27, డిసెంబర్ 2011, మంగళవారం

అంతరిక్ష విజయాలు


అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సాధించారు. ఇంకా సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోవియట్ పతనానంతరం అంతరిక్ష రంగంలో అమెరికా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. అంగారక గ్రహాన్ని శోధించే ప్రయత్నంలో ‘నాసా’ కొంత నష్టపోయినా విశ్వశోధనను మరింత ముమ్మరం చేసింది.
సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై దృష్టి సారించాలనేది నాసా లక్ష్యం. అంగారకుడు, బృహస్పతి, శనిగ్రహాల ఉపగ్రహాలపై గతంలోగాని, ఇప్పుడు గాని ప్రాణులున్నాయా? అన్న అంశంపై పరిశోధనలు నిర్వహించనున్నారు.
భూమి నుండి 4.9 కోట్ల మైళ్ల దూరంలోని అంగారక గ్రహానికి 2050 నాటికి వ్యోమగాములు చేరుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే బృహస్పతి చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలు, నెప్ట్యూన్, శని, శుక్రుడు, బుధుడు, యురేనస్‌ల గురించిన పరిశోధనలు ఊపందుకున్నాయి.
1990లో నింగి కెగిరిన ‘యులిసెస్’ సూర్యుడి గురించిన సమాచారం పంపే ప్రయత్నంలో ఉంది. 1969లో నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్వి ఆల్‌డ్రిన్‌లు చంద్రునిపై కాలు మోపిన తొలి వ్యోమగాములు. 1977లో నాసా ప్రయోగించిన సోజర్నర్ బుధగ్రహంపై చేరుకోవడంతో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.
1975 ఏప్రిల్ 19న భారతదేశం తొలి ఉపగ్రహం ఆర్యభట్టును ప్రయోగించింది. 1984 ఏప్రిల్ 3న తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేశాడు. అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి.
అంతరిక్ష రంగంలోని ఆవిష్కరణల వల్ల గ్రహాలు, ఉపగ్రహాల వివరాలు, స్పేస్ స్టేషన్లలో పరిశోధనల మూలంగా విశ్వం స్వరూపం విస్పష్టంగా సాక్షాత్కరించింది. చంద్రునిపై ఆవాసాలు ఏర్పరచుకునేందుకు, అంతరిక్షంలో హోటళ్లు నిర్మించేందుకు పరిశోధనలు ముమ్మరమయ్యాయి.
అంతరిక్షంలో వివిధ రూపాల్లో పేరుకుపోయే చెత్తాచెదారాన్ని తొలగించడం ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పే. బ్రిటీష్ పరిశోధకులు దీనికి పరిష్కారం కనుగొన్నారు. అంతరిక్షంలోని చెత్తను తొలగించే సూక్ష్మ ఉపగ్రహాలను రూపొందించారు.
అంతరిక్షంలో గల వ్యర్థాలు భూమి చుట్టూ పరిభ్రమించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఉదాహరణకు గంటకు 18 వేల మైళ్ల వేగంతో తిరుగాడే చిన్న బోల్టు ఉపగ్రహాలను ఢీకొడితే గంటకు 70 మైళ్లు వేగంతో పయనించే లారీ ఢీకొంటే కలిగేటంత నష్టం వాటిల్లుతుంది.
భూమి మీద జీవరాశి పుట్టుకకు అంతరిక్షంలోనే బీజం పడిందన్న సిద్ధాంతాన్ని సమర్థించే సాక్ష్యాధారాలు లభించాయి. అంగారక గ్రహానికి బహు దూరంలో ఇవి దొరికాయి.
భూమికి 15 కోట్ల మైళ్ల దూరంలో అంతరిక్షంలో తిరుగాడుతున్న సంక్లిష్ట కర్బనాధార అణువులను అంతరిక్ష నౌక కనుగొంది. ‘స్టార్‌డస్ట్’ అనే అంతరిక్ష నౌక సేకరించిన ధూళికి సంబంధించిన వివరాలు పరిశీలించిన ఖగోళ శాస్తవ్రేత్తలు అంతరిక్షంలోంచి వచ్చిన పదార్థమే పుడమిపై జీవరాశి ఆవిర్భవించడానికి కారణమని అంటున్నారు.
అంతరిక్ష నౌకలో ధూళిని సేకరించే పరికరం, విశే్లషించే విభాగం ఉన్నాయి. అంతరిక్ష నౌక సేకరించిన రేణువుల పరిమాణం నీటి అణువుల కన్నా వంద రెట్లు ఎక్కువ. వీటిని పాలిమెరిక్ హెటిరో సైక్లిక్ ఆరోమేటిక్ సమ్మేళనాలుగా గుర్తించారు.
బొగ్గు, తారులోని అణువులతో వీటి రసాయన ఫార్ములా పోలి ఉంటాయి. ఈ అణువులు భూమి మీద పడినపుడు జీవరాశి పుట్టుక ప్రథమ పదార్థమయిన ‘ప్రైమార్డియల్ సూప్’ ఏర్పడిందని పరిశోధకులు వివరిస్తున్నారు.
అంతరిక్షంలో చిన్నచిన్న గాయాలు కూడా సరిగా మానవు. వ్యోమగాములను ఇబ్బంది పెట్టే అంశం ఇది. కాంతితో గాయాలు మాన్పడానికి నాసా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి.
గాయాలు త్వరగా మానకపోవడానికి, జీవకణంలో శక్తి కేంద్రమైన ‘మైటోకాండ్రియా’ అంతరిక్షంలో ‘జీరోగ్రావిటీ’ వల్ల సమర్థవంతంగా పనిచేయకపోవడమే కారణం.
గాయాలు మానేందుకు ‘ఫైబ్రోబ్లాస్ట్’లనే కణాలు తోడ్పడతాయి. వీటిలోని ‘మైటోకాండ్రియా’ సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ఆ కణాల వృద్ధి సాధ్యం కాదు. అరుణ, పరారుణ కిరణాలను ప్రసరింపజేసి మైటోకాండ్రియా పని సామర్థ్యం పెంచి గాయాలను త్వరగా నయం చేయవచ్చు. అయితే ఈ కిరణాలను ఎలా ఉత్పత్తి చెయ్యాలనేది ప్రస్తుత సమస్య. దీనికి పరిష్కారంగా ఒక పరికరాన్ని రూపొందించారు.
అంతరిక్షంలో రేడియో ధార్మిక శక్తికి గురిచేసిన విత్తనాలతో చైనా పరిశోధకులు మరింత లాభదాయకమైన మొక్కలను సృష్టించారు. ఇవి తక్కువ సమయంలో అంకురించే కొత్త విత్తనాలు. వీటి నుండి పుట్టిన మొక్కల వేళ్లు బలంగా ఉంటాయి.
        -Courtecy: Andhra Bhoomi, December 25th, 2011