27, డిసెంబర్ 2011, మంగళవారం

జలకాలాడే జీవితం


శ్చిమ ఆఫ్రికాలోని చిన్న పల్లెటూరు జెన్వీ. కోటోనౌ రాజధానికి కూతవేటు దూరం. అక్కడి ‘నోకౌ’ సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకర్షించటానికి ప్రత్యేక కారణం - అక్కడి పక్షులూ - నీలాకాశం.. సరస్సు సోయగం కాదు.. జెన్వీ పల్లె ఈ సరస్సుపైనే ఉంది మరి. ఇక్కడి జనాభా 20వేల మంది. అడుగు తీసి అడుగు వేయటం అంతా నీటిపైనే. సుమారు 4వందల ఏళ్ల క్రితం ‘టిఫిను’ తెగవారు ఈ సరస్సుపై స్థిర నివాసాలు ఏర్పరచుకోటానికి కారణం తమని తాము శత్రువుల నుంచీ రక్షించుకోవటానికే. ‘్ఫన్’ తెగలకూ ‘టిఫిను’ తెగలకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తరచూ కొట్లాటలూ జరిగేవి. ఎంతోమంది మరణించారు. ఇంకొంతమంది గాయపడ్డారు. యుద్ధాలతో విసిగి వేసారిన ‘టిఫిను’ తెగ పెద్దలు ఆలోచించి ‘్ఫన్’ తెగల్లో ఉన్న సంప్రదాయ కట్టుబాటు (నీటిలో ఈత కొట్టకూడదన్నది వారి కట్టుబాటు)ని ఆధారం చేసుకొని ఈ సరస్సులో నాలుగు వందల ఏళ్లుగా నివాసముంటున్నారు.
ఇక్కడ ఎటు చూసినా - అన్నీ జలాలపైనే. అది రెస్టారెంట్ కావొచ్చు.. షాపులు కావొచ్చు.. ఇళ్లు కావొచ్చు. ఏదైనా సరే. అంతా పడవ ప్రయాణం. ఒక చోట నుంచీ ఒకచోటికి వెళ్లాలంటే - మనకిలా బైక్‌నో.. కారునో ఉపయోగించరు. జల చావిట్లో కట్టేసిన పడవ తీసుకోవటం బయల్దేరటమే. స్కూల్‌కి వెళ్లాలన్నా.. పక్క ఊరికి వెళ్లాలన్నా అంతే.
‘జెన్వీ’ ప్రాంతవాసుల ముఖ్య ఆదాయం టూరిజం.. చేపల వేట. వీరు చేపలను వేటాడ్డం చిత్రంగా తోస్తుంది. సరస్సు అడుగుభాగాన వెదురు బొంగులు పాతి వాటికి వలలను బిగిస్తారు. ఈ సరస్సులో అనేక రకాల చేపలు దొరుకుతాయి. రెస్టారెంట్లలోనూ ఘుమఘుమలాడే చేపల పులుసు.. వెదురు బియ్యంతో చేసిన అన్నం దొరుకుతుంది. ఇక్కడి వారి జీవన విధానాన్నీ చూట్టానికి దేశ విదేశీ పర్యాటకులు తరచూ వస్తూంటారు. కొన్నాళ్ల క్రితం వరకూ వేరే ప్రాంతాల వారిని వీరు ఆహ్వానించేవారు కాదు. ముభావంగా ఉండేవారు. తమ జాతీయ సంపదని కొల్లగొడతారేమోనన్న భయం. వీరికి ‘్ఫన్’ శత్రు భయం తొలగించటానికి చాన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. సరస్సు అడుగు భాగం నుంచీ వేసుకుంటూ వచ్చిన వెదురు బొంగులపై చిన్నపాటి స్టేజ్ లాంటిది కట్టి.. వాటిపై ఇళ్లను నిర్మించుకుంటారు. చూట్టానికి ఎంతో ముచ్చట గొలిపే ఈ సంస్కృతి ఆ నోటా ఈ నోటా తెలియటంతో ఇక్కడికి వచ్చేవారి తాకిడి గణనీయంగానే ఉంటోంది. జెన్వీ ప్రాంతం చేరుకోవాలంటే - అబోమె - కలవీ ప్రాంతం నుంచీ పశ్చిమ దిశగా పయనించాల్సి ఉంటుంది. ప్రొద్దునే్న అబోమె నుంచీ టాక్సీలు.. ప్రైవేటు వాహనాలు బయల్దేరతాయి. కొద్ది దూరం ఆయా వాహనాల్లో ప్రయాణించి - అక్కడ్నుంచీ మోటార్ బోట్లను కానీ.. సాదాసీదా పడవల్లోగానీ ప్రయాణించాలి.
ఒకప్పుడు అంటే క్రీ.శ.16-19 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని ‘స్లేవ్ కోస్ట్’ అని వ్యవహరించేవారు. యూరోపియన్లు ఇక్కడ బానిస వ్యాపారం చేసేవారు. ‘ఔదా’ అనే స్థానిక మ్యూజియంలో ఈ చరిత్రని తిరగేయ్యొచ్చు. 1993లో బెనిన్ ప్రభుత్వం నిర్వహించిన ‘వైడర్ ఆర్ట్ ఫెస్టివల్’లో ఆనాటి విషాద ఉదంతాలను ఎన్నింటినో ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేసింత్తర్వాత - మార్పు కానవచ్చింది.
కోటోనౌకి వాయవ్య దిశగా 145 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం క్రీ.శ.17వ శతాబ్దంలో అబోమె వంశీకుల ఏలుబడిలో ఉండేది. బెనిన్ ప్రాంతం వీరి జన్మస్థలం. ఐతే తరచూ జరిగిన యుద్ధాల కారణంగా ‘టిఫినో’ తెగ వారు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఆ కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిన సంస్కృతుల్లో ఇదీ ఒకటి.
-Courtecy: Andhra Bhoomi,December 25th, 2011