27, డిసెంబర్ 2011, మంగళవారం

మేటనీ షో

మల్లాది మిరియాలు


‘నీతో ప్రేమలో పడటంలో నా తప్పు లేదు’ కార్లా తన పక్కన నగ్నంగా పడుకున్న అలెన్‌తో చెప్పింది.
‘అది నా తప్పా?’ నవ్వుతూ అడిగాడు అలెన్.
‘ఊహు. అది మనిద్దరి తప్పూనూ. ఇందులో ఏ ఒక్కరిదో తప్పు అనడం అన్యాయమే అవుతుంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను’
‘నీ భర్త టామ్‌కి మన గురించి తెలుసా?’ అలెన్ అడిగాడు.
‘నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. కాని బయట నీతో గడిపే సమయాన్ని ఆయనకి తృప్తికరంగా వివరించలేక పోతున్నాను. దాంతో టామ్‌లో అసహనం, అనుమానం మొదలయ్యాయి. అంతేకాక ఈ మోటెల్‌కి వచ్చే నన్ను టామ్‌కి తెలిసిన వాళ్లు చూస్తారనే భయం నాలో ఎక్కువ అవుతోంది’
అలెన్ సిగరెట్ యాష్ ట్రేలో ఆర్పేసాడు.
‘అలెన్! నీ భార్య లిజా మన గురించి తెలుసుకుంటుందనే భయం నీకు లేదా?’ కొద్ది క్షణాల తర్వాత కార్లా అడిగింది.
తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వి చెప్పాడు.
‘అదే జరిగితే నీకు తెలుస్తుంది. లిజా నన్ను చంపేసిందని నువ్వు దినపత్రికల్లో చదువుతావు’
‘ఐనా మనం ఛాన్స్ తీసుకుంటూనే ఉండాలి అలెన్. నిజానికి ప్రతీదీ ఛానే్స. అసలు నిత్యం చావకుండా నిద్ర లేవడంలోనే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యు అలెన్. టామ్‌కి తెలిస్తే నన్ను వదిలేస్తాడు. నీ మీద ఎంత ఇష్టముంటే, అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను’
అలెన్ కార్లాని కొద్దిసేపు ముద్దు పెట్టుకున్నాడు.
అలెన్ హాలీవుడ్‌లో గాయకుడు. ఓ టీవీ షోలో అతను పాల్గొన్నపుడు దానికి హాజరైన కార్లా పరిచయమైంది. తన అభిమాని అని గ్రహించి అలెన్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చివరికి అది పక్క మీదకి దారి తీసింది. గత ఆరు నెలలుగా అలెన్, కార్లాలు వారానికి రెండు మూడుసార్లు మధ్యాహ్నాలు ఆ మోటెల్‌లోని ఆ గదిలో గంట- గంటన్నర సేపు కలుస్తున్నారు. అది లాస్‌ఏంజెలెస్‌లోని సన్‌సెట్ బుల్‌వార్డ్‌కి ఐదు నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంది.
‘చూస్తూండగానే గంటన్నర ఇట్టే గడిచిపోయింది. నీ సమక్షంలో టైమే తెలీదు అలెన్. నేను ఇక బయలుదేరాలి’
‘మళ్లీ మూడు రోజులకి నా ఒంట్లోని తిక్కని నువ్వు వచ్చి ఇలాగే కుదర్చాలి. అది నీకే సాధ్యం’ నవ్వుతూ చెప్పాడు అలెన్.
‘హాలీవుడ్ వాళ్లు చాలా చెడ్డవాళ్లని, డ్రెస్‌ని మార్చినట్లు అమ్మాయిలను మారుస్తారని విన్నాను. పాపం మీరు మంచివారు. స్నానం చేసి వస్తాను’ కార్లా మెచ్చుకుంది.
‘కలిసి చేద్దామా?’
‘నేను త్వరగా వెళ్లాలి. కలిసి చేస్తే గంట పడుతుంది’ అతని పెదవుల మీద చూపుడు వేలుని నిలువుగా ఉంచి గోముగా చూస్తూ చెప్పింది.
కార్లా మంచం దిగి బాత్‌రూం తలుపు దగ్గరికి వెళ్లి తల తిప్పి అలెన్ వంక చూస్తూ చెప్పింది.
‘రండి. మీ కోరికని ఎందుకు కాదనాలి’
అలెన్ మంచం దిగి నగ్నంగా నిలబడి వున్న ఆమె పక్కకి వచ్చాడు. ఆమె బాత్‌రూం తలుపు తెరిచింది. అలెన్ రెండు చేతులూ అప్రయత్నంగా అతని నోటిని మూసేసాయి. ఎదురుగా కనపడ్డ దృశ్యాన్ని కార్లా తన జీవితంలో మర్చిపోలేదు. కదలిక లేని ఓ పురుషుడి శవం ఎదురుగా బాత్‌రూంలో సగం బాత్ టబ్‌లో, సగం నేల మీదకి పడి ఉంది. తెరచి ఉన్న కళ్లు నిర్జీవంగా చూస్తున్నాయి.
నుదుటి లోంచి లోపలకి దూసుకెళ్లిన బుల్లెట్ గాయం కనిపిస్తోంది. అప్పటికే రక్తం గడ్డకట్టి ఉంది. నల్లటి పంట్లాం, బూడిద రంగు టీ షర్ట్ ధరించిన అతని వయసు ముప్పై - ముప్పై అయిదు మధ్య ఉంటుంది. కార్లా నోట్లోంచి కేక కొద్దిగా బయటకి రాగానే అలెన్ తేరుకుని, తన నోటి మీది చేతులని తీసి ఆమె నోటిని మూసి ఆ కేకని బయటకి రానీకుండా ఆపాడు. తర్వాత కాలితో తలుపుని తన్ని మూసేశాడు.
‘ఒద్దు. అరవకు. ఎవరైనా అరుపుని వింటారు’ అలెన్ చెప్పే మాటలు కార్లాకి నూతి లోంచి వినిపించినట్లుగా వినిపించాయి.
అలెన్ కళ్లు బయటకి తప్పించుకోవాలి అన్నట్లుగా ఆ గదిలోని అన్ని దిక్కుల వంకా చూశాయి. కాని అలాంటి దారి కనపడనట్లుగా నిస్పృహ అతని మొహంలోకి ప్రవేశించింది.
‘ఏం చేయాలి? ఛ! ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాం?’ బాధగా చెప్పాడు అలెన్.
ఆమె ఇంకా తేరుకోకపోవడంతో ఆమె మొహం మీద చిన్నగా తట్టాడు.
‘ముందు డ్రెస్ వేసుకో కార్లా. మనం వెంటనే ఇక్కడ్నించి బయలుదేరాలి’ గుసగుస లాడుతున్నట్లుగా చెప్పాడు.
‘అబ్బ! ఎవరతను? ఎంతటి భయంకర దృశ్యం?’ కార్లా ఏడుస్తూ అడిగింది.
‘నే చెప్పేది విను. సెంటిమెంటల్‌గా, బలహీనంగా ఫీలయ్యే సమయం కాదిది. ముందు మనం ఇక్కడ్నించి వెళ్లాలి. భయపడకు’
‘కాని ఈ శవం పోలీసుల కంట పడ్డాక, మనం ఈ గదిని అద్దెకి తీసుకున్నాం అని వాళ్లకి తెలుస్తుంది. కాబట్టి ముందే మనం మోటెల్ మేనేజర్‌కి ఈ శవం గురించి చెప్తే మంచిది కదా?’ కార్లా సూచించింది.
‘పోలీసులకి చెప్పటమా? నీకు పిచ్చెక్కిందా?’
‘అతన్ని ఎవరో హత్య చేశారు అలెన్! నుదుటి మీద కాల్చి చంపారు!’
‘నువ్వు తెలివిహీనురాలివని నాకు తెలుసు కాని మరీ ఇంతని తెలీదు. పోలీసులు వస్తే రేపు ఉదయం మనిద్దరి ఫొటోలు పేపర్లోకి ఎక్కుతాయి. మీ ఆయన, మా ఆవిడ వాటిని చదువుతారు’
‘సరే. నాకన్నా నువ్వు తెలివిగలవాడివి. వెళదాం పద’ అతనికన్నా త్వరగా కార్లా డ్రెస్ చేసుకుంది.
‘కాని ఆగు. మనం ఆ శవాన్ని అలా వదిలి వెళ్లకూడదు. వెళ్తే పోలీసులకి దాని గురించి, మన గురించి తెలుస్తుంది’ అప్పుడే ఆ ఆలోచన వచ్చినట్లుగా చెప్పాడు అలెన్.
‘ఎలా తెలుస్తుంది. దొంగ పేరుతో కదా నువ్వు మోటెల్‌ని తీసుకుంది?’
‘మనం ఈ మోటెల్‌కి ఆర్నెల్లుగా వస్తున్నాం. మన పేర్లు తెలీకపోయినా మన కార్ల నంబర్లు ఇక్కడి సిబ్బందిలో ఎవరికైనా గుర్తుండచ్చు. రంగు, మేక్‌ని చెప్పినా చాలు. పోలీసులు మనల్ని కనుక్కోగలరు’
‘అలెన్. ఐతే మనల్ని పోలీసులు హంతకులుగా అనుమానిస్తారా?’ భయంగా అడిగింది కార్లా.
‘కొద్దిసేపు నోరు మూసుకో. నన్ను ఆలోచించుకోనీ’
తను ఉన్న పరిస్థితికన్నా అతను ప్రదర్శించే తిరస్కార ధోరణి వల్ల ఆమె కళ్లవెంట నీరు కారసాగింది. ఇదివరకు తనో దేవత అనేలా ప్రవర్తించాడు. ఇప్పుడు?
‘అలెన్. నేను వెళ్తాను’ చెప్పింది.
‘కదలక. ఇందులో మనం ఇద్దరం ఇన్‌వాల్వ్ అయి ఉన్నాం. బాధ్యతని నా ఒక్కడి మీదే వేసి ఎలా వెళ్తావు?’
‘కాని నేను వెళ్లాలి. హత్య కేసులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. నువ్వే దీన్ని హేండిల్ చెయ్యి’
‘చీకటి పడేదాకా ఆగు. నేనొక్కడ్నే ఈ శవాన్ని కారులోకి మోసుకు వెళ్లలేను. ఈ శవాన్ని ఇద్దరం కలిసి మాయం చేస్తే కొంత ప్రమాదం తప్పుతుంది. నా పేరు ఇందులో ఇన్‌వాల్వ్ అయితే ఇక నాకు హాలీవుడ్‌లో పని దొరకదు’
‘ఇది ఈ గదిలో మన ముందు దిగిన వారి పని అయి ఉంటుంది. మనం వెళ్లి మేనేజర్‌కి ఈ సంగతి ఫిర్యాదు చేస్తే అప్పుడు మన నిజాయితీ ప్రపంచానికి తెలుస్తుంది’
‘నీ అంత మందమతిని ఇంతదాకా నేను చూడలేదు. అతను వెంటనే పోలీసులని పిలుస్తాడు. వాళ్లు మనం చెప్పేది నమ్ముతారని హామీ లేదు. మన ఇద్దర్నీ అనుమానం మీద అరెస్ట్ చేయచ్చు. ఛ! వీడు ఈ గదిలోనే చావాలా?’ తత్తరపడుతూ అలెన్ చెప్పాడు.
‘అలెన్. నేను వెళ్తున్నాను. టామ్ వచ్చేలోగానే మా ఇంటికి చేరుకుని నేను వంట పూర్తి చేయాలి’
‘ఆగు. బాధ్యత అంతా నా మీద వేసి తప్పించుకోవాలని చూడకు. మనిద్దరం ఇందులో భాగస్వాములం. ఒంటరిగా నేను గదిని అద్దెకి తీసుకున్నానని పోలీసులకి చెప్తే వీడ్ని చంపడానికే అనుకుంటారు. నీ కోసం తీసుకుంటే ఆ అనుమానం బలహీనపడచ్చు’
కార్లాకి తను ఓ జైలు గదిలో చిక్కుకున్నట్లుగా అనిపించింది.
‘దయచేసి నన్ను ఇందులో ఇరికించకు’ అతన్ని ప్రార్థించింది.
‘నాకు అనుమానం వస్తోంది. నీకు నాలా ఇంకెందరితో సంబంధం ఉంది? వారిలో ఓ ప్రియుడు అసూయతో ఈ పని చేసి ఉంటాడు అవును. నాకది నిజం అనిపిస్తోంది’
కార్లా తల అడ్డంగా ఊపుతూ చెప్పింది.
‘ఎంత అసహ్యంగా ఆలోచిస్తున్నావు? నేను వెళ్లాలి’
‘ఈ పని చేసిన నీ ఇంకో ప్రియుడు ఎవరో ఆలోచించు. రాజకీయ నాయకుడా? గూండానా? పోలీస్ ఆఫీసరా?’
‘అలెన్! నన్ను అవమానించక’
‘నీ రహస్య ప్రియుడికి ఫోన్ చేసి నాకంతా తెలిసిందని, ఇందులోంచి బయట పడేయమని, లేదా అతని పేరు, హత్యకి కారణం బహిర్గతం చేస్తామని బెదిరించు’
‘అలెన్?!’
‘అదొక్కటే పరిష్కారం. సరైన పరిష్కారం’
‘నీ ఊహలన్నీ అబద్ధాలు. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నా పేరు ఇందులో ఇన్‌వాల్వ్ చేయకు అలెన్. నేను వెళ్తున్నాను’
గుమ్మం దగ్గరకి వెళ్లింది కార్లా.
‘ఆగు. నువ్వు నన్ను ఈ శవంతో వదిలి వెళ్తే ఇక ఈ జన్మలో నీ మొహం చూడను’ హెచ్చరించాడు అలెన్.
‘అలాగే’
‘నాకెప్పుడూ ఇక నువ్వు ఫోన్ చేయకు. నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకు. నువ్వు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయను’ మళ్లీ అరిచాడు అలెన్.
‘ఓకే. ఫోన్ చేయను. ప్రామిస్’ అతని వంక కోపంగా చూస్తూ చెప్పింది.
కార్లా తలుపు తెరచుకుని బయటకి వెళ్లిపోయింది. అలెన్ కిటికీలోంచి ఆమె కారు ఎక్కి వెళ్లడం చూశాడు. తర్వాత బయటకు వెళ్లి తన కారు డిక్కీ తలుపుని తెరిచాడు. మళ్లీ లోపలకి వచ్చి తన కోటుని విప్పి బాత్‌రూంలోని ఆ శవానికి దాన్ని చుడుతూ చెప్పాడు.
‘గుల్ ఓల్డ్ జార్జ్! మరోసారి మనదే విజయం. ఆమెని ఎప్పటిలా తేలిగ్గా వదిలించుకున్నాను. ఇక ఈ మోటెల్‌కి కొత్త పిట్ట వస్తుంది. నిన్ను మళ్లీ జాగ్రత్తగా స్టూడియోలోని ప్రాపర్టీస్ డిపార్ట్‌మెంట్‌లో అప్పగించాలి’
అలెన్ షూటింగ్స్‌లో వాడే అచ్చం మనిషిలా కనిపించే, మైనంతో చేసిన ఆ బొమ్మని మంచం కింద దాచిన అట్టపెట్టెలో పెట్టి బయటకు తీసుకెళ్లాడు.
* (రుత్ విస్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)--మల్లాది వెంకట కృష్ణమూర్తి
December 25th, 2011,Courtecy: Andhra Bhoomi