27, డిసెంబర్ 2011, మంగళవారం

విషాదాంతమైనా.. వినూత్న జర్నీ


 జర్నీ
తారాగణం: శర్వానంద్, జై, అనన్య, అంజలి తదితరులు
సంగీతం: సత్య.సి
నిర్మాత: సురేష్ కొండేటి
దర్శకత్వం: శరవణన్


శాంతంగా ఉన్న చెరువులో ఓ రాయి విసిరి చూడండి. ‘అల’జడి రేగుతుంది. ఓ చిన్ని నిర్లక్ష్యం కూడా అంతే! చిన్నదే అనుకొంటాం... కానీ ఒక్కోసారి కొన్ని జీవితాన్ని ఛిద్రం చేయొచ్చు. ‘సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి...’ అని నెత్తీనోరు బాదుకున్నా ఈనాటి కుర్రకారు చెవికి ఎక్కడం లేదు. కంటిముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా లెక్కచేయడం లేదు. అలాంటివారి ధోరణిలో మార్పు రావాలంటే ఒక్కసారి ‘జర్నీ’ సినిమా చూపించండి. ఈ ఒక్క సందేశంకోసం సినిమా తీసుంటే ఇదో ఆర్ట్ ఫిల్మ్‌గా తయారయ్యేది. ఎక్కడా నీతి బోధ చేయకుండా, సందేశాలు గుప్పించకుండా... తన ధోరణిలోనే సన్నివేశం తరవాత సన్నివేశం పేర్చుకొన్నాడు దర్శకుడు.
కథలోకి వెళ్తే... ఇది రెండు జంటల ప్రేమ ప్రయాణం. విజయవాడలో ఒక కథ. హైదరాబాద్ జంటది మరో కథ. ఎదిరింట్లో ఉన్న పొడవు జడల అమ్మాయి మధుమతి (అంజలి)ని దూరంనుంచే ఆరాధిస్తాడు కృష్ణకాంత్ (జై). ఆరు నెలల తరవాత అటునుంచి సిగ్నల్ వస్తుంది. మధు ఏ విషయమైనా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. పెళ్లైన తరవాత ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో కృష్ణకి అనుభవ పూర్వకంగా తెలియజేస్తుంది. హెచ్.ఐ.వీ. టెస్ట్ చేయించడంతో సహా. కృష్ణ తన ప్రియురాల్ని తల్లిదండ్రుల్ని పరిచయం చేయడానికి మధుమతితో కలిసి విజయవాడ బస్సు ఎక్కుతాడు. మరోవైపు ఉద్యోగంకోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంది అమృత (అనన్య). ఇక్కడ అక్క తప్ప మరెవ్వరూ తెలీదు. తనేమో వేరే పనిమీద అమృతను కలుసుకోవడానికి బస్టాండ్ దగ్గరకు రాలేకపోతుంది. దాంతో గౌతమ్ (శర్వానంద్) సహాయం కోరుతుంది. గౌతమ్ తన ఆఫీసుకి డుమ్మాకొట్టి మరీ... అమృతని ఇంటర్వ్యూ జరిగే చోటికి తీసుకెళ్తాడు. ఈ ప్రయాణం కూడా సరదా సంగతులతో గడిచిపోతుంది. అంతే... అమృతలో ఆరాధన భావం మొదలవుతుంది. విజయవాడ వెళ్లిపోయినా మనసంతా గౌతమ్ ఆలోచనలే. దాంతో మళ్లీ అతన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ బస్సు ఎక్కుతుంది. గౌతమ్ పరిస్థితి కూడా అంతే. విజయవాడలో ఆమె ఆచూకీ తీయాలని కృష్ణ-మధుమతిలతోపాటే ప్రయాణం చేస్తాడు. ఇంతకీ ఈ రెండు జంటల కథ ఏ తీరానికి చేరిందో తెలియాలంటే పతాక సన్నివేశాల వరకూ ఓపిక పట్టాల్సిందే.
రెండు జంటల ప్రేమ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకొన్న నేపథ్యాలు పరస్పరం వైవిధ్యంగా తెలుగు దర్శకుల ఆలోచనలకు దూరంగా ఉండడంతో... మనవాళ్లకి కొత్తగా అనిపించాయి. తెరమీద నటీనటులకన్నా నాలుగు వింత పాత్రలు దర్శనమివ్వడంతో కథలోకి ప్రేక్షకుడు తేలిగ్గా లీనమైపోతాడు. వారితోపాటు తానుకూడా ప్రయాణం మొదలుపెడతాడు. సన్నివేశాలన్నీ సహజంగా... నటీనటుల ప్రతిభ అందుకు అనుగుణంగా ఉంది. శర్వానంద్ అలవాటు ప్రకారం అల్లుకుపోయాడు. మిగతా పాత్రల్లో అంజలికి ఎక్కువ మార్కులు పడతాయి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా, ఇంకొన్నిసార్లు ముదురు పిల్లలా ఆమె హావభావాలు చాలా బాగా నప్పాయి. నిజం చెప్పాలంటే ఇదో డాక్యుమెంటరీకి సరిపడే కథావస్తువు. రెండు నిమిషాల్లో చెప్పేయొచ్చు. రెండున్నర గంటల సినిమాగా నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ సినిమా చూస్తే బస్సు ప్రయాణంలో ఇంత డ్రామా ఉంటుందా? ఇన్ని పాత్రల్ని సృష్టించొచ్చా? ఇన్ని కథల్ని నడిపించొచ్చా? అనిపిస్తుంది. ఇది కచ్చితంగా దర్శకుడి సినిమానే. సినిమా మొత్తంలో అనవసరం అనిపించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. పాటలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళ్లాయో తెలీదు. మితిమీరిన మెలోడ్రామా, అనవసరంగా పాత్రలు వచ్చిపడిపోవడాలూ ఎక్కడా కనిపించవు. అందుకే ఈ జర్నీ... కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మిగతా సాంకేతిక నిపుణుల ప్రతిభనూ తక్కువ అంచనా వేయలేం. రద్దీలో, జన సమూహంమధ్య, రోడ్లమీద సన్నివేశాలన్నీ సహజంగా వచ్చాయంటే అదంతా ఛాయాగ్రహకుడి ప్రతిభే. ముఖ్యంగా ప్రమాద ఘట్టాలను బాగా తెరకెక్కించారు. సంగీతం కూడా బాగుంది. తెలుగు పాటల్లో తెలుగు వినిపించని ఈ తరుణంలో... అనువాద చిత్రంలోని ప్రతీ పాటలోని ప్రతి పదం చెవులకు తీయగా సోకింది. డబ్బింగ్ విషయంలో తెలుగు నిర్మాత నాణ్యతను పాటించారన్న విషయం ప్రతి సన్నివేశం గుర్తుచేస్తూనే ఉంటుంది. ‘గోవిందా, గోవిందా సిటీలో కొత్త పిల్ల..’ పాట హుషారుగా సాగిపోతుంది. క్లైమాక్స్‌ని కన్నీళ్లతో ముంచడం తమిళ దర్శకులకు అలవాటు. అక్కడి ప్రేక్షకులకు కూడా ఆ ధోరణే నచ్చుతుంది. అందుకే ఈ ‘జర్నీ’కూడా విషాదాంతం చేశారు. గుండె బరువుచేసుకొని థియేటర్ బయటకు వెళ్లడానికి మన ప్రేక్షకులు ఇష్టపడరు. కచ్చితంగా శుభం కార్డులో నవ్వులు చూడాల్సిందే. అందుకు విరుద్ధంగా చూపించడం... మనవారికి ఎంతవరకూ ఎక్కుతుందో మరి?! ఏదేమైనా ఈ సినిమా చూసిన తరవాత బస్సు ప్రయాణాలంటే భయపడతారు... డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే ఒణికిపోతారు. ఆ ప్రభావం కలకాలం ఉంటే ఈ సినిమా ఉద్దేశం నెరవేరినట్టే.
ఉపసంహారం: డబ్బింగ్ సినిమాలొచ్చేస్తున్నాయ్. మన కొంపలు ముంచేస్తున్నాయ్ అని తెలుగు నిర్మాతలు, టాలీవుడ్ శ్రేయోభిలాషులు తెగ గాభరా పడిపోతున్నారు. అవొస్తున్నాయ్ కాబట్టే కథల అల్లికలో మన దర్శకులు ఎంత దూరంలో ఉంటున్నారో అర్థమవుతుంది. అవి వస్తున్నాయ్ కాబట్టే... కొత్తతరహా సినిమాలు చూసే అవకాశం మన ప్రేక్షకులకు దక్కుతుంది. ఇప్పటికైనా ఆడిపోసుకోవడం ఆపేసి, మంచి కథలతో సినిమాలు తీస్తే మంచిదనే విషయం గమనించుకొంటే మంచిది. - ఎ.ఎన్, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi