10, నవంబర్ 2011, గురువారం

అసలు బూచి... ‘ అండ్రాయడ్ ’

-మొబైళ్ల నడుమ ప్రాసెసర్ల యుద్ధం
కంప్యూటర్ కనిపెట్టినపుడు దాని సైజు లారీ అంత వుందని అందరూ అనుకోవడం, కొందరు తెలుసుకోవడం తెలిసిన విషయాలే. అలాంటి కంప్యూటర్ డెస్క్‌టాప్‌గా మారిన తరువాత కూడా అనేక పరిణామాలు సంభవించాయి. పి వన్ అనే సంక్షిప్తనామంతో పెంటియమ్ వన్ ప్రాసెసర్ దాదాపు ఇపుడు కంప్యూటర్లు వాడుతున్న వారిలో చాలామందికి పరిచయం వుండనే వుంటుంది. అంతకు ముందు 386, 486 ప్రాసెసర్లు కూడా వుండేవనీ గుర్తుండే వుంటుంది. అయితే ఇక్కడ కంపెనీల మాయాజాలం ఒకటి వుంటుంది. కొత్తది వచ్చినపుడల్లా పాతకు ధర తగ్గడం అన్నది మార్కెట్ సహజ సూత్రం. ఇలా అయితే కొత్తవి అమ్ముడుపోవు. కొత్తవి అమ్ముడు పోవాలంటే మరేదో కావాలి.. మరేదో చేయాలి. అంటే కొన్ని కావాలంటే మరికొన్ని వుండాలన్న తీరుగా. కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు, గేమ్‌లు, గ్రాఫిక్స్ కనిపెట్టి, ఇవి అన్నీ కావాలంటే మరింత వేగవంతమైన ప్రాసెసర్ వుండాలన్నది టెక్నిక్‌గా వాడారు. దాంతో పీ వన్ నుంచి టూ, త్రీ, ఫోర్, ఆపై డ్యూయల్ కోర్, కోర్ టూ డ్యూ, తాజాగా ఐ త్రీ, ఫైవ్, సెవెన్ వరకు ప్రయాణం సాగుతోంది. మొత్తం మీద కంప్యూటర్ ధరలు మాత్రం అక్కడే వుండేలా జాగ్రత్త పడుతున్నారు. పదివేలలోపూ కంప్యూటర్ దొరుకుతుంది. కానీ మీకు తాజా ప్రాసెసర్ ఉండదు.

ఇప్పుడు ఇదే మార్కెట్ వ్యాపార సూత్రం మొబైల్ రంగానికీ పాకింది. ప్రాసెసర్ అన్నది కంప్యూటర్లకు మొబైళ్లకు ఎంత కీలకమో, అదే ఇప్పుడు వ్యాపారానికి కూడా కీలకంగా మారింది. మొబైళ్లలో కూడా చిన్నదో పెద్దదో, ఏదో తరహాకు చెందిన ప్రాసెసర్ అన్నది అవసరం అన్న సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్‌కు ఇది మరీ కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ చేసే పనులన్నీ మొబైల్‌లో చేయాలనుకున్నపుడు దానికి తగిన సామర్థ్యం కలిగిన ప్రాసెసర్ వుండాల్సిందే.

అయితే స్మార్ట్ ఫోన్‌ల ఆరంభం పెద్దగా ఆసక్తికరంగా ఎంతమాత్రం లేదు రెండేళ్ల క్రితం వరకు. మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌ను మొబైళ్ల కోసం ప్రత్యేకంగా విండోస్ మొబైల్ పేరిట తీసుకువచ్చేక కూడా ఇది ఏమంత పుంజుకోలేదు. ఎటొచ్చీ అండ్రాయిడ్ పేరుతో గూగుల్ మొబైళ్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురావడంతో పెనుమార్పులు ప్రారంభమయ్యాయి.

వాస్తవానికి అండ్రాయిడ్ గూగుల్ ఆవిష్కరణ కాదు. అండ్రాయిడ్ ఇన్‌కార్పొరేషన్ అనే సంస్థను 2005లో తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీన్ని 2003లో ఆండీ రూబిన్, రిచ్‌మైనర్, నిక్‌సియర్స్, క్రిస్ వైట్ అనే వివిధ ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన నలుగురు ప్రారంభించారు. ఈ సంస్థ కేవలం మొబైళ్ల కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే మధ్యలోనే వివిధ ఆర్ధిక కారణాల వల్ల సంస్థ అండ్రాయిడ్ చేతిలోకి వచ్చి, వారిలో కొందరు గూగుల్ సిబ్బందిగా మారిపోయారు. ఆ తరువాత 2007లో ఓపెన్ హ్యాండ్ సెట్ అలియన్స్ అనే కన్సార్టియం ఏర్పాటయింది. దీనికి పలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికాం కంపెనీల ఆర్ధిక మద్దతు వుంది. గూగుల్ ఆధ్వర్యంలో నడిచే ఈ కన్సార్టియం 2007 నవంబర్ 5న తొలి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. అదే అండ్రాయిడ్ 1.0. ఈ ఓఎస్ ఆధారంగా వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఆ తరువాత వరుసగా అండ్రాయిడ్ 1.1 (2008 సెప్టెంబర్), 2009 ఏప్రిల్ 30న 1.5 విడుదలయ్యాయి. 1.5 నుంచీ ఓఎస్‌కు తిండిపదార్ధాల పేర్లు పెట్టండం ప్రారంభమయింది. 1.5కు కప్‌కేక్ అని పేరుపెట్టారు. ఆపై వరుసగా, 1.6 డోనట్ (సెప్టెంబర్ 2009), 2.0 ఎక్లైర్స్ (అక్టోబర్ 2009), 2.2 ఫ్రాయో (మే 2010), 2.3 జింజర్‌బర్డ్, ఆపై 3.0 హానీకూంబ్ విడుదలయ్యాయి. తాజాగా 4.0 ఐస్‌క్రీమ్ సాండ్‌విచ్ వచ్చింది.

ఇదీ సంక్షిప్తంగా అండ్రాయిడ్ హిస్టరీ.

గూగుల్ చాలా తెలివైన వ్యాపార సంస్థ. సూక్ష్మంగా అర్ధమయ్యేలా చెప్పాలంటే విషయం వున్నా లేకున్నా, హైప్ తేవడంలో మన తెలుగు సినిమా జనం ఎలా నిష్ణాతులో, ఒక ఉత్పాదన పట్ల ఆసక్తి కలిగించడంలో గూగుల్ అంతటి దిట్ట. గూగుల్ కల్పించిన ప్రాచుర్యంతో అండ్రాయిడ్‌కు రావాల్సినదాని కన్నా ఎక్కువ పేరే వచ్చింది. దీంతో విండోస్ మొబైల్ వెనక్కుపోవడంతో పాటు దాదాపు ఒక్క నోకియా, ఆపిల్ మినహా మిగిలిన అన్ని చిన్నా, పెద్దా టెలికాం సంస్థలన్నీ గూగుల్ అండ్రాయిడ్ ఓఎస్‌తో ఫోన్లు మార్కెట్‌లోకి తేవడంలో పోటీ పడ్డాయి. మొబైల్ అంటే కేవలం మాట్లాడుకునేందుకు అన్న సంగతి తుడుచుపెట్టుకుపోయింది. లక్షలాది అప్లికేషన్లు గూగుల్‌కు అనుబంధంగా స్టోర్‌లో సిద్ధమయ్యాయి. కేవలం వందా యాభైకి అప్లికేషన్లు లభించడం పెద్ద సౌలభ్యంగా మారింది. ఔత్సాహికులు కూడా పలు అప్లికేషన్లు రాసి అందించడం, దాని ద్వారా ఆర్ధికంగా సంపాదించుకోవడం మామూలయింది. ఇలా అండ్రాయిడ్ ద్వారా అప్లికేషన్లు, అప్లికేషన్ల ద్వారా అండ్రాయిడ్ పాపులర్ కావడంతో, మొబైల్ కంపెనీలన్నీ ఆ ఫీచర్లన్నీ తమ ఫోన్ ఫీచర్లన్నట్లుగా ప్రచారం చేసుకుని అమ్మకాలు పెంచుకుంటున్నాయి.

ఇప్పుడు మళ్లీ వెనక్కువస్తే, ఇన్ని అప్లికేషన్లు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటే కాస్త శక్తివంతమైన ప్రాసెసర్ కావాలి. పైగా మొబైళ్ల సైజుకు అనుగుణంగా వుండాలి. దీంతో ఆ తరహా ప్రాసెసర్లు తయారయ్యాయి.

స్నాప్‌డ్రాగన్, హమ్మింగ్ బర్డ్, ఎన్‌విడియా టెగ్రా, టెక్సాస్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా పేర్లలా వున్న ఇవీన్నీ మొబైల్ ప్రాసెసర్ల పేర్లే. గత ఏడాది ఐఫోన్ 4 విడుదలైనపుడు తొలిసారి శక్తివంతమైన వన్ గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను ఆర్ట్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించి విడుదల చేసింది. ఇన్‌ట్రిన్‌సిక్ అనే సెమీ కండక్టర్ కంపెనీ దీన్ని రూపొదించింది. ఇది ఆపిల్ చేజిక్కించుకున్న కంపెనీల్లో ఒకటి. శ్యామ్‌సంగ్ హమ్మింగ్‌బర్డ్ దీనికి గట్టిపోటీ. గెలాక్సీ ఎస్ సిరీస్‌లో వాడేదిదే. పలు టాబ్లెట్లలో వాడే ఎన్‌విడియా ప్రాసెసర్ కూడా తక్కువదేమీ కాదు.

ఇప్పుడు వన్ గిగాహెడ్జ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గిగాహెడ్జ్ సామర్థ్యం వున్న మొబైళ్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. వీటిలో గెలాక్సీ నోట్, ఎస్‌టూ, మోటరోలా డ్రాయిడ్ రేజర్, వున్నాయి. మరోపక్క దేశీయ కంపెనీలు అండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే తక్కువ రేంజ్ ఫోన్‌లను తెస్తున్నాయి. వీటి ప్రాసెసర్‌లు మహా అయితే 600మెగాహెడ్జ్ మించి వుండవు. ర్యామ్ 256 ఎమ్‌బీ వరకు వుండొచ్చు. దానికి తోడు వీటికి అదనపు సదుపాయాలుండవు. ఉదాహరణకు హై రిజల్యూషన్ డిస్‌ప్లే, ఓఎమ్‌ఎల్‌ఇడీ, గెరిల్లా గ్లాస్, హెచ్‌డీ విడియో, క్రిస్టల్ గ్రాఫిక్స్ ఇలా.. ఇలాంటివన్నీ జోడిస్తే ధర మళ్లీ ముఫై దగ్గరకు చేరిపోతుంది. అంటే దానా దీనా తేలేదేమిటంటే ధరలు అక్కడే వుంటాయి. సామర్థ్యాలు పెరుగుతుంటాయి. అవసరాలు పెంచుతుంటారు. ఇదీ కంప్యూటర్ కంపెనీల మాయాజాలం. మరోపక్క మొబైల్ ప్రాసెసర్లను ఉపయోగించి టాబ్లెట్లను రూపొందించడం ప్రారంభమైంది. ఇక్కడ కూడా టాబ్లెట్‌లకు వచ్చిన క్రేజ్‌ను కంపెనీలు వాడుకోవడం ప్రారంభించాయి. పదివేల లోపే టాబ్లెట్ అని ప్రచారం మొదలయింది. వాస్తవానికి వాటి పనితీరు కూడా అంతంతమాత్రం కావడం గమనార్హం. ఎయిర్‌టెల్ సంస్థ చైనా కంపెనీ టాబ్లెట్‌ను రీబ్రాండ్ చేసి తొమ్మిదివేలకు భారతీ మ్యాజిక్ పేరిట విక్రయిస్తున్నా స్పందన అంతతమాత్రం. ఎందుకంటే రాజును చూసిన కళ్లతో అన్నట్లు మిగిలిన బడా టాబ్లెట్ల ముందు అది ఆనడం లేదు. హెచ్‌సిఎల్, వ్యూసోనిక్ తదితర కంపెనీల టాబ్లెట్లకూ స్పందన అంతత మాత్రమే. అంటే వినియోగదారుడు తక్కువ ధరతో పాటు పనితీరు కూడా గమనిస్తున్నాడని అర్ధమవుతుంది. ఇది మంచి పరిణామమే. కంపెనీల మాయాజాలంలో పడకుండా కొనుగోలుదారులే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. మొబైల్‌తో లేదా టాబ్లెట్‌తో వారి అవసరాలేమిటి? అందుకు సరిపోయే ప్రాసెసర్, ఇతర సదుపాయాలేమిటి చూసుకుని రేంజ్‌ను డిసైడ్ చేసుకోవాలి. అదే విధంగా కంపెనీలు వాటికి గూగుల్‌తో వుండే ఒప్పందాలు, అప్‌డేట్‌లు, కొత్త వెర్షన్‌లు వచ్చే సదుపాయాలు చూసుకోవాలి. అలా కాకుండా అండ్రాయిడ్ ఫోన్, అయిదువేలలోనే వస్తోందనుకుంటే మళ్లీ ఇబ్బందులు పడే అవకాశం వుంది. కాదు అలా అని హైఎండ్‌కే పోదామనుకుంటే వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఆచితూచి వ్యవహరించడం మేలు.

...................................................

దొరికిందీ...!
పక్కమీద వయ్యారంగా పడుకుని పుస్తకం చదువుతున్న భార్యపక్కకు చేరాడు వెంకటేశ్వర్రావ్. మెల్లగా మెడకింద చేయి దూర్చి అటూ ఇటూ కదిపాడు. ఆపై జుట్టులోకి వేళ్లు పోనిచ్చి మెడ వెనుక నిమిరాడు. కాస్పేటికి వీపుకిందకు చేర్చి సుతారంగా రాశాడు. ఆపై నడుం కిందకు, కాస్సేపటికి కాళ్ల దగ్గరకు చేరాడు. మెల్లగా మోకాళ్లు నొక్కి ఆపై రెండో పక్క చేరాడు. ఇలా ఏదో ఒక భాగంలో ఏదో ఒకటి చేస్తూ, ఉన్నట్లుండి లేచి, టీవీ దగ్గరకు వెళ్లి కామ్‌గా చూడ్డం ప్రారంభించాడు.
‘బాగుంది.. ఆపేసారేం.. కానివ్వండి’ అంది భార్య కనకరత్నం.
‘రిమోట్ దొరికేసింది’ బదులిచ్చాడు వెంకటేశ్వర్రావు.

...............................................................................................................................................

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
ఓ అరడజను మంది కుర్రాళ్లు కాస్త వయసు మళ్లిన సన్నాసిరావు కలిసి యాత్రలకు బయల్దేరారు. వీళ్లలో ఓ మహానుభావుడికి గురకపెట్టే అలవాటు వుంది. ఇద్దరేసి ఒక గదిలో సర్దుకోవాల్సిన పరిస్థితి. మొదటి రోజు రాత్రి ఆ గురకేశ్వరుడితో గది పంచుకున్న కుర్రాడు మర్నాడు ఉదయానే్న బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చేసరికి సంతలో తప్పిపోయిన పిల్లాడిలా తయారయ్యాడు. కళ్లు చింతనిప్పుల్లా వున్నాయి.. జుట్టు లేచి నిల్చుంది.
‘ఏమయింది..రా’ అడిగారు మిత్రబృందం.
‘గురకా అది.. స్టోన్ క్రషర్ పక్కనే వున్నట్లు వుంది.. రాత్రంతా నిద్ర వుంటే ఒట్టు.. వాడికేసే చూస్తూ కూర్చున్నా’ బదులిచ్చాడు బాధితుడు.
మర్నాడు మరో బలిపశువు.
వాడూ షరా మామూలే. ఇలా కాదు.. ఈ ముసిలాడ్ని పంపేద్దాం. గొడవ వదిలిపోతుంది అని పేద్ద ఎత్తు వేశారు.
ముసిలాడు తెల్లవారి హ్యాపీగా విజిల్ వేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చాడు. తెల్లమొహం వేయడం వీళ్ల వంతయింది.
‘ఎలా..హౌ..’ఇలా ప్రశ్నలు కురిసాయి.
‘ఏముంది గదిలో పడుకునే ముందు.. కుర్రాడికేసి వాడి పర్సుకేసి చూసా.. నీ దగ్గర బాగానే డబ్బులున్నట్లున్నాయి.. చేతికి రింగు, బ్రేస్‌లెట్.. వ్యవహారం జోరుగానే వుంది.. అనేసి నిద్రపోయా.. నిద్రపోకుండా మెలకువగా వుండడం వాడి వంతయింది..’ బదులిచ్చాడు వయసుమళ్లిన వెంకటేశ్వర్రావు.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదే మరి.

................................................................................................................................................
టిట్ ఫర్...
నానమ్మ పుట్టిన రోజు వస్తోంది కదా ఏం గిఫ్ట్ కొంటున్నావ్’ ..అన్నయ్య చందూని అడిగింది, చెల్లి చంద్రమ్మ.
‘్ఫట్‌బాల్’ టక్కున బదులిచ్చాడు చందూ.
‘అదేంటి నానమ్మ ఏం చేసుకుంటుంది’
‘మరి నేను ఆడుకునే వయసులో వున్నపుడు నాకు ప్రతి పుట్టిన రోజుకి నానమ్మ పుస్తకాలే కొనిచ్చేది’ మాటల్లో చందూ కసో.. బాధో.. ఏదో ఒకటి తొంగిచూసింది.
ఎల్‌ఐసీ పాలసీ... మీరు మరణించిన తరువాత మిమ్మల్ని ధనవంతుల్ని చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందం.

- నేనే