27, డిసెంబర్ 2011, మంగళవారం

పర్యాటకం ---- గైరేంజర్ ఫజోర్డ్


నార్వేలోని చూడదగ్గ ప్రదేశాలలో గైరేంజర్ ఫజోర్డ్ ఒకటి ప్రకృతిని ప్రేమించేవారికి ఇది చాలా నచ్చుతుంది. ఎతె్తైన పర్వతాల మీంచి పడే జలపాతాలు, పిల్ల కాలువలు, తెల్లటి మంచు శిఖరాలు, ఆకుపచ్చటి చెట్లు, పర్వతాల మీద కారులో వెళ్లడానికి సన్నటి మలుపులు తిరిగే రోడ్లు. అక్కడి వారి ఆతిథ్యం పర్యాటకుల మనసులని దోస్తాయి.
ఇక్కడి ముఖ్యమైన మూడు జలపాతాలు - ది సెవెన్ సిస్టర్స్, ది సూటర్, ది బ్రైడిల్ వీల్డ్ - ఎతె్తైన శిఖరాల మీంచి కిందికి పడుతూ కన్నుల విందు చేస్తాయి. ఇవేకాక చిన్నచిన్న జలపాతాలు కూడా అనేకం ఇక్కడ ఉన్నాయి. ఈ జలపాతాల వల్ల సృష్టించబడే ఇంద్రధనస్సు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేలా చాలామంది యాత్రికులు ఫొటోలు తీసుకుంటారు.
గైరేంజర్ ఫజోర్డ్‌కి క్రూయిజ్‌లో వెళ్లాలి. ఏటా 130 క్రూయిజ్‌లు యాత్రికులతో ఇక్కడికి వస్తూంటాయి. కయాకింగ్ జలక్రీడకి ఈ ప్రాంతం ప్రసిద్ధి. పర్వతాలలో నడవడానికి వేసిన బాటల్లో నడుస్తూ పిక్చర్ పోస్ట్‌కార్డ్ లాంటి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఇక్కడి అత్యంత ఎత్తయిన కొండ శిఖరం మీదకి వేసిన రోడ్డు పేరు ఈగిల్ రోడ్డు. పదకొండు హెయిర్ పిన్ బెండ్స్ (ఇరుకైన మలుపులు) గల ఈ రోడ్డుకి ఆ పేరు రావడానికి గల కారణం, ఆ శిఖరం మీద గద్దలు నివాసం ఉండటమే. సముద్రమట్టానికి 620 అడుగుల ఎత్తుకి ఈ రోడ్డు సాగుతుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లు నడిపే వాహనాలలో అక్కడికి వెళ్లి రావడం ఓ మధురమైన అనుభవం.
సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తునగల డాల్‌సినిబ్బ అనే వ్యూ పాయింట్, అలాంటిదే మరొకటి అయిన ఫ్లైడాల్ జువెక్ వ్యూపాయింట్ నించి చూస్తే చాలా మైళ్ల దూరం అందంగా కనిపిస్తుంది.
గైరేంజర్ ఫజోర్డ్‌లో ఓ మ్యూజియం ఉంది. ఈ ప్రాంతపు చరిత్ర, ఇక్కడి మనుషుల రంగురంగుల దుస్తులు, అనేక ప్రకృతి దృశ్యాల ఫొటోలు గల ఇది గైరేంజర్ కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ మ్యూజియం ఉంది. హైకింగ్, ట్రెక్కింగ్ చేసేవారి సౌకర్యార్థం కొండదారులు మేప్‌లు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చిన వారు ఈ రెంటిలో కనీసం ఒక్కటైనా చేయకుండా వెళ్లరు.
గైరేంజర్ కేంద్రం నించి నాలుగు కిలోమీటర్ల దూరంలో వెస్ట్రాస్ ఫాంకి చేరుకుని అక్కడి ‘స్టోర్ సెటర్ ఫోసెస్ వాటర్ ఫాల్’ని చూడొచ్చు. పడవలు, సైకిళ్లు, కార్లు ఇక్కడ అద్దెకి దొరుకుతాయి. పిషింగ్ అంటే ఆసక్తిగల వారు లైసెన్స్ పొంది చేపలు పట్టవచ్చు.
హెర్డల్ సెట్రావౌంటెయిన్ ఫాం మరో చూడదగ్గ ప్రదేశం. మేకలని పెంచే ఈ ఫాంలో ఛీజ్, కేరమిల్స్ తయారుచేసే పద్ధతులని చూడచ్చు. అనేక మేకలు, గొర్రెలు, ఆవులని కూడా చూడొచ్చు.
ట్రాల్ స్ట్రైజెన్ వౌంటెన్ రోడ్ నార్వేలోని ఓ నాటకీయమైన రోడ్డుగా చెప్పచ్చు. ట్రాల్ స్ట్రైజెన్ పర్వతం చుట్టూ నిర్మించిన ఈ రోడ్డు మీద ప్రయాణం మంచి అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడి వెల్లడోలా నది రేఫ్టింగ్‌కి అనుకూలం. చలికాలంలో 1500 మీటర్ల ఎత్తు నించి కిందకి స్కేయింగ్ చేయడానికి శాండ్రా పైలెట్ స్కై సెంటర్‌ని ఉపయోగిస్తారు. యూరప్‌లో వేసవిలో ఎక్కడా మంచు కనపడదు. కానీ ఇక్కడి స్ప్రైన్ సమ్మర్ స్కీయింగ్ సెంటర్‌లో (గైరేంజర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో) సదా మంచు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 365 రోజులూ స్కీయింగ్ చేయ్యొచ్చు.
ఫజోర్డ్ అంటే ఇంగ్లీష్‌లో ఎతె్తైన కొండల మధ్యకి సముద్రంలోంచి ప్రవహించే సన్నటి పొడవైన కాలువ వల్ల ఏర్పడే గ్లేసియర్ అని అర్థం. ఇలాంటివి ఇక్కడ చాలా చూడచ్చు. ఈ ప్రదేశం మొత్తం అంటే 500 చ.కి.మీ. మేర 2005 యుఎన్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
చేపల చెరువులు, ప్రోజెన్ పీజా, మాంసం, స్ట్రాబెర్రీ ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు. 1869లో బ్రిటీషర్స్ వల్ల ఇది టూరిస్ట్ కేంద్రంగా మారింది. ప్రతి వేసవిలో 6 లక్షల మంది ఇక్కడ పర్యటిస్తారు. కానీ దీని జనాభా 1760 మాత్రమే.
-ఆశ్లేష, December 25th, 2011,Courtecy:Andhra Bhoomi