27, జనవరి 2012, శుక్రవారం

తెలుగు ప్రధాన వార్తలు (పూర్తి వివరాలు కోసం శీర్షిక క్లిక్ చేయండి)





4, జనవరి 2012, బుధవారం

రాజా ఆంపట్ ద్వీపాలు

గ్నేయ ఆసియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఇండోనేషియా ఒకటి. ఇండోనేషియాలో మొత్తం 17 వేల ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 11 వేల ద్వీపాలలో జనావాసం ఉంది. ఒక్కో ద్వీపంలో ఒక్కో రకం పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బాలి, కలిమంటన్, బైలమ్, సుమత్రా, లోంబోక్, సులావెసి లాంటి ద్వీపాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. కాని ప్రపంచానికి పెద్దగా తెలియని ఇండోనేషియా పర్యాటక కేంద్రంలో కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి రాజా అంపట్ ద్వీపాలు.
రాజా అంపట్ అంటే, నలుగురు రాజులు అని అర్థం. ఇతిహాసాల ప్రకారం ఇక్కడి ఆ నాలుగు ద్వీపాల పేర్లు వాటిని పాలించిన వైజియో, మిశూల్, సలావతి, బటంట్ అనే ఇస్లాం రాజుల పేర్ల మీద ఏర్పడ్డాయి. ఇక్కడి పర్వత గుసల్లో చెక్కిన పురాతన చిత్రాలను చూడొచ్చు. ఇండోనేషియన్స్‌కే పెద్దగా తెలియని ఈ రాజా అంపట్ ద్వీపాలు గత కొనే్నళ్లుగా పర్యాటక కేంద్రాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జకార్తాలో నివసించే విలేకరి యాయూ యునియెర్ అనే ఆమె 2007 నించి నేటి దాకా ఏటా ఓసారి ఈ ద్వీపాలకి వెళ్లి, అక్కడ పర్యాటకులను ఆకర్షించే అంశాల మీద రాసిన వాయసాలు, విశేషాల వల్ల ఇక్కడికి పర్యాటకులు రావటం మొదలైంది.
పపావు తీరానికి కొద్ది దూరం నించి రాజా అంపట్ ద్వీపాలకి సముద్ర మార్గంలో చేరుకోడానికి వారం నించి పది రోజులు పడుతుంది. కాని ఇంత శ్రమపడి వెళ్లిన వారికి చక్కటి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా చేపలు, పగడాలు లాంటి సముద్ర విషయాల మీద ఆసక్తిగల వారికి ఇక్కడ చూడడానికి చాలా విశేషాలు ఉన్నాయి.
ఇండోనేషియాలోని అత్యంత పెద్ద జాతీయ మెరైన్ పార్క్ ఇక్కడే ఉంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన పగడాల ద్వీపం కూడా ఇక్కడే ఉంది. అంతేకాక ప్రపంచంలో మరెక్కడా లేని అనేక చేపల జాతులు కూడా రాజా అంపట్ ద్వీపాల చుట్టూగల సముద్రంలో ఉన్నాయి. ఇది ప్రపంచంలోని తొలి మెరైన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్! పదివేల ఏళ్ల క్రితం ఇక్కడ జనావాసం ఉండేది. మూడు వేల ఏళ్ల క్రితపు కళా వస్తువులు, ఆసియాలోని ఇతర ప్రాంతాలతో వర్తకం జరిపిన దాఖలాలు అనేకం ఇక్కడ లభించాయి. సముద్ర గర్భంలో పురావస్తు పరిశోధన శాఖ చేసిన పరిశోధనల వల్ల ఈ విషయాలు తెలిసాయి.
రాజా అంపట్ మొత్తం పదిహేను వందల చిన్న ద్వీపాల సముదాయం. రాజా అంపట్‌లోని నాలుగు పెద్ద ద్వీపాలు కాక మిగిలినవి చిన్నవి. అన్నిటికన్నా చిన్నదాని పేరు కొఫయూ. ఈ ద్వీపాలు, చుట్టూగల సముద్ర విస్తీర్ణం మొత్తం 40 వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడమే. ఇక్కడ అనేక తెగలవారు చిన్నచిన్న కాలనీలలో నివసిస్తున్నారు. క్రైస్తవం ప్రధాన మతం. ఇక్కడ సున్నపు కొండలు, వాటిలోని గుహలు, ఎతె్తైన కొండల మీంచి కనపడే ప్రకృతి దృశ్యాలు, సీఫుడ్, కాలుష్యం లేని వాతావరణం, సముద్ర సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని 75 శాతం చేపల జాతులు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇంకా 600 జాతుల పక్షులు, ఐదు జాతుల రక్షిత సముద్ర తాబేళ్లు, 57 జాతుల ఫ్రింప్ చేపలు, ఇక్కడ మాత్రమే లభ్యమయ్యే 27 జాతుల రీఫ్ చేపలు, కొండ గుహల్లో పారే నీరు, అనేక రంగుల ఇసుకగల ఈ ద్వీపాలు సుందరంగా ఉంటాయి. కనీసం 15 మంది పర్యాటకులతో 285 అమెరికన్ డాలర్లకు సరిపడ ఇండోనేషియన్ కరెన్సీతో ఇక్కడికి వెళ్లి రావచ్చు. ఏర్‌కండిషనల్ ఫెర్రీలో ఫైవ్‌స్టార్ వంట వాళ్లుంటారు. మే నించి సెప్టెంబర్ దాకా సీజన్. ఇండోనేషియా ట్రావెల్‌గైడ్‌లో రాజా అంపట్ గురించి లభ్యం కాదు. హైదరాబాద్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకి విమానంలో, అక్కడి నించి రోడ్డు, సముద్ర మార్గాల్లో రాజా అంపట్ ద్వీపాలకు చేరుకోవచ్చు. ఇక్కడి స్థానికులే గైడ్లుగా వ్యవహరిస్తూంటారు. వారికి పోకచెక్కలు, మిఠాయిలు ఇస్తే ఎంతో సంతోషిస్తారు.-ఆశ్లేష(సౌజన్యం: ఆంధ్ర భూమి) 

వేట

గత రెండు గంటలుగా అతను సెడాన్ కారుని నడుపుతున్నాడు. దాన్ని సాధ్యమైనంత వేగంగా పోనిస్తున్నాడు. కొండల మీదకి వచ్చాక దూరంగా కింద సేంటా ఆల్టా పట్టణ దీపాలు కనపడ్డాయి. కొండ దిగి లోయని దాటితే తను ఆ పట్టణాన్ని చేరుకోగలడని ఉత్సాహంగా అనుకున్నాడు. అతని కుడికాలు ఏక్సిలేటర్ పెడల్‌ని మరింత నొక్కింది. చల్లటి గాలి అతనికి కిటికీలోంచి తగులుతోంది.
తన కారులోని డేష్ బోర్డ్‌కి ఉన్న గడియారంలోని రేడియం ముళ్లని చూసి సమయం పదకొండుంపావని గ్రహించాడు. అతని సెడాన్ కొండ దిగి లోయని తేలిగ్గా దాటింది. అతను సేంటా ఆల్టాకి చేరుకుంటూండగా రేడియోలోని సంగీతం ఆగిపోయి ఓ అనన్సౌర్ కంఠం వినిపించింది. అతను కుడిచేత్తో రేడియ వాల్యూం ని పెంచాడు. ఎదురుగా రోడ్డు మధ్య తెల్లటి గీతలు కనిపిస్తున్నాయి.
జైలు నించి పారిపోయిన హంతకుడు
ఫ్రాంక్ వెర్నన్ కోసం జరిగే వేట ఈ రాత్రంతా కూడా అతను దొరికే దాకా జరుగుతుంది అని పోలీస్ చీఫ్ చెప్పాడు. ఈ మధ్యాహ్నం కోల్‌మన్ నగరంలో బ్యాంక్ రాబరీలో పాల్గొని, సెక్యూరిటీ గార్డుల్లోని ఒకర్ని చంపాడు. రాష్ట్ర రాజధాని నించి నగదుని రవాణా చేసే వేన్‌ని ఫ్రాంక్ దోచుకున్నాడు. దొంగిలించిన ఓ కారులో అతను పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. అతని భార్య మేరియానా నివసించే సేంటా ఆల్టాకి అతను వెళ్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
అతను చెవులు రిక్కించి వింటున్నాడు.
శ్రీమతి వెర్నన్ తన భర్త దొంగతనం ప్రయత్నం చేసి తప్పించుకున్నాక నాలుగువేల డాలర్లని బేంక్‌లోంచి డ్రా చేసి మాయం అయిందని తెలుస్తోంది. ఫ్రాంక్ ఆమెకి ఫోన్ చేసి ఉంటాడని, వారిద్దరూ ఓ రహస్య ప్రదేశంలో కలుసుకునే ఏర్పాటు చేసుకుని ఉంటారని కూడా పోలీసులు భావిస్తున్నారు. వెర్నన్ దగ్గర పిస్తోలు ఉంది. అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. సేంటా ఆల్టా ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకి...
తనకి ముఖ్యమైన సమాచారం తెలిసిందని భావించాడు. కాబట్టి మిగతాది వినదలచుకోలేదు. అతను వెంటనే రేడియో స్విచ్‌ని ఆఫ్ చేసేశాడు. అతని నడుం దగ్గర పేంట్‌లోకి దోపి ఉన్న పిస్తోలు ఆకారం షర్ట్‌లోంచి బయటకి చూపరులకి తేలిగ్గా కనిపించేలా ఉంది.
నగర సరిహద్దులు సమీపించాక అతను కారు వేగాన్ని తగ్గించాడు. తనని అధిక వేగంతో కారుని నడిపే నేరం మీద ఏ పోలీస్ ఆపడం అతనికి ఇష్టం లేదు.
సేంటా ఆల్టా నగర వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక్క కారు కూడా అతనికి తారసపడలేదు. నది పక్కన పారిశ్రామికవాడలో ఏడు మైళ్ల దూరం ప్రయాణించాక అతను ఊళ్లోని ఓ చిన్న కొండవైపు కారుని పోనించాడు. రాళ్లు తేలిన చిన్న మట్టిరోడ్డు ఎక్కి ఓ మైలుదూరం వెళ్లాడు. ఆ రోడ్డు మీద మలుపులు అధికంగా ఉన్నాయి. మరో మైలుదూరం వెళ్లాక ఓ ప్రైవేటు రోడ్ కనిపించింది. కారుని ఆ రోడ్‌లోకి పోనించి అర మైలు వెళ్లాక వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. కారు ఎవరికీ కనపడకుండా తుప్పల్లోకి పోనించి దిగి
తలుపు తాళం వేసి ఆ మట్టి రోడ్ మీదకి వచ్చాడు. అక్కడి నించి చూస్తే కారు కనపడటం లేదు. దట్టంగా ఉన్న ఫైన్
చెట్లు అడ్డుగా ఉన్నాయి.
బాగా చల్లగా ఉంది. గాలి కూడా వేగంగా వీస్తోంది. చంద్రుడు మబ్బుల వెనక దాక్కోవడంతో వెలుగు కూడా పెద్దగా అక్కడ పడటం లేదు. అతను ఆ రోడ్డు పక్కన ఉన్న రాళ్ల మీద వొంగి నిశ్శబ్దంగా, పిల్లిలా, రహస్యంగా పైకి నడిచాడు. అవతల మేరియానా తన కోసం ఎదురుచూస్తూండి ఉండాలి అనుకున్నాడు.
అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. నెమ్మదిగా ఫైన్ వృక్షాల మధ్యకి నడిచాడు. అతను నిశ్శబ్దంగా నిలబడి ఏదైనా వినపడుతుందేమోనని చెవులు రిక్కించి నాలుగైదు నిమిషాలసేపు విన్నాడు. నిశ్శబ్దం. నేల మీద బోర్లా పడుకుని నెమ్మదిగా ముందుకి పాకాడు. అతనికి ఫోర్డ్ కారు కనిపించింది. అదే సమయంలో మబ్బుల వెనక నించి వచ్చిన చంద్రుడి కాంతి ఓ బండ రాయి మీద తలకి స్కార్ఫ్ కట్టుకుని కూర్చున్న ఓ ఆకారం కనపడింది. అది మేరియానాది అని గ్రహించగానే అతనికి ఆనందం వేసింది. నెమ్మదిగా అతను పాకుతూనే ఆమె వైపు వెళ్లాడు. అప్పటికే అతని కుడి చేతిలో సేఫ్టీ కేచ్ తీసిన పిస్తోలు సిద్ధంగా ఉంది. ఆమెకి పదిహేను అడుగుల దూరం చేరాక అతను ఆగి వినసాగాడు. రాత్రి శబ్దాలు తప్ప అతనికి ఇంకేం వినపడలేదు. అతను తలని పైకెత్తి నెమ్మదిగా పిలిచాడు.
‘మేరియానా’
ఆమె తల తిప్పకపోవడంతో మరోసారి ఇంకాస్త గట్టిగా పిలిచాడు.
‘మేరియానా’
ఈసారి ఆమె తల ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగింది అదే సమయంలో ఆమె లేచి నిలబడింది.
‘డార్లింగ్. నువ్వు అసలు రావని అనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నావు?’ ఆమె కంఠం ఆనందంగా వినిపించింది.
‘నువ్వు ఒంటరిగానే ఉన్నావా?’
‘అవును. నాకు ఇక్కడ ఒంటరిగా వేచి ఉండటానికి భయంగా ఉన్నా నీ కోసం ఎదురుచూస్తున్నాను’
‘నేను వచ్చేసాగా. ఇక నీ భయం పోతుంది’
‘అవును. నువ్వు నా పక్కన ఉంటే నాకూ ఇక భయం దేనికి?’
సేఫ్టీ కేచ్‌ని మూసి అతను లేచి ఆమె వైపు అడుగులు వేశాడు. ఆమె అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరు ఒకరినొకరు కొద్దిసేపు గాఢంగా చుంబించారు.
‘నేను సరిగ్గా బయటకి వెళ్లేప్పుడు నీ ఫోన్ వచ్చింది.. లేదా..’
అకస్మాత్తు గా అతను తలని అటు ఇటు తిప్పి చూశాడు. మళ్లీ చెవులు రిక్కించి విన్నాడు.
‘ఏమి?’
‘ష్’
‘ఏమైంది?’
‘విను’
కొద్ది క్షణాల తర్వాత ఆమెకి కూడా ఆ శబ్దం వినిపించింది.
‘కారు శబ్దం కదా?’ భయంగా అడిగింది.
‘అవును’
అతని కారు వచ్చిన రోడ్డుకి అవతలి వైపు నించి అదే ప్రైవేటు రోడ్డు మీదకి వస్తోందో కారు. మేరియానా కళ్లు భయంతో పెద్దవయ్యాయి. పెదవులు వణుకుతున్నాయి.
‘మేరియానా! భయపడకు. కార్లో కూర్చో. నిశ్శబ్దంగా ఉండు. ఎదురుగా తప్ప ఎటూ చూడకు. అర్థమైందా?’
ఆమె తల ఊపింది.
‘ప్రమాదం ఉండదుగా?’ అడిగింది.
‘జరిగేది చూస్తూండు. అంతే. ఎట్టి పరిస్థితుల్లో కారు దిగక’ అతను హెచ్చరించాడు.
ఇటువైపే వచ్చే కారు హెడ్‌లైట్లు కింద నించి అతనికి కనిపించాయి. అకస్మాత్తుగా హెడ్‌లైట్లు ఆరిపోయాయి.
కొద్ది క్షణాల తర్వాత కారు ఇంజన్ శబ్దం కూడా ఆగిపోయింది. కారు తలుపు మూసిన శబ్దం చిన్నగా వినిపించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. మళ్లీ అతను తన కుడిచేతిలోని పిస్తోలు సేఫ్టీ కేచ్‌ని తీసి తయారుగా పట్టుకున్నాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగి ఎత్తుగా ఎదిగిన ఫెర్న్ మొక్కల చాటున నక్కాడు. కార్లోని మేరియానా ఆకారం అతనికి కనిపిస్తోంది.
అతను చీకట్లోకి కళ్లు చికిలించి చూస్తూ ఏదైనా కదలికలు కనిపిస్తాయా అని జాగ్రత్తగా చూడసాగాడు. అలాంటివేమీ అతనికి కనపడలేదు. ఎలాంటి శబ్దం కూడా వినపడలేదు. కాలం ఆగిపోయినట్లుగా అతనికి అనిపించింది. మోకాళ్ల మీద కూర్చుని వేచి చూడసాగాడు. అకస్మాత్తుగా కారుకి పక్కనే ఫెర్న్ మొక్కల్లో ఏదో కదిలిన చప్పుడు విన్నాడు. అతను శ్రద్ధగా చూశాడు. ఫైన్ వృక్షాలు, నీడలు తప్ప ఇంకేం కనిపించలేదు. కొద్దిసేపు అటువైపే గుచ్చిగుచ్చి చూడసాగాడు. అకస్మాత్తుగా ఓ నీడ మిగిలిన నీడల్లోంచి విడివడటం గమనించాడు. అది కదిలి మేరియానా కారు వైపు రాసాగింది.
అతని చూపుడు వేలు ట్రిగ్గర్ దగ్గరికి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో మళ్లీ మబ్బుల చాటు నించి చంద్రుడు బయటకి వచ్చాడు. అతను కారు వైపు వెళ్తూ కనిపించాడు. అతని మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ఊపిరి బిగపట్టి అతను తనకి అతి సమీపంగా వచ్చే దాకా ఆగాడు. వెంటనే మోకాళ్ల మీద కూర్చున్న అతను తన ఎడం చేతిలో తయారుగా పట్టుకున్న రాతిని అతని వైపు విసిరాడు. అది వెళ్లి అతని వెనక చప్పుడు చేస్తూ పడింది.
ఆ కొత్త వ్యక్తి తక్షణం వెనక్కి తిరిగాడు. అతని చేతిలోని తుపాకీ ఓసారి పేలింది. అది పేలీ పేలగానే ఎడం చేతిని ఆధారంగా చేసుకుని, కుడిచేతిలోని పిస్తోలుని మరో రెండుసార్లు కాల్చాడు అతను. కొత్త వ్యక్తి ఎగిరి చిన్నగా కేక వేస్తూ నేల మీద పడ్డాడు. మేరియానా తుపాకీ చప్పుళ్లకి అరిచిన అరుపులు గాల్లో కలిసిపోయాయి.
వెంటనే ముందు వచ్చిన వ్యక్తి లేచి కింద పడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. అతని చేతిలో పిస్తోలు దూరంగా పడి ఉంది. అతని కళ్లు ఆకాశంలోకి నిశ్చలంగా చూస్తున్నాయి.
అతను కారు తలుపు తెరచుకుని మేరియానా పక్కన కూర్చున్నాడు.
‘అతను..?’ అర్ధోక్తిగా అడిగింది.
‘అవును’
ఆమె చేతులు వెంటనే అతన్ని చుట్టేశాయి.
‘నేను ఇంకొంచెం ముందుగా నీకు ఫోన్ చేయాల్సింది. ఎందుకు ఆగానో నాకే తెలీదు. ఐదు నిమిషాల తేడా. అంతే. లేదా అతనే నీకన్నా ముందు వచ్చేసి ఉండేవాడు...’ ఏడవసాగింది.
‘నేను టైంకే వచ్చి అంతా సుఖంగా ముగిసిందిగా. అది మనకి ముఖ్యం’
‘పాల్! కొద్ది నెలల క్రితం నువ్వు నాకు పరిచయం అవడం నా అదృష్టం. ప్రేమంటే ఏమిటో నాకు నీ ద్వారానే తెలిసింది’
అతను ఆమెని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు.
‘నీ భర్త ఫ్రాంక్ వెర్నన్‌ని పట్టుకునే ప్రయత్నంలో నిన్ను కలవాల్సి రావడం నా అదృష్టం’
వారి మధ్య ఓసారి సంభోగం జరిగాక అతను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
‘నేను స్పెషల్ ఏజెంట్ బేరోస్‌ని. ఫ్రాంక్ వెర్నన్‌ని మీరు ఇక వెదకక్కర్లేదు. వాడు మరణించాడు.’
(జాక్ ఫాక్స్ కథకి స్వేచ్ఛానువాదం)
-మల్లాది వెంకట కృష్ణమూర్తి(సౌజన్యం: ఆంధ్ర భూమి)