27, డిసెంబర్ 2011, మంగళవారం

‘శక్తి’ తక్కువ ‘దూకుడు’ ఎక్కువ


సంక్రాంతి పండుగతో ఏటా సినిమాల సీజన్‌కు తెర లేస్తుంది. సమ్మెలు, బంద్‌ల కారణంగా ఈ ఏడాది సంక్రాంతి దగ్గర సరైన సినిమాలేం రాలేదు. ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర... పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల కలయిక కాసుల వర్షం కురిపించలేదు సరికదా... థియేటర్‌లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. ‘మిరపకాయ్’లో రవితేజ ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన మాస్ మసాలా కథే ఎంచుకున్నారు. దాంతో గట్టెక్కేశారు. గొప్ప కథ కాకపోయినా, సినిమాలో ఊహించని మలుపులూ లేకపోయినా ఈ సినిమా ఆడిందంటే కారణం. రవితేజ కామెడీ టైమింగే. దాంతోపాటు సంక్రాంతి బరిలో పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు బాగానే పిండుకొన్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ క్లాస్ టచ్ ఎక్కువై ఆ వర్గానికే పరిమితమైంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌తో బ్రహ్మాండం బద్దలుగొడతాం అని బయల్దేరిన ధీరుడు... ఏమాత్రం మెప్పించలేదు. సిద్ధార్థ్ కళ్లకు గంతలు కట్టడం నుంచి సినిమా డ్రాపవుట్ అయిపోయింది.
చిన్నవే మేలు
చిన్న సినిమా తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఏడాది కూడా ఆపసోపాలు పడింది. ‘అలా మొదలైంది’. ‘పిల్లజమిందార్’ సినిమాలు చిన్న నిర్మాతలకు కొండంత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా నందినిరెడ్డి ‘అలా మొదలైంది’ అంటూ ప్రేక్షకులకు ఓ ప్రేమకథను చూపించారు. నటీనటుల ప్రతిభ, చక్కని సంగీతం, సున్నితమైన భావాల్ని తెర మీద ఆవిష్కరించిన విధానం, కథకు వినోదం అద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చాయి. దాంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తనయుడు ఆదిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించారు. ‘ప్రేమకావాలి’ పాస్ మార్కులు దక్కించుకుంది. కథ డిమాండ్ చేసిన దానికంటె, హీరో సామర్థ్యం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు కనిపించింది. దానికి తగినట్టు ప్రచారం కూడా భారీ ఎత్తున చేశారు. కొత్త ఆలోచనలతో తీసిన ‘ఎల్బీడబ్ల్యు’ విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. ప్రేక్షకుల్ని పదిహేను రోజుల ముందే ఏప్రిల్ ఫూల్స్‌గా మార్చారు రాంగోపాల్‌వర్మ. ఐదు రోజుల్లో సినిమా తీసి భళా అనిపించారు. తీరా బొమ్మ చూస్తే ఆ సినిమాకి ఒకరోజు కూడా ఎక్కువే అనిపించింది. అదే ‘దొంగలముఠా’. ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 నుంచి థియేటర్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు.
పెట్టుబడికి మించిన డబ్బులు ఒక్కరోజులోనే రాబట్టుకొన్నా, వర్మ ట్రిక్కుల్ని విమర్శించినవారే ఎక్కువ. ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’తో చేసిన ప్రయత్నం కూడా ఘోరంగా బెడిసికొట్టింది. ఇక లాభం లేదని బెజవాడలో మరోసారి తనకు అలవాటైన రక్తచరిత్ర సృష్టిద్దామనుకొంటే... ఆ సినిమా ఓ మురికివాడలా తయారైంది. సినిమాలో విషయం ఉండాలంతే. ప్రచారాలకు ప్రేక్షకులు పడిపోరు అనే నిజాన్ని ఈ సినిమాల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. తెలుగు చిత్రపరిశ్రమలో మినిమం గ్యారెంటీ ట్యాగు సంపాదించుకొన్న హీరోలు ఇద్దరున్నారు. ఒకరు రవితేజ, ఇంకొకరు అల్లరి నరేష్. వీరిద్దరికి ఈసారి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. రవితేజ ‘మిరపకాయ్తో తన ఫార్ములా కరెక్టే అని నిరూపించుకొన్నా... ‘దొంగలముఠా’, ‘వీర’ సినిమాలతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నరేష్ పరిస్థితీ అంతే. ‘అహనా పెళ్లంట’ ఒక్కటే ఈ ఏడాది చెప్పుకోదగిన సినిమా. ‘సీమ టపాకాయ్’, ‘మడతకాజా’, ‘సంఘర్షణ’ సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది.
అంచనాలు ముంచాయి
ఎన్టీఆర్, గోపీచంద్, పవన్‌కల్యాణ్‌లకు ఈ ఏడాది ఒక్క హిట్టూ దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’ రెండూ భారీ అంచనాలతో వచ్చినవే. ఆ అంచనాలే ఈ సినిమాల కొంప ముంచా యి. ‘శక్తి’లో హంగూ ఆర్భాటం తప్ప విషయం లేకపోవడంతో తేలిపోయింది. ‘ఊసరవెల్లి’ తొలిరోజు వసూళ్లు అదరగొట్టినా... ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణలో లోపాలు ఈ సినిమాకి శాపంలా తోచింది. గోపీచంద్ ‘వాంటెడ్’, ‘మొగుడు’ సినిమాలతో జనం ముందుకొచ్చారు. దర్శకుడి వైఫల్యంతో ‘వాంటెడ్’ బోర్లా పడింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ‘మొగుడు’ ఆకట్టుకోలేదు. ఇక పవన్‌కల్యాణ్ సినిమాలు ‘తీన్‌మార్’ ‘పంజా’ సినిమాలు ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. కథల విషయంలో పవన్ జడ్జిమెంట్ ఏమైపోయింది? అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు. నాగచైతన్యకు ‘100% లవ్’ ఒక్కటే ఊరట నిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు ‘దడ’, ‘బెజవాడ’ రూపంలో బెడిసికొట్టాయి. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో ప్రభాస్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాపై తొలుత డివైడ్ టాక్ నడిచినా... వసూళ్లు క్రమంగా ఊపందుకొన్నాయి. కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేయడంతో ఈ చిత్రం విజయతీరాలకు చేరగలిగింది.
సూపర్‌హిట్ ఒక్కటే
ఈ ఏడాది రికార్డుల గురించి మాట్లాడుకొన్నది, పాత రికార్డులు సవరించాల్సి వచ్చింది ‘దూకుడు’ సినిమా విషయంలోనే జరిగింది. శ్రీనువైట్ల-మహేష్‌బాబుల మాయాజాలం బాగా పనిచేసింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ఈ సినిమాకి బాగా ప్లసయ్యారు. కోన వెంకట్ సృష్టించిన పాత్రల మధ్య ‘దూకుడు’ హంగామా చేసింది. కథ, కథనాల మాట అటుంచితే మహేష్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అగ్ర హీరో సినిమా హిట్‌టాక్ సంపాదించుకొంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అయితే ఏడాదికి ఒక్క సూపర్‌హిట్ సరిపోదు. పరిశ్రమ ఇంకా కోరుకొంటోంది. కాంబినేషన్ పోజులో కొట్టుకుపోకుండా కథలు ఎంచుకోవాలని 2011 మరోసారి రుజువు చేసింది. ఈ అనుభవాలను పాఠాలుగా మలచుకొంటారా? లేదా? అనేది ప్రస్తుతం దర్శకులు, హీరోల చేతుల్లో ఉంది. మరోవైపు 2012 స్వాగతం పలుతోంది. ఓటమి నుంచి ఏం నేర్చుకొన్నారో... వచ్చే ఏడాదే తేలాలి.
--సాహితి, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi