1, డిసెంబర్ 2011, గురువారం

బలివాడ ('బెజవాడ' రివ్యూ)

సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్‌
నటీనటులు: నాగచైతన్య, అమలా పాల్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
సంగీతం: అమర్ మోహ్లి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, విక్రమ్, భూపి తతుల్
ఛాయాగ్రహణం:ఎస్.కె.భూపతి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
ఫైట్స్ :జావేద్
ఆర్ట్: కృష్ణ మాయ
నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు
కధ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: వివేక్‌కృష్ణ
విడుదల తేదీ:డిసెంబర్ 1, 2011


1989లో విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ తో 'శివ'చేసి నాగార్జున కి బ్రేక్,కెరీర్ కి ఊపు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనే మళ్సీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే హీరో కొడుకుతో అదే బ్యాక్ డ్రాప్ లో 'బెజవాడ'సినిమా చేస్తున్నాడంటే అందరికీ ఆసక్తే. దానికి తోడు బోనస్ లా ఈ సారి కాంట్రావర్శిని కూడా రగలించి సినిమాకు ప్రారంభం రోజు నుంచే క్రేజ్ తెచ్చాడు. అయితే అవన్నీ సినిమాకు మంచి ఓపినింగ్స్ తేవటం వరకే పనికివస్తాయని,విషయం లేకపోతే ఇవన్నీ ఎందుకూ కొరగావని మరో మారు తేలిపోయింది. వర్మకు ప్లాప్ లు అలవాటే కానీ,నాగచైతన్యే రెండో సారి సైతం యాక్షన్ హీరోగా నిలదొక్కుకోలేని స్ధితిని ఈ సినిమా మిగిల్చింది.

శివకృష్ణ(నాగచైతన్య)ఓ కాలేజి స్టూడెంట్(ఎప్పుడూ క్లాసులుకి వెళ్లినట్లు చూడలేదేం అని అడగొద్దు).అతను సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తూంటాడు.ఈ ప్రేమాయణం ఇలా ఉంటే శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటే నే అబిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి మన కాలేజి స్టూడెంట్ శివకృష్ణ ఆవేశంగా బయిలు దేరతాడు. అప్పుడు ఏం జరిగింది.ఎలా తన ప్రతీకార జ్వాలలలో సిటిని మండించాడు అనేది మిగతా కథ.

"కొత్త దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. అందులో వర్మ కూడా ఒకరు తప్ప, ఆయన ఒక్కరే కాదు. అక్కడక్కడా నాకు నచ్చిన షాట్స్, సీన్లను 'బెజవాడ'లో కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాను'' అంటూ దర్శకుడు వివేక్ కృష్ణ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ఆయన తనను తర్వాత ఎవరూ వేలు పెట్టి చూపకూడదని చెప్పారో మరెందుకో కానీ..ఈ సినిమాలో మొదటి సీన్ చూసినప్పుడే అతను చెప్పింది అక్షరాలా నిజమని అర్దమవుతుంది. ఎందుకంటే సినిమా ప్రారంభమే గాఢ్ ఫాధర్ లోని తొలి సన్నివేశం బెజవాడలో కనిపిస్తుంది.అలాంటివి ఈ సినిమాలో ప్రతీ నాలుగు సీన్స్ కి ఒకటి పంటిక్రింద రాయిలాగ తగిలి మన జ్ఞానపశక్తి మీద మనకు అపారమైన నమ్మకం కలిగిస్తూంటాయి.అవన్నీ తెలుగు సినిమాలు కామనే,మాకు తెలిసిన బెజవాడ రాజకీయాల మీద సినిమాకదా అని ఉత్సాహపడితే...ఈ సినిమాకీ,బెజవాడ రౌడీ రాజకీయాలకు ఏమీ సంభందం లేకుండా చేసి తుస్సుమనిపిస్తాడు.

ఆ విషయం ప్రక్కన పెడితే సినిమా కథ,మాటలు సమకూర్చుకున్న ఈ దర్శకుడు వాటిని గ్రిప్పింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయటంలో విఫలమయ్యాడు. ఎక్కడో ఒకటి రెండు డైలాగులు తప్ప ఆసక్తి కలిగించవు .అందులోనూ తొలిసగంలో అస్సలు హీరో కనపడేది చాలా తక్కువ సేపు..మొత్తం కథను సెటప్ చెయ్యటంలో హీరోని పాటలకు తప్ప కథలోకి తీసుకురాలేకపోయారు. ఇక ద్వితీయార్దం విషయానకి వచ్చేసరికి..విలన్ పరిస్ధితి దారుణంగా తయారవుతుంది. హీరో కొట్టిన దెబ్బకు మందు రాసుకోవటమూ, డైలాగులు చెప్పటంతో క్లైమాక్స్ కు చేరువ అవుతుంది. అలా విలన్ నీరసపడి,హీరోను ఏమీ చెయ్యలేక,భయపడుతూ,హీరోని అంత గొప్పవాడు..ఇంత గొప్పవాడు అని భజన చేస్తూ కూర్చోవటంతో హీరో కి ఏం చేయాలో పాలుపోదు. కాస్సేపు విజయవాడలో రౌడీయిజం లేకుండా చేస్తానని శపధాలు చేస్తాడు. ఆ కాస్సేపటికే విలన్ అంతు చూడాలి అని మళ్లీ డైలాగులు చెప్తూంటాడు.ఇలా ఇద్దరూ సినిమాకు కీలకమైన సెకండాఫ్ సమయాన్ని డైలాగులు చెప్పుకోవటంతో గడిపేయటంతో,క్యారెక్టర్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టడం మొదలైంది.

ఇదిలా ఉంటే దీనికి తోడు కథకు సంభందం లేకుండా బ్రహ్మానందం,ఎమ్ ఎస్ నారాయణ ల కామెడీ,హీరో,హీరోయిన్స్ డ్యూయిట్స్ అసందర్భంగా వచ్చి విసిగిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కేవలం పాటలకే పరిమితం చేసారు.ఆమె వచ్చిదంటే గ్యారెంటిగా పాటో, లేకపోతే హీరోకు హితభోధలు చేయటానికో అన్నట్లు తయారైంది. ఆ పాటలైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అన్నీ సిగరెట్ కు జనం బయిటకు పారిపోయే పాటలే. ఇక కెమెరా వర్క్ గురించి,ఎడిటింగ్ సినిమాకు తగ్గట్లే నాశిరకంగా ఉన్నాయి.దర్శకత్వం గురించి చెప్పాలంటే తెలుగులో వచ్చే సి గ్రేడ్ సినిమాల తరహాలో ఉంటుంది.

ఏదైమైనా రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే జన్నాల్ని మోసం చేసారు.'బెజవాడ'పూర్తిగా నిరాశపరిచే సినిమా.అయితే అర్ధం లేని హింస,సిట్యువేషన్ లేని పాటలు,నవ్వురాని కామిడీ లని సినిమాలో ఎలా ఇమర్చవచ్చు అనే విషయాలను సోదాహణంగా తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. -జోశ్యుల సూర్య ప్రకాష్

వంగవీటికి వ్యతిరేకం, కాదు: బెజవాడపై భిన్నవాదనలు
 విజయవాడ: విడుదలకు ముందే సంచలనం సృష్టించిన బెజవాడ చిత్రంపై విజయవాడలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నగరానికి చెందిన ఏ వర్గంలోని పాత్రలు లేవని కొందరు అభిప్రాయపడితే మరికొందరు మాత్రం వంగవీటి కుటుంబానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం బెజవాడ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో చూసిన వారు వివిధ రకాలుగా స్పందించారు. ఈ చిత్రాన్ని వంగవీటి, దేవినేని వర్గానికి చెందిన వారు కూడా వేరు వేరు చోట్ల తిలకించారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మాట్లాడుతూ చిత్రంలో ఏ వర్గానికి చెందిన పాత్రలు లేవని కేవలం క్రేజ్ కోసమే బెజవాడ టైటిల్ పెట్టారని విమర్శించారు.
కొంతమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ చాలామంది చిత్రం వంగవీటి వర్గానికి వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. దీంతో వంగవీటి వర్గం బెజవాడ చిత్రంపై మండిపడుతోంది. విజయవాడలోని ఇద్దరు నేతలు ఎవరి కుటుంబాల కోసం వారే పోరాటం చేశారని ప్రజల కోసం చేసిందేమీ లేదని అయితే ఈ చిత్రం పూర్తిగా ఇరుకుటుంబాల పాత్రలు ఉన్నవని చెప్పలేమని అలాగే లేవని కూడా చెప్పలేమని, అన్నను తమ్ముడు చంపడం వంటి కొన్ని పాత్రలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఉత్కంఠకు దారితీసినంతగా లేదన్నారు. ఈ చిత్రాన్ని చూసి ప్రస్తుతం గొడవలకు దిగే పరిస్థితి లేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ట్రేడ్ టాక్: సిటీల్లో సీన్ లేని 'బెజవాడ'
Bejawada

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడకు సిటీల్లో అంత క్రేజ్ కనపటడం లేదు. ముఖ్యంగా మల్టి ఫ్లెక్స్ లలో ఓ పెద్ద హీరో సినిమాకు వచ్చినట్లు ఓపినింగ్స్ కాకపోయినా బుక్కింగ్స్ కూడా రాకపోవటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. గతంలో రక్త చరిత్రకు ఓ వారం ముందు నుంచే బుక్కింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే దానికి కారణం..పోస్టర్స్, ట్రైలర్స్, వాటిని డిజైన్ చేసి వదిలిన ప్యాకేజ్ విధానం అంటున్నారు. అంతేగాక రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కాకపోవటం, వివేక్ కృష్ణ కొత్త దర్శకుడు కావటం కూడా ప్రారంభ వసూళ్లపై ప్రభావం చూపిస్తాయని,అంతకు మించి నాగచైతన్య గత చిత్రం దడ యాక్షన్ ఎంటర్టైనర్ కావటం, అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం కూడా సినిమాకు ఓపినింగ్స్ కు మైనస్ గా మారింది. ఇక ఈ చిత్రానికి బి,సి సెంటర్లలో ఓ రేంజి కలెక్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే సిటీల్లోనూ కలెక్షన్స్ పుంజుకుంటాయి. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అమలా పౌల్ హీరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్య శివకృష్ణ అనే స్టూడెంట్ గా కనపడతాడు. తను పుట్టి పెరిగిన బెజవాడ కోసం ఎంతకైనా తెగించే యువకుడుగా ఈ పాత్రను డిజైన్ చేసారు. దర్శకుడు వివేక్ కృష్ణ మాట్లాడుతూ ..యాక్షన్‌, భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మాస్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుడిగా తను తెరపై కనిపించే తీరు అందరికీ నచ్చుతుంది. చైతన్య-అమలాపాల్‌ మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యువతరాన్ని మెప్పించేలా ఉంటాయి. బెజవాడ నేపథ్యం ఒక కీలక పాత్రలా చిత్రానికి ఉపయోగపడిందని అన్నారు.
'బెజవాడ' ప్రీమియర్ షో టాక్ ఏంటి?
రామ్ గోపాల్ వర్మ, నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన బెజవాడ చిత్రం ప్రివ్యూలను ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న రాత్రి వెయ్యటం జరిగింది. చూసిన వారి టాక్ ప్రకారం ఈ చిత్రం బెజవాడ చిత్రం రెండు కుటుంబాల మధ్యన జరిగే రివేంజ్ స్టోరీ. విజయవాడని నేపధ్యంగా తీసుకున్నారు కానీ నిజానికి ఈ కథ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగినా పెద్ద తేడా ఉండదు. చాలా కాలంగా సిటీలో ఉండే లోకల్ పొలిటీషన్స్ వైరం ఈ సినిమాకు కీలకం. అయితే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, సీన్స్ విజయవాడ నేటివిటిలోని కొందరని రిసెంబల్ చేసేలా తీసుకున్నారు. ప్రత్యేకమైన ప్రాంతంలోని వారి మనోభావాలని, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ఈ చిత్రంలో ఎక్కువ కనపడిందని షో చూసిన కొందరు కామెంట్స్ చేయటం గమనార్హం. రెగ్యులర్ రివేంజ్ స్టోరీనే తప్ప మరొకటి కాదని, మాస్ కు పట్టే అవకాశ ముందని మరికొందరు అంటున్నారు. బోయపాటి శ్రీను తరహాలో హింస ని బాగా గ్లోరిఫై చేసి చూపాడని సినిమా ఎలాగున్నా దర్శకుడుకి మాత్రం పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాసం ఉందని కొందరు సిని పెద్దలు అనుకోవటం జరిగింది. ఫస్టాప్ లో నాగచైతన్య పెద్దగా కనపడడు. సెకండాఫ్ లో అతను పూర్తిగా తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అయితే యాక్షన్ పరంగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందంటున్నారు. నాగార్జున శివతో పోల్చి చూసే ప్రయత్నం మాత్రం అనవసరం అని తెలుస్తున్నారు.
’బెజవాడ’ కష్టాలపై...నాగార్జున రిక్వెస్ట్!బెజవాడలో..బెజవాడ సినిమాకు చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇంతకీ ఆ దుస్థితి ఏమిటంటే....ఈ సినిమాకు విజయవాడలో అసలు థియేటర్లే దొరకడం లేదు. దొరకడం లేదనడం కంటే ఈ సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ల యజమానులు ఇష్ట పడటం లేదు అనడం కరెక్ట్. మామూలుగా ఈ రేంజ్ సినిమా బెజవాడ, పరిసర ప్రాంతాలు కలిపి కనీసం 40 థియేటర్లలో విడుదల కావాలి. కానీ కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే దొరికాయి. బెజవాడ సినిమా రూపొందుతున్నప్పటి నుంచే కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది. ఈ సినిమా బెజవాడలో గతంలో జరిగిన ముఠా తగాదాల నేపథ్యంలో రూపొందించారని, బద్దశత్రువులైన దేవినేని, వంగవీటి వర్గీయుల ప్రస్తావన ఈ సినిమాలో ఉందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శిస్తే ఏమైనా గొడవలు జరిగితే థియేటర్లను నష్టపోతాం అని వాటి యజమానులు భయ పడుతున్నారు. చివరకు నాగార్జున ఫోన్ చేసిన మరీ థియేటర్ల యజమానులను రిక్వెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్లిందంటే.....అక్కడి సీన్ అర్థం చేసుకోవచ్చు.  ఈ సినిమా విడు దల  నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. .