పటికే పాండవుల కోట (పురానాఖిల్లా) దీనికి సాక్ష్యంగా నిల్చి ఉంది. ఐతే క్రీ.శ.12వ శతాబ్దంలో ఢిల్లీ నగరం అత్యంత ఆటుపోటులను ఎదుర్కొన్నది. ముసల్మానులూ, బ్రిటిషర్లూ రానంత కాలం భారతదేశానికి రాజధానిగా ఢిల్లీ నగరం వర్థిల్లింది. 12వ శతాబ్ద ప్రాంతంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఢిల్లీ మహ్మద్ ఘోరి చేజిక్కింది.

అసలు వౌర్యుల రాజధానియైన పాటలీపుత్రాన్నీ, తక్షశిల (నేడు పాకిస్తాన్‌లో ఉంది)నీ కలుపుతూ ఢిల్లీ హైవేలో ఉండేది. బౌద్ధ భిక్షువులు ఈ మార్గానే్న తక్షశిల వెళ్లేవారు. చౌహానులు అధికారంలోకి రాగానే ఢిల్లీని దేశ కేంద్ర బిందువుగా, రాజధానిగా చేశారు. క్రీ.శ.1193లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని చెరపట్టాడు. ఆ తర్వాత మొగలాయి చక్రవర్తులు క్రీ.శ.1526 నుంచీ క్రీ.శ.1857 దాకా పాలించారు. దీని తర్వాత ఖిల్జీ అనుయాయులు ‘సిరి’ అనేచోట ఢిల్లీని ఏర్పాటు చేశారు. మూడోసారి ఢిల్లీ నిర్మాణమైంది.

ఘియాసుద్దీన్ కాలంలో క్రీ.శ.1321-25 ప్రాంతంలో తుగ్లకాబాద్ అనేది మూడో ఢిల్లీ నగరంగా నిర్మాణమైంది. దీని తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ జహంపనా పేరుతో ఢిల్లీ మార్పులను సంతరించుకుంది. కొద్ది రోజుల తర్వాత తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్‌కు మార్చాడు. తిరిగి ఎన్నో వ్యతిరేకతలకు తట్టుకోలేక తిరిగి రాజధానిని ఢిల్లీకే మార్చాడు. ఇక ఐదోసారి ఢిల్లీ నిర్మాణమైంది క్రీ.శ.1351లో. యమునా నదీ తీరాన ఫిరోజ్‌షా తుగ్లక్ నిర్మింపజేశాడు. దీనే్న తర్వాతి కాలంలో షాజహాన్ కూల్చేసి ‘షాహజహనాబాద్’ పేరుతో పునర్నిర్మించాడు. (ఈ నగరపు శకలాలూ, శిథిలాలూ నేటికీ లోడీ గార్డెన్స్‌లో మనం చూడొచ్చు) అలా ఆరోసారి పునర్నిర్మాణమైన ఢిల్లీయే అందరూ వాడుకగా పిలిచే పాతఢిల్లీ నగరం. ఎర్రకోట, జుమ్మా మసీదులూ ఆనాటి హిందూ, ముస్లిం చక్రవర్తుల పాలనకు సాక్ష్యాలుగా నేటికీ మనకు కనిపిస్తున్నాయి.

ఈస్టిండియా కంపెనీ రంగప్రవేశం..
పోర్చుగీస్, డచ్, డానిష్, ఫ్రెంచి దేశస్థులు మన దేశానికి వచ్చి వ్యాపారం చేయనారంభించి లాభాలు గడించసాగారు. క్రీ.శ.1510 నాటికే పోర్చుగీస్‌లు భారతదేశానికి వచ్చారు. ఇవన్నీ చూసిన బ్రిటీష్ దేశస్థులు తామెందుకు భారతదేశంలో వ్యాపారం చేయకూడదని తలచారు. క్రీ.శ.1600లో ఎలిజబెత్ రాణి (ఎలిజబెత్ ని) 31వ తేదీ డిసెంబర్ నాడు ఈస్టిండియా కంపెనీ (దీనే్న ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ అనీ అనేవారు)కు అనుమతి నిచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రధానంగా పత్తి, సిల్క్, ఇండిగోడై, టీ, ఓపియం వంటి వాటి వ్యాపారాన్ని చేసింది. క్రీ.శ.1601లో సర్ జేమ్స్ లాన్‌కాస్టెర్ తొలి నౌకకు సారధ్యం వహించాడు. డచ్‌వారితో పోటీ పడ్డాడు.

క్రీ.శ.1608లో (నేటి గుజరాత్‌లోని) సూరత్‌లో పాగా వేసింది. ఈస్టిండియా కంపెనీ దీని తర్వాత క్రీ.శ.1611లో మచిలీపట్నం (కోరమండల్ కోస్ట్)లో శాశ్వత ప్రాతిపదికన ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. క్రీ.శ.1612లో బెంగాల్‌లోని ఇతర యురోపియన్ వ్యాపార సంస్థలతో జత కూడింది. ఐతే 1707లో మొగల్ సామ్రాజ్యపతనం అయ్యింది. క్రీ.శ.1757లో ప్లాసీ యుద్ధంలో, క్రీ.శ.1764లో బక్సర్ యుద్ధంలో విజయాన్ని సాధించాక నెమ్మది నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా రాజ్యాలను కలుపుకొని పోసాగింది. అన్నిటినీ కలిపి ‘ఇండియా’ అని పిలవసాగింది. 19వ శతాబ్దపు మధ్యకాలానికి ఈస్టిండియా కంపెనీ ఒక బలవత్తరమైన రాజకీయ, మిలిటరీ శక్తిగా అవతరించింది. ఐతే క్రీ.శ.1853 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టుతో కంపెనీ పాలన అంతమై, క్రీ.శ.1876-77 నాటికి భారత సామ్రాజ్యంగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. క్రీ.శ.1772 నాటికే హుగ్లీ నదీ తీరాన ఉన్న కలకత్తా వీరి పాలనకు ప్రధాన కేంద్రంగా మారింది. బ్రిటిష్ పాలకుల కింద ఉండే రాజ్యాలు కాకుండా, ఇతర రాజులు శిస్తు కట్టే ఒప్పందం కింద ఉండిన రాజ్యాలూ ఉండేవి.
ఢిల్లీ దర్బారు..
ఢిల్లీలో జరిగిన మహా సమావేశాల్లో బ్రిటిష్ చక్రవర్తి, మహరాణుల పట్ట్భాషేక ఉత్సవ సంరంభాలకే ఢిల్లీ దర్బారు, ఇంపీరియల్ దర్బారు అని పేరు. ఈ ఢిల్లీ దర్బారు చరిత్రలో ముచ్చటగా మూడుసార్లు జరిగాయి. క్రీ.శ.1877లో జరిగిన తొలి ఢిల్లీ దర్బారు జనవరి 1వ తేదీన జరిగింది. ఆ సామ్రాజ్య పట్ట్భాషేక మహోత్సవంలో క్వీన్ విక్టోరియాను ‘మహారాణి’గా ప్రకటించారు. దీనికి నాటి వైస్రాయ్, మహారాజులు, మేధావులు, నవాబులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన సందేశం నేటికీ కలకత్తాలోని విక్టోరియా స్మారక భవనంలో ఒక ఫలకంపై చెక్కి ఉంది కూడా. అపుడే ‘ఫ్రీ ఇండియా’ అనే నినాదం మొదలైంది కూడా.

క్రీ.శ.1877 తర్వాత తిరిగి క్రీ.శ.1903లో కింగ్ ఎడ్వర్డ్ నిని, క్వీన్ అలెగ్జాండ్రాల పట్ట్భాషేక మహోత్సవంగా రెండు వారాలపాటు కడు వైభవంగా దర్బారు జరిగింది. ఇదీ ఢిల్లీలోనే జరిగింది. ఈ రెండో దర్బారు నిర్వహణకు లార్డ్ కర్జన్ ఎంతో కష్టపడ్డాడు. ప్రతిదీ దగ్గరుండి ప్లాన్ చేశాడు. ఈ దర్బారు ఆరంభమయ్యే సమయానికి అందరికీ అందుబాటులో ఉండేలా సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేశాడు.

భారతదేశపు నలుమూలల నుంచీ మహారాజులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. అంతా ప్రముఖులే హాజరవడం, సామాన్య ప్రజలు చూడలేక పోవడం జరిగింది. ఈ దర్బారు జరిగిన సమయంలో జరిగిన సంఘటనలను గుదిగుచ్చి సినిమాగా తీసి ప్రదర్శించారు. ఈ దర్బారు సమయంలోనే ఆఘాఖాన్ నినిని భారతదేశంలో సకల విద్యా సదుపాయాలను ఏర్పాటు చేసి విస్తరింపజేయాలని కోరాడు. ఈ దర్బారులో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్, అతని భార్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అది క్రీ.శ.1911 సంవత్సరం. కింగ్ జార్జి , క్వీన్ మేరీల పట్ట్భాషేక మహోత్సవం ఢిల్లీలో జరిగిందీ సంవత్సరంలోనే. అంతటితో ఆగలేదు. ఆ దర్బారులోనే జార్జి , కలకత్తా నుంచి దేశ రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నట్టు ప్రకటించాడు. ఈ 1911లో జరిగిన దర్బారే చివరి ఢిల్లీ దర్బారు. ఆ తర్వాత దర్బారు జరగలేదు. ఢిల్లీ పక్కనే కొత్త ఢిల్లీకి రూపకల్పన చేయడానికి ‘లూథైన్స్’ అనే బ్రిటిష్ రూపశిల్పికి పని అప్పజెప్పారు. 1912లో ఆరంభమైన కొత్త ఢిల్లీ నిర్మాణం 1930లో పూర్తయింది.

1931 నాటికి కొత్త ఢిల్లీ భారతదేశపు కొత్త రాజధానిగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ మూడో దర్బారు లార్డ్ హౌర్డింజ్ ఆధ్వర్యంలో జరిగింది. అదేమి చిత్రమోగానీ 1936లో ఎడ్వర్డ్ నినిని పట్ట్భాషేకం జరగాల్సి ఉండింది. కానీ పలు విమర్శల నేపథ్యంలో అది జరగనే లేదు. మరోసారి ఢిల్లీ దర్బారు జరగనే లేదు. ఇంతలో 2వ ప్రపంచ యుద్ధం జరగడం, భారత స్వాతంత్య్రోద్యమం జరగడం, భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం రావడం సంభవించాయి.

ఢిల్లీ దర్బారు వేదిక..
ఢిల్లీ దర్బారు జరిగిన స్థలానికే పట్ట్భాషేక ఉద్యానవనం (కారొనేషన్ పార్క్) అని పేరు. ఇది ఢిల్లీలోని నిరంకారీ సరోవర్ సమీపాన బురారీ రోడ్డుపై ఉంది. దీనినే పట్ట్భాషేక స్మారక స్థలం (కారొనేషన్ మెమోరియల్) అనీ అంటారు. మూడు ఢిల్లీ దర్బారులూ ఇదే స్థలంలో జరగడం కాకతాళీయం కావచ్చు.
ఈ దర్బారు జరిగిన సమయాల్లో జరిపిన ఖర్చు తక్కువేమీ కాదు.

కొత్త ఢిల్లీ నిర్మాణం..

ఢిల్లీ రాజధాని అని ప్రకటన వెలువడినంతనే 15 డిసెంబర్ 1911 నాడు ఈ నగరానికి శంకుస్థాపన చేశారు. 20వ శతాబ్దపు ప్రముఖ బ్రిటిష్ రూపశిల్పులైన సర్ ఎడ్విన్ లూథైన్స్, సర్ హెర్బర్ట్ బేకర్‌లకు కొత్త నగరపు నిర్మాణాన్ని అప్పగించారు. 1927 నాటికి ఈ కొత్త రాజధాని నగరానికి ‘కొత్త ఢిల్లీ’ అని నామకరణం చేశారు. 13 ఫిబ్రవరి 1931నాడు నాటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశాడు.
నిజానికి 1900 కాలానికే ఢిల్లీని బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యపు రాజధానిగా చేయాలని నిశ్చయించారు. ఐతే అదెందుకో వెంటనే సాకారం కాలేదు. అందుకే గాబోలు ఢిల్లీ దర్బారు పేరిట మూడు సార్లు ఢిల్లీలో సభ జరిగింది. మొదట 1877లో జరిగింది. అంటే, తొలి దర్బారు నాటికే బ్రిటిష్ వారికీ ఢిల్లీ మీద మోజుండేది. దీనికి కారణం ఒక్కటే. అనాదిగా రాజకీయ, ఆర్థిక కేంద్రంగా ఢిల్లీ కావడమే.
అందుకేనేమో! మూడో దర్బారు అంటే 1911 డిసెంబర్‌లో జార్జి , క్వీన్ మేరీ ఇద్దరూ ఢిల్లీకి వచ్చి, ఆ దర్బారులో దేశ రాజధానిగా ‘్ఢల్లీ’ ఉంటుందనీ, దీని కోసం కొత్త నగరాన్ని రూపకల్పన చేయబోతున్నారనీ ప్రకటించారు. అదే సమయంలో ఢిల్లీ దర్బారు సమీపాన వైస్రాయ్ భవనానికి శంకుస్థాపన కూడా చేశారు. (అదే నేటి రాష్టప్రతి భవనం).

లూథైన్స్ 1912లో ఢిల్లీని తొలిసారిగా సందర్శించారు. ఐతే తొలి ప్రపంచ యుద్ధం సమాప్తమయ్యాక, ఈ కొత్త నగర నిర్మాణం ఆరంభమైంది. ఎడ్విన్ లూథైన్స్, హెర్బర్ట్ బేకర్‌లు రూపకల్పన చేశాక, నిర్మాణ పనుల కాంట్రాక్టు నాటి శ్రీ శోభాసింగ్ అనే ఆయనకు అప్పగించారు. ఈ నగరానికే ‘లూథైన్స్ ఢిల్లీ’ అని పేరు మొదట పెట్టారు. నాటి బ్రిటిష్ చక్రవర్తి ఆలోచనల కనుగుణంగానే కేంద్ర కార్యనిర్వహణా స్థలాలు రూపుదిద్దుకున్నాయి. 1918లో ఎడ్విన్‌కు, 1926లో హెర్బర్ట్‌కు, ఆ తరువాత శోభాసింగ్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదు ఇచ్చి సత్కరించింది కూడా.
1911 దాకా మొత్తం ఢిల్లీకంతా పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ ఒక్కటే ఉండేది. ఆగ్రా - ఢిల్లీ రైల్వేస్ లూథైన్స్ రూపొందించిన ఢిల్లీ ద్వారా ఢిల్లీ, ఆగ్రాలను కలపడం జరిగింది. దాంతో, 1926లో లూథైన్స్ ఢిల్లీలో అజ్మీరీ గేటు సమీపాన కొత్త రైల్వేస్టేషన్ రూపుదిద్దుకుంది.
రైసానా హిల్స్‌పైన వైస్రాయ్ భవనాన్నీ, అక్కడ నుంచి నేరుగా ఇండియా గేట్ దాకా ఒక రోడ్డునీ నిర్మించారు. ఈ రోడ్డునే అలనాడు ‘కింగ్స్‌వే’ అనేవారు. ఇదే నేడు రాజ్‌పథ్ అయ్యింది.

వైస్రాయ్ భవనమే రాష్టప్రతి భవనం అయ్యింది. ఈ కింగ్స్ వేకు లంబంగా ఉండే జనపథ్ రోడ్డు నేడు మనలను కన్నాట్ ప్లేస్‌కు తీసుకెళ్తోంది) దానినే ‘క్వీన్స్‌వే’ అనేవారు. నేడు మనం చూసే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లతో సెక్రటేరియట్ భవనం, పార్లమెంట్ భవనం, పార్లమెంట్ స్ట్రీట్ - వీటికి హెర్బర్ట్ రూపకల్పన చేశాడు.
ఇవి కాకుండా నేటి రాష్టప్రతి భవనం వేపు నించి దక్షిణాన లోడీ రోడ్ దాకా దాదాపు 2800 హెక్టార్ల విస్తీర్ణంలో బంగ్లాలను రూపుదిద్దిందీ లూథైనే్స. దీనికే లూథైన్స్ బంగళా జోన్ అని పేరు. 1972లో న్యూఢిల్లీ రీ డెవలప్‌మెంట్ అడ్వయిజరీ కమిటీ ఏర్పడి కన్నాట్ ప్లేస్‌లో తదితర ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ లూథైన్స్ బంగళా జోన్ గురించి 1988లో ఒక ప్రకటన ద్వారా అందరికీ తెలియజేశారు. దానికే 2003లో కొన్ని మార్పులు చేశారు.

ప్రధాన రూపకర్తలు లూథైన్స్, హెర్బర్ట్‌లే అయినా వీరితోబాటు రాబర్ట్ టోర్ రస్సెల్, విలియమ్ హెన్రీ నికోల్స్, సిజి బ్లామ్‌ఫీల్డ్, ఎఫ్‌బి బ్లామ్ ఫీల్డ్, వాల్టర్ సైక్స్ జార్జి, ఆర్థర్ గోర్డన్ షూ స్మిత్, హెన్రీ మెడ్డ్‌లనే లబ్దప్రతిష్టులూ ‘లూథైన్స్ ఢిల్లీ’ రూపకల్పనకు యధాశక్తితో పాటుపడ్డారు. అలాగే శోభాసింగ్‌తోబాటు శ్రీ తేజ్‌సింగ్ మాలక్ అనే చీఫ్ ఇంజనీర్, మరో ముగ్గురు కంట్రాక్టర్లూ పనిచేశారు.

ఇండియా గేటూ - అమరజవాన్ జ్యోతి..
రైసానా హిల్స్ నించి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో మనకు కనిపించే జాతీయ స్మారక చిహ్నం ‘ఇండియా గేట్’. దీనికి రూపకల్పన చేసిందీ లూథైనే్స. ప్యారిస్‌లో అప్పటికే నెలకొల్పిన ‘ఆర్క్ డి ట్రిమ్ఫ్’ దీనికి ప్రేరణ. ఇండియా గేట్‌ను 1931లో కట్టారు. దీనికి అఖిల భారత యుద్ధ స్మారికగా పేరు. తొలి ప్రపంచ యుద్ధంలో, మూడో ఆంగ్లో - ఆఫ్గన్ యుద్ధంలో దేశం కోసం పోరాడి అసువులు బాసిన 90వేల సైనికుల అమరమైన త్యాగానికి చిహ్నంగా దీన్ని కట్టారు.

ఈ ఇండియా గేట్‌కు కొద్ది దూరంలో ఒక చిన్న పీఠం (కానొపి) ఉండేది. దాని మీద కింగ్ జార్జి విగ్రహం ఉండేది. ఈ కింగ్ జార్జి విగ్రహాన్ని తర్వాత తర్వాత కారొనేషన్ పార్కు దగ్గరకు తరలించి ప్రతిష్ఠించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాకా ఇండియా గేట్ దగ్గర ‘అమర జవాన్’ జ్యోతి అనే దానిని 1971లో భారత సైన్యం ఆరంభించింది. ఈ ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. టెర్రరిస్టుల భయం వల్లనో, లేక ఈ స్మారక చిహ్నానికి ముప్పు వాటిల్లుతుందనే భయం వల్లనో ఇండియా గేట్ సమీపంలో వాహనాలు తిరగడాన్ని నిషేధించారు. నేడు ఇండియా గేట్ ఉన్న స్థలం మొత్తం ఢిల్లీ మహా నగరానికి కేంద్ర బిందువుగా మారిపోయింది.

ఢిల్లీలో ఏ మూల నుంచీ ఏ మూలకు వెళ్లాలన్నా అటు ఇండియా గేటునూ ఇటు రాష్టప్రతి భవనాన్నీ చూడకుండా దాటడానికి వీల్లేని రోజులవి. మరి నేడో మెట్రోలూ, రింగ్ రోడ్లూ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి.
ఇండియా గేట్ చుట్టూతా ఉండే ప్రాంతాలంతా, ప్రజలు ఆడుతూ పాడుతూ ఉండేంత వీలుగా, పర్యాటక ప్రదేశంలా ఉంటుంది. ఇండియా గేట్ ఉన్న షడ్భుజి సముదాయం దాదాపు 306000 చ.మీ. విస్తీర్ణం కల్గి 624 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. రిపబ్లిక్ డే నాటి పెరేడ్ రాష్టప్రతి భవన్ ముందున్న విజయ్‌పథ్ ద్వారా ఇండియా గేట్ దగ్గరికి చేరి, అక్కడి నించి రెడ్‌ఫోర్ట్ దాకా వెళ్లేది.

ఈ అమర్ జవాన్ జ్యోతి సమీపానే త్రిదళ పతాకాలు (సైన్యం, నేవీ, ఏర్‌ఫోర్స్) ఎగురుతూంటాయి. ముగ్గురు సైనికులు ఇండియా గేట్ దగ్గరి ఈ అమర్‌జవాన్ జ్యోతి వద్దే 24 గంటలూ కాపలా కాస్తూంటారు కూడా.
రాష్టప్రతి భవన్
నిజానికి కొత్త ఢిల్లీకి నూరేళ్లు అనడానికి బదులు ‘రాష్టప్రతి భవనానికి నూరేళ్లు’ అని అక్కడ సంబరాలు జరపడం సబబు. 1911లో ముందు ఈ రాష్టప్రతి భవన్ (నాడు వైస్రాయ్ భవన్)నే కట్టడం ప్రారంభించారు. 1950 దాకా దీనిని వైస్రాయ్ హౌస్ అనే పేరుతోనే పిలిచేవారు. ఈ భవనానికి రూపకల్పన చేసిందీ లూథైనే్స. దీని నిర్మాణం పూర్తి కావడానికి 4 ఏళ్లు పడుతుందని మొదట అంచనా వేసినప్పటికీ, తొలి ప్రపంచ యుద్ధం వల్ల, 19 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో ఒక అధ్యక్షుని భవనం ఇంత పెద్దదిగా ఉండటం ఇక్కడే చూడొచ్చు.

రైసానా హిల్స్, మాల్చా గ్రామాల నుంచి దాదాపు 4 వేల ఎకరాల స్థలాన్ని ఈ వైస్రాయ్ భవనం కోసం ఎంపిక చేసినపుడు దాదాపు 300 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇది 1911, 1916 మధ్య ప్రాంతాల్లో జరిగింది.
ఈ వైస్రాయ్ భవనం తదితర నిర్మాణాలూ కూడా అంత సజావుగా ఏమీ సాగలేదన్న మాటే. కొన్ని సందర్భాల్లో లూథైన్స్‌కీ, హెర్బర్ట్‌కీ కూడా అభిప్రాయ భేదాలు కలిగాయి. ఆ తర్వాత ఇంపీరియల్ ఢిల్లీ కమిటీ అనేది ఏర్పాటై పర్యవేక్షించింది. కొత్త ఢిల్లీ నిర్మాణంలో ఉన్నంతకాలం, అంటే 1911 నించీ 1931 దాకా దాదాపు 20 ఏళ్లు అటు ఇంగ్లండ్‌కూ ఇటు ఇండియాకు ప్రయాణం చేస్తూనే ఉండక తప్పలేదు లూథైన్స్‌కి. ఎందుకంటే ఏకకాలంలో అటు ఇంగ్లండ్‌లో ఒక వైస్రాయ్ భవంతికీ, ఇటు ఢిల్లీలో వైస్రాయ్ భవంతికీ రూపకల్పన చేయాల్సి వచ్చిందతనికి.

వైస్రాయ్ హౌస్‌ను రూపుదిద్దడంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వానికీ ‘డబ్బు’ కొరత తప్పలేదు. బడ్జెట్ అనుమతించక పోవడంతో లార్డ్ హార్డింజ్, లూథైన్స్‌ని ఖర్చు తగ్గించమని చెప్పాడు. ఫలితంగా వైస్రాయ్ హౌస్ నిర్మాణంలో దాని పరిమాణాన్ని 13,000,000 క్యూబిక్ అడుగుల నుంచీ 8,500,000 క్యూబిక్ అడుగులకు తగ్గించాడు లూథైన్స్.

ఈ వైస్రాయ్ భవన్‌లో 4 అంతస్థులు, 360 గదులూ ఉన్నాయి. ఈ భవంతి కట్టడం విస్తీర్ణం 2,00,000 చ.అడుగులు.
ఇండియా గేట్ తూర్పు వేపు ఉంటే, వైస్రాయ్ భవన్ పడమట వేపు ఉంది. లూథైన్స్ భారతీయ సంస్కృతినీ, కట్టడాలనీ కూడా పరిశీలించడం వల్ల, భారతీయ నిర్మాణాలకు దీటుగా ఈ వైస్రాయ్ భవనాన్ని కట్టాడు. మొగల్, యూరోపియన్, ఇండియన్ సంస్కృతుల కలవోతగా మనకు ఈ వైస్రాయ్ భవనం కనిపిస్తుంది.

ఈ వైస్రాయ్ భవనం వెనుక వేపున పెద్ద ఉద్యానవనం ఒకటి నిర్మించారు. దానిలో అటు మొగల్, ఇటు ఇంగ్లీష్ శైలులే మనకు దర్శనమిస్తాయి. ఎంతో చక్కని పూదోట ఇది అనిపిస్తుంది. ఈ పెద్ద ఉద్యానవనానికే మొగల్ గార్డెన్స్ అని పేరు. దీనిని ప్రతిఏటా చూడటానికి ఫిబ్రవరి నెలలో సందర్శకులను అనుమతిస్తారు.
1985 ప్రాంతంలో ఈ భవనానికి మరమ్మతులు చేయనారంభించారు. అది 1989 దాకా కొనసాగింది. ఆ సమయంలోనే లోగడ చేసిన మార్పులను తొలగించి ‘అశోకా హాలు’కు పూర్వ స్థితిని తెచ్చారు. 2010లో మరో మరమ్మతు కార్యక్రమం మొదలైంది.

స్వాతంత్య్రం వచ్చాక..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక అంటే, 1947 తర్వాత కొత్త ఢిల్లీకి పరిమితమైన అటానమీనే ఇచ్చారు. అదీ ఒక చీఫ్ కమిషనర్ పర్యవేక్షణలో జరిగేది. 1956లో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, చీఫ్ కమిషనర్ స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. రాజ్యాంగ 69 సవరణతో 1991 నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కాపిటల్ టెరిటరీ/ రీజన్)గా మార్చారు. నేడు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఈ అసెంబ్లీలో 70 మంది సభ్యులున్నారు. మొత్తం ఢిల్లీ కాపిటల్ రీజన్ కింద 9 జిల్లాలున్నాయి.
జిల్లా విస్తీర్ణం జనాభా
సెంట్రల్ 25 చ.కి.మీ. 6,44,005
ఈస్ట్ 64 చ.కి.మీ. 14,48,770
న్యూఢిల్లీ 35 చ.కి.మీ. 1,71,806
నార్త్ 60 చ.కి.మీ. 7,79,788
నార్త్ ఈస్ట్ 60 చ.కి.మీ. 17,63,712
నార్త్ వెస్ట్ 440 చ.కి.మీ. 28,47,395
సౌత్ 250 చ.కి.మీ. 22,58,367
సౌత్ వెస్ట్ 420 చ.కి.మీ. 17,49,492
వెస్ట్ 129 చ.కి.మీ. 21,19,641
2009-10 నాటికి ఢిల్లీ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (ఎస్‌డిపి) సూచిక అక్షరాలా 1,35,814 రూ.లు.

ఢిల్లీ కేపిటల్ రీజన్‌లో నేడు ‘కొత్త ఢిల్లీ’ ఒక భాగంగా ఏర్పడింది.
న్యూఢిల్లీ చక్కగా ఒక పద్ధతిగా ప్లాన్ చేసి నిర్మించారు గనకే, నేటికీ ఆ నగరానికి వెళ్లినవారు ఎంతో ఆకర్షితులౌతున్నారు.
కొత్త ఢిల్లీలో రోడ్ల నిర్మాణం, పర్యవేక్షణ - రెండూ కూడా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చూసుకుంటుంది. 2008 నాటికి ఢిల్లీలో 15 సబ్‌వేలు రూపుదిద్దుకున్నాయి. 1971 దాకా ఢిల్లీ రవాణా సంస్థ (డిటిసి) మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కింద ఉండేది. 1971లో ఆ రవాణా సంస్థను జాతీయం చేయడం జరిగింది. 2007 నాటికి కొత్త ఢిల్లీలో 2700 బస్‌స్టాప్‌లున్నాయి. వీటిల్లో 200 దాకా మున్సిపాలిటీ నిర్వహిస్తోంది. మిగిలిన వాటిని డిటిసి నిర్వహిస్తోంది.
మెట్రో రైలు ఈ శతాబ్ద ఆరంభంలో ఢిల్లీకి లభించిన కొత్త రవాణా సౌకర్యం. మెట్రో రైలు రాకతో ఢిల్లీ, న్యూఢిల్లీల మధ్య దూరాలు తగ్గిపోయాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏర్‌పోర్ట్ ప్రధాన ఏర్‌పోర్ట్‌గా ఉంది. ఇటీవలే కొత్త టెర్మినల్‌నూ ఏర్పాటు చేశారు.

విచిత్రమైన ఢిల్లీ పరిస్థితి
..
‘్ఢల్లీ’ది విచిత్రమైన పరిస్థితి. దేశ విదేశాల నుంచి వచ్చిన జనాభా చాలా ఎక్కువ. అందుకే విభిన్న సంస్కృతులు చూడవచ్చు. అంతేకాదు. కాశ్మీర్, సిమ్లాల్లో మంచు కురిస్తే, ఢిల్లీలో చలి ముంచుకొచ్చేస్తుంది. రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను (ఆంధీ) వస్తే, వెంటనే ఢిల్లీలో రావలసిందే. ఏ థార్ ఎడారిలో ఎండ ముంచుకొస్తే, ఢిల్లీలో ఎండలు మండిపోతాయి. ఇక రాజకీయంగా చూసినా అంతే. ఏ రాష్ట్రంలో అనిశ్చితి కలిగినా, ఏ రాజకీయ అలజడి రేగినా దాని ప్రభావం ఢిల్లీలో తెలుస్తుంది. ఢిల్లీకి ‘సెగ’ తగలడం తప్పదు. విచిత్రంగా లేదూ? మహాభారత కాలం నించీ ఢిల్లీ పరిస్థితి ఇంతే!

ఢిల్లీలో తెలుగు..

ఢిల్లీలో పది లక్షలపైచిలుకు తెలుగువారు ఉన్నారు. ఆంధ్రదేశంలో తెలుగువారి మధ్య లేని సఖ్యత, ఢిల్లీలో చూడొచ్చు. ఆంధ్ర సంఘం, తెలుగు అకాడెమీ వంటి సంస్థలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. తెలుగువారు నడిపే బడి కూడా ఉంది. ఆంధ్రా భోజనం కావాలీ అంటే ఇండియా గేట్ దగ్గరున్న ఆంధ్రా భవన్‌కి వెళ్లి తీరాల్సిందే. కరోల్‌బాగ్, సరోజినీ నగర్, ఆర్.కె.పురం, దిల్‌షాద్ గార్డెన్స్, మయూర్ విహార్ - ఇవేగాక ఎన్నో కాలనీల్లో తెలుగువారు ఉన్నారు. తెలుగువారు చాలా మందే ప్రముఖ పదవుల్లో పని చేశారు. చేస్తూ ఉన్నారు. లోక్‌సభ స్పీకర్లుగా అనంత శయనం అయ్యంగార్ (1956-57), నీలం సంజీవరెడ్డి (1967-69, 1977), బాలయోగి (1998-99) పని చేశారు. మనకుండిన రాష్టప్రతుల్లో, సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, వివి గిరి తెలుగువారే. అపరచాణుక్యునిగా పేరు మోసిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి కాక మునుపు కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు మంత్రిగా పని చేశారు. ఇలా ఇంకెందరో తెలుగువారు ఇప్పటికీ కీలకమైన పదవుల్లో పనిచేస్తూనే ఉన్నారు.

కొత్త ఢిల్లీ, ఢిల్లీల్లో చూసేవీ, చూడాల్సినవీ!
కొత్త ఢిల్లీ అనేది 1911లో ప్రతిపాదించి రూపొందించినా, ఢిల్లీనగరం ప్రాచీనమైనది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో పాతవీ కొత్తవీ కూడా ఉన్నాయి. ఎర్రకోట, కుతుబ్‌మినార్, జంతర్‌మంతర్, రాష్టప్రతి భవనం, ఇండియా గేట్, పురానా ఖిల్లా, జుమ్మా మసీదు, హుమాయూన్ టూంబ్, లోడి గార్డెన్స్, పార్లమెంట్ హౌస్, లోటస్ టెంపుల్, లక్ష్మీనారాయణ మందిర్ (బిర్లా మందిర్), ఛత్రపూర్ కాళీ మందిర్, ఆర్కేపురం మలైమందిర్, లోడి రోడ్ సాయిమందిర్, మయూర్ విహార్ అయ్యప్ప గుడి, అక్షరధామ్ - ఇలా ఎనె్నన్నో ఉన్నాయి.

ప్రగతి మైదాన్, లోడి గార్డెన్స్, మొగల్ గార్డెన్స్, బుద్ధ జయంతి పార్క్‌లూ, కన్నాట్ ప్లేస్, పాలికా బజార్, కరోల్‌బాగ్, సరోజినీ నగర్, హాజ్‌కాస్, నెహ్రూ ప్లేస్ వంటి షాపింగ్ ప్లేస్‌లూ ఉన్నాయి. తీన్‌మూర్తి భవన్, నెహ్రూ ప్లానెటోరియం చూడదగ్గ ప్రదేశాలే. చాణక్యపురి ప్రాంతంలో దేశ విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు దారిపొడుగుతా చూడవచ్చు. అక్కడ సత్యమార్గ్, న్యాయమార్గ్ అని రోడ్ల పేర్లు చూడవచ్చు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం అటు దసరా ఉత్సవాలకే కాదు, నేడు రాజకీయాలకూ వేదికగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుప్రీంకోర్టు, హైకోర్టు భవనాలు బైట నుంచి చూడొచ్చు. హైదరాబాద్ హౌస్, బరోడా హౌస్‌లను బైట నించి చూడొచ్చు. బోట్‌క్లబ్బూ, ఇండియా గేటూ మానసిక ఆహ్లాదాన్నిస్తే, కాశ్మీరీ గేట్, అజ్మీరీ గేట్, మింటో రోడ్, అశోక స్తంభమూ, ఇనుప స్తంభమూ, కుతుబ్ మినార్ - ఇవన్నీ మరిన్ని చారిత్రాత్మక సాక్ష్యాలుగా కనిపిస్తాయి.
ఇవిగాక ఇండోర్ స్టేడియంలు, ఔట్‌డోర్ స్టేడియంలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు - చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి.

వౌనంగానే ఎదగమనీ..
మహాభారత కాలం నించీ మొగల్ సామ్రాజ్య కాలందాకా, అక్కడి నించీ బ్రిటిష్ కాలందాకా ఎన్నో సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలకూ నిలువెత్తు వౌనసాక్షిగా నిలిచింది ఢిల్లీ. మనకు స్వాతంత్య్రం వచ్చినా, పాకిస్తాన్‌గా మరో దేశం విడిపోయినా, నెహ్రూ, గాంధీ, శాస్ర్తీ వంటి మహానుభావులు నిష్క్రమించినా, ఇందిరాగాంధీ వంటి ప్రధానమంత్రులు హత్యకు గురైనా, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ వంటి యువ నాయకులు అంతర్థానమైనా - అన్నిటికీ తట్టుకొని, ఏమీ ఎరగనట్టు ముందుకు సాగిపోతోంది మన దేశ రాజధాని - కొత్త ఢిల్లీ. పార్లమెంటుపై దాడి యత్నం జరిగినా, టెర్రరిస్టుల తాకిడి ఎక్కువైనా అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కోవడమే తెల్సింది. మహాభారత కాలం నించీ మన దేశపు రాజధానిగా ఉన్న ఢిల్లీ రూపురేఖలు మార్చుకొని, ఎదుగుతూ ముందుకు పోతోంది. ఇటీవలి కాలంలో ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ ఘనంగా జరిపి, ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలబెట్టుకొన్న కొత్త ఢిల్లీ ప్రపంచంలోని ఆరుగురు అక్కచెల్లెళ్ల పక్కన, అంటే చికాగో, లండన్, ఉలన్‌బాటర్, మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, జోహనె్నస్‌బర్గ్ నగరాల సోదరిగా స్థానాన్ని సంపాదించుకొంది.   -వి.వి.వి.రమణ, December 25th, 2011-Courtecy: andhra   bhoomi