27, డిసెంబర్ 2011, మంగళవారం

డబ్బింగ్ సినిమాలపై గోల ఏల?

  తెలుగు సినిమా ఉచ్ఛదశకు చేరుకున్న వేళ ఎన్టీఆర్, ఎఎన్నార్,కృష్ణ, శోభన్, చిరంజీవి ఏనాడూ డబ్బింగ్ సినిమాల గురించి భయపడలేదు. శివాజీ గణేశన్ ‘కర్ణ’, ఎంజీఆర్ ‘లోకం చుట్టిన వీరుడు’ తెలుగునాట డబ్బులు చేసుకున్నా అభ్యంతరం చెప్పలేదు. ఇక రజనీ, కమల్ శకం ఆరంభమైన నాటి నుంచీ వారి ప్రతి సినిమా తెలుగులోకి వస్తూనే వున్నాయి. అయినా ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఎందుకంటే ఆ రోజు హీరోలుగా వున్న ఎవరికీ ఈ దిశగా ఆలోచించే తీరికే లేకపోయింది. వచ్చిన ప్రతి సినిమా చేయడమే ధ్యేయంగా నడించింది ఆ రోజు. ప్రతి నటుడికి ఏటా అరడజను సినిమాలు తక్కువ కాకుండా వుండేవి. వాటిలో కనీసం సగమన్నా హిట్ కొట్టేవి. దాంతో మరో ఆలోచన, పక్కవాడిపై దృష్టి లేకుండా వుండేది. పైగా ఆ రోజున చిత్రపరిశ్రమ ఎక్కువగా మద్రాసులో వుండేది కాబట్టి, వాళ్ల పంచన వుంటూ, వాళ్ల సినిమాలపై కారాలు మిరియాలు నూరే పరిస్థితి లేకపోయింది.
ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక ఏడాదికి ఒక సినిమా చేయడం గగనంగా వుంది. పోనీ అలా చేసిన సినిమాలేవన్నా నాలుగు వారాల పాటు థియేటర్లలో తిష్టవేసుకుని కూర్చుంటున్నాయా అంటే, బాక్సులు వారానికే తిరుగుటపాలో పుట్టింటికి వచ్చేస్తున్నాయి. మరి రాష్ట్రం అంతటా వున్న థియేటర్లు, వాటిని నమ్ముకున్న కార్మికులు, వ్యాపారస్థులు ఏం కావాలి. అదీ కాక, ప్రతి ఒక్క నిర్మాత పెద్ద హీరోలతోనే సినిమా తీయలేడు. ఆ అవకాశం వారెలాగూ ఇవ్వరు. తమ తమ బంధుబలగమో, ఆశ్రీతులకో తప్ప కాల్షీట్లు అందించరు. ఇక మరి నిర్మాతగా మారాలంటే చిన్న సినిమా లేదా డబ్బింగ్ సినిమానే దిక్కు. చిన్న సినిమాను మార్కెట్ చేసుకోవడం కన్నా, డబ్బింగ్ సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్లడం సులువు. పైగా ప్రొడక్టు చూసి కొనుగోలు చేస్తారు కాబట్టి, నిర్మాతకు ఒక రకమైన భరోసా వుంటుంది. ఇన్ని కారణాల రీత్యా తెలుగునాట డబ్బింగ్ సినిమాలకు అన్నివిధాలుగా ఆదరణ కొనసాగుతోంది.
తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పుడెందుకు అకస్మాత్తుగా కోపం వచ్చిందన్నదానిపై కూడా తరచి చూడాల్సివుంది. నువ్వేమన్నా చెయ్..నా బంగారు పుట్టలో వేలు పెడితే మాత్రం ఒప్పుకోను..అన్న చందం మన సినిమా పరిశ్రమది. నిర్మాతగా డబ్బులు పట్టుకురా..హీరోయిన్..కెమేరామెన్, స్టంట్‌మెన్,డైరక్టర్, విలన్, ఇలా ఎన్ని రూపాల్లో ఇరుగుపొరుగవారు వచ్చినా అక్కున చేర్చుకుంటాం..కానీ హీరో వేషాలకు పోటీ తగిల్తే మాత్రం ఎంతమాత్రం సహించం..నిషేధం..నిషేధం అంటూ వీర హడావుడి చేస్తాం..ఇదీ తెలుగు పరిశ్రమ తీరు. పైగా సూర్య, కార్తీ, పృధ్వీరాజ్, షామ్ లాంటి పక్క రాష్ట్రాల హీరోలు, మన జనాల ఆదరణ పొందుతున్నారు. ఇది మన యువ హీరోల భవిష్యత్‌ను కలవరపరిచే అంశంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో అసలే కట్టుబాటుకు మారుపేరుగా నిలిచిన తెలుగుసినీ పరిశ్రమ పెద్దలు నడుంకట్టి, ఏకంగా డబ్బింగ్ సినిమాలపై వేటుకే ముందుకు సాగక తప్పలేదు. నిజానికి మన ప్రేక్షకుల కన్నా సినిమా వాళ్లకే పొరుగింటి పుల్ల కూర అంటే మహా ఇష్టం. పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో పొరుగింటి డైరక్టర్లపై మన హీరోలకు వున్న మోజుపై సెటైర్ వేసిన సంగతి ఇక్కడ గుర్తుతెచ్చుకోవచ్చు. మన హీరోలు పరభాషా దర్శకులకు ఇట్టే అవకాశం ఇస్తారని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తూనే వుంటాయి. పైగా మన సినిమాల్లో హీరోకి దీటైన విలన్ లేదా క్యారెక్టర్ పాత్ర వుంటే వెంటనే ఆది కాస్త హిందీ నుంచో, తమిళం నుంచో వచ్చే నటుడిని వెదుక్కుంటూ వెళ్లిపోతుంది. అక్కడ మళ్లీ ఈ నిషేధం వర్తించదు. అదే అక్కడి హీరోలు ఇక్కడ జనం అభిమానాన్ని సంపాదిస్తే మాత్రం ఓర్చుకోవడం కష్టం. అందుకే బోల్డు పన్నులు వేసేయండి..్థయేటర్ల తలుపులు మూసేయండి..అవసరమైతే జనం కళ్లకు గంతలు కట్టేయండి అని..హూంకరింపులు. కానీ ఇప్పుడు ఇదంత సులువు కాదు. ఇంటర్‌నెట్ యుగంలో ఎవర్నీ ఎవరూ ఆపలేరు. కొలవెరి పాట ఆదరణను అడ్డగలిగారా..దానికి వచ్చిన క్రేజ్‌ను తప్పించగలిగారా? తెలుగు సినిమా పెద్దలు అర్ధం చేసుకోవాల్సింది. తమ తమ తప్పిదాలను. వాటి నుంచి బయటకు వచ్చి జనం మెచ్చే సినిమాలను అందించే మార్గాలను. అంతే కానీ పొరుగు సినిమాలపై అరుపులు కేకలు కాదు. డబ్బింగ్ సినిమాలు వద్దు అంటున్న నిర్మాతలు, హీరోలు మన దర్శకులను వదిలేసి పొరుగు దర్శకుల వెంట ఎందుకు పడుతున్నట్లు? తీరా చేసి ఇటీవల కాలంలో వచ్చిన భయంకరమైన ఫ్లాపుల్లో ఈ తరహా దర్శకుల సినిమాలే ఎక్కువన్న సంగతి గమనించలేదా? మరోచిత్రమేమిటంటే ఇటీవల ఈ జాఢ్యం టీవీ రంగానికి కూడా సోకుంతోంది. డబ్బింగ్ సీరియళ్లను నిషేధించాలనే నినాదం ప్రారంభమైంది. ఇలా చెప్పే ఛానెళ్లు మాత్రం తమ తమ న్యూస్ స్టోరీస్ కోసం విదేశీ ఛానెళ్ల కార్యక్రమాల క్లిప్పింగ్‌లను యధేచ్ఛగా, తమ సొంతం అన్నట్లు వాడేసుకోవడం గమనార్షం. న్యూస్ ఛానెళ్లు, నిత్యం వచ్చే వార్తాపత్రిల్లో వార్తలను, వ్యాసాల అంశాలను తీసుకుని, తమ ఇష్టం వచ్చేసినట్లు వాడేసుకోవచ్చు. అక్కడ మళ్లీ ఏ అభ్యంతరాలూ వుండవు. సృజన అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. పోటీలో నిలబడ్డాక కావాల్సింది..ప్రతిభా పాటవాలే కాని..ని‘బంధనాలు’ కాదు. ప్రతిభ వున్నపుడు కచ్చితంగా ఎవరన్నా జనం గుర్తిస్తారు.-Courtecy:Andhra Bhoomi,December 15th, 2011