27, డిసెంబర్ 2011, మంగళవారం

మల్టీస్టారర్ చిత్రాలు పెరిగేనా?

ప్రతి ప్రేక్షకునికి ఇద్దరు అభిమాన నటులుంటారు. వారిద్దరూ కలిసి, ఒకే సినిమాలో నటిస్తే చూడాలని, అన్నివర్గాల ప్రేక్షకులకు వుంటుంది. పాత తరం నటుల్లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించి, అభిమానుల్ని అలరించారు. కానీ నేటి తరం ప్రేక్షకులకు ఆ కమ్మని అనుభూతి కలగానే మిగిలిపోయింది. ఆరోజుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులు ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి నటించి అభిమానుల్ని ఆనందపరిచారు.
ఎందుకో తెలియదు గాని ఈనాటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఏ నటున్నైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, సరైన కథ దొరికితే, తప్పకుండా కలిసి నటిస్తామని చెబుతుంటారు. సరైన కథలంటే ఏంటో వారికే తెలియాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో చక్కని కథారచయితలు, దర్శకులున్నారు. వీరు ఆ మాత్రం కథల్ని అందించలేరా? ఇప్పుడు ఇక్కడి హీరోలకు కలిసి నటించేందుకు కావాల్సింది కథలు మాత్రమే! సాటి హీరోలతో కలిసి నటించాలన్న అభిలాష లేకపోవడంవల్లనే, మల్టీ స్టారర్ సినిమాలు రావడం లేదు. అప్పట్లో కొనే్నళ్ళపాటు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం వలన, ఇక వారి అభిమానుల ఆశ, అడియాసగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టిసారిస్తే మంచిది.
ఇలా నటించడంవలన అభిమాన ప్రేక్షకులకు ఆనందం పంచడమే కాకుండా, పరిశ్రమలో సుహృద్భావ వాతావరణంకోసం కృషిచేసిన వారిగా చెప్పుకోబడతారు.
ఇటీవల అనౌన్స్ అయిన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు కాస్త ఊరటగా అనిపించింది. వెంకటేష్ మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్న ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’అనే చిత్రం, రామ్‌చరణ్ తేజ్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాల వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా ఒకరితో ఒకరికి కలిసి నటించాలని వుందన్న విషయాన్ని, బయటపెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, జగపతిబాబు, శ్రీకాంత్, రవితేజ, అల్లరి నరేష్ మొదలైనవారు మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు.
వీరిలా అందరు హీరోలు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. కొంతకాలంపాటు హీరోలందరూ భేషజాలు పక్కనపెడితే, సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయి. అప్పుడు మనం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, గోపీచంద్ వంటి హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటిస్తే, చూసి తరిస్తాం. అప్పుడు బాక్స్ ఆఫీసులు కూడా పచ్చనోట్లతో కళకళలాడుతాయి.- వౌనశ్రీ మల్లిక్, December 22nd, 2011,Courtecy:Andhra Bhoomi