7, నవంబర్ 2011, సోమవారం

ఏది ప్రజాసాహిత్యం? ఏది కార్పొరేట్ సాహిత్యం?

‘ప్రజాసాహిత్యం’ కానిదంతా ఇప్పుడు కార్పొరేట్ సాహిత్యమే! కళకొరకు ఆనందం కొరకు తృప్తికొరకు వ్రాసామనేదంతా ప్రజా సాహిత్యం కానేరదు. ‘ప్రజాసాహిత్యం’ కానిదంతా కార్పొరేట్ సాహిత్యమన్నాను కనుక ‘ఏది ప్రజాసాహిత్యం’ తేలవలసిన అవసరముంది.ప్రపంచం పూర్తిగా మారిపోయింది. బహుళజాతి సంస్థల గుప్పిట్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఓటు ప్రయోజన సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి. ప్రజాస్వామ్య దేశాలలో అంతరాలు బాగా పెరిగాయి. పేరుకు ప్రజాస్వామ్యం ఆచరణలో ధనస్వామ్య దేశాలుగా మారిపోయాయి. ప్రపంచీకరణ ఆధునిక విజ్ఞానాన్ని పెంచి-ఆధునిక విజ్ఞానం కార్పొరేట్ శక్తుల దోపిడీకి వరంగా మారి-ప్రజలపాలిట రాక్షసిగా మారిపోయింది. ‘ప్రపంచీకరణ’ ప్రభావం ఎంత బలంగా ఉందంటే కమ్యూనిస్టు దేశంగా పిలువబడే చైనా పెట్టుబడి దేశంగా మారిపోయింది. ప్రపంచీకరణ తర్వాత అన్ని దేశాలు ఇంచుమించు పెట్టుబడి దేశాలుగా మారిపోవాల్సి వచ్చింది.
ప్రపంచీకరణకు అనుకూలంగా వ్రాసే సాహిత్యమంతా కార్పొరేట్ సాహిత్యమే. ప్రతికూలంగా వ్రాసేది మాత్రమే ప్రజాసాహిత్యమవుతుంది. ఈనాడు ప్రతి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇదంతా ప్రజల కొరకనే నమ్మిస్తుంది. ప్రజలు తిరగబడకుండా సంక్షేమ పథకాల ముష్టి విదిలిస్తుంది. ప్రజల కొరకు రాసింది లేదా ప్రజలను హీరోను చేసింది, ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేది ప్రజాసాహిత్యం. ఇంకా సరైన నిర్వచనం ఇవ్వాలంటే- శ్రామికులు మాత్రమే ప్రజలు. ఈ కోణంలో శ్రామిక సంస్కృతి ప్రజా సంస్కృతి అవుతుంది. ఆఫీసర్ల సంస్కృతి కార్పొరేట్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది. ప్రజాసంస్కృతి శ్రమైక జీవన సౌందర్యంతో నిండివుంటుంది. శ్రమైక జీవన సౌందర్యమే నిజమైన ప్రజాసాహిత్యం. ఆధునికత దోపిడీ శక్తులకు సరికొత్తగా దొరికిన ఆయుధం. ఇది అర్ధంకాని రచయితలు ఆధునికతను ఆకాశానికెత్తేశారు. ‘‘పొలం దున్నితే ఏమొస్తుంది?’’ ‘‘మగ్గం నేస్తే ఏమొస్తుంది?’’, ‘‘కుండలు కాలిస్తే ఈ కాలంలో బతుకుతామా?’’-ఈ వాదనలో వాస్తవముండవచ్చు. ఈ వాదన వెనక ఇంకో వాస్తవముంది. ‘‘పొలం దునే్నవాళ్లు-మగ్గం నేసేవాళ్లు, కుండలు కాల్చేవాళ్లు’’ ఎలా బతకాలి వాళ్ల బతుకుతెరువు ఏమిటీ? వాళ్ల గూర్చి వ్రాసేది ప్రజాసాహిత్యం, పొలం దున్నటంలో, మగ్గాల స్థానంలో, కుండల తయారీలో ఆధునికత వచ్చి వెయ్యిమంది పని ఒక యంత్రం చేసినప్పుడు ఆ యంత్రం యజమాని ఆధునికత సృష్టించిన దోపిడీ దారు. ‘ఆధునికత’ మామూలు ప్రజలకు శత్రువుగా మారింది. అయితే- మొత్తం ఆధునికతను కొట్టిపారేయలేం! ‘ఆధునికత’ సరికొత్త దోపిడీని సృష్టించకపోతే మంచిదే. ఈ వైరుధ్యాలు ఈ వ్యవస్థకున్న సంబంధాన్ని అర్ధం చేసుకుని వ్రాసేవాడే నిజమైన ప్రజారచయిత. ప్రజా రచయిత మొదట వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకోపోతే ప్రజలపక్షాన వ్రాయలేడు. నేను సృష్టించే సాహిత్యం ఆనందం, అనుభూతి కొరకు ప్రజలకొరకు కాదు అనే రచయిత తటస్థ రచయిత కాదు. కార్పొరేట్ రచయితలలో ఆయన ఒకరు. ఆయన రచనలు డైరక్టుగా కార్పొరేట్ సామ్రాజ్యానికి అంకితం కాకపోవచ్చు. పరోక్షంగా కార్పొరేట్ సామ్రాజ్యానికి మద్దతుగా ఉంటాయి.
చెట్లు, పూలు, వెనె్నల గూర్చి వ్రాసారనుకుందాం. ఈ వ్యవస్థలో ఇవన్నీ దోపిడీకి గురి అవుతున్నాయి. ఎలా దోపిడీకి గురి అవుతున్నాయో అర్ధం చేసుకోకుండా చెట్టునీడ గురించి, పూలవాసన గురించి, వెనె్నల అందం గురించి వ్రాస్తే లాభమేమిటి?- ప్రకృతిని మనకు కాకుండా చేస్తున్న కార్పొరేట్ సామ్రాజ్యం మన ముందు ఉంది. అడవులను ధ్వంసం చేసి వనరులను దోపిడీ చేసి గిరిజనుల జీవితాలను బూడిద చేస్తున్న బహుళజాతి సంస్థలు మన ముందు ఉన్నాయి. వీటి గూర్చి వ్రాయకుండా-వెనె్నల గురించి వ్రాసి అనుభూతి పేరుతో ‘రచన’ అనటం పలాయన వాదమే తప్ప ప్రజలపక్షాన నిలబడిన రచయిత కాలేడు. సాహిత్యం కాదు. ఈ వ్యవస్థను అర్ధం చేసుకోవడంలోనే ప్రజా సాహిత్య వౌళిక స్వరూపం దాగి ఉంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థగా భావిద్దాం! అలా చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో నిజమైన ప్రజలంటే ఎవరు?-శ్రమను నమ్ముకున్న వారు ప్రజలు. ఈప్రజలు చట్టసభలోకి వెళ్లగలుగుతున్నారా?-కోటీశ్వరులు మాత్రమే చట్టసభలలోకి వెళ్లగలిగిన బోగస్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. కోటీశ్వరులు తమకనుకూలంగా తమ వ్యాపారానికి దోపిడీకి సమర్ధనీయంగా ‘చట్టం’ చేసుకుంటారు. అది ఆమోదమవుతుంది. అమలులోకి వస్తుంది. ఇంకా ఏముంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని ఏ ముఖంపెట్టుకుని విర్రవీగగలం? ఈవిషయం వ్రాయని వాడు ప్రజా రచయిత కాలేడు. ఇది పక్కా దోపిడీ వ్యవస్థ. పది సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలయినా కొంత కనిపించేవి. ప్రజలంటే కొంత భయముండేది. ఇంత దగాకోరుతనం ఇంత విచ్చలవిడి మోసం ఉండేది కాదు. ఇప్పుడు దోపిడి నగ్నంగా నిలబడింది. చట్టబద్ధ దోపిడీ-చట్టబద్ధ దోపిడీని ధిక్కరించడమంటే-చట్టాన్ని ధిక్కరించడమే, ఈనాడు చట్టాన్ని ధిక్కరించే వాడే ప్రజారచయిత.
నిజంగా ‘చట్టం’ మూలంగా పేద ప్రజలకు ఒరుగుబాటుందా?- చట్టం మూలంగా పేదోడి ఆకలి కడుపు నిండుతుందా? కోట్లాది పేదలు ఆకలితో చస్తూ ఉంటే సర్కారు గోదాంలలో ధాన్యం ముక్కి పోతోందని, ఎలుకల పాలవుతుందని-ఇదంతా బీదలకు పంచమని ఉన్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకున్న నాధుడు లేడు. ఇంక ఏ చట్టాలను నమ్ముకుంటారు ప్రజలు. ‘చట్టం’ మూలంగా అవినీతి తగ్గుతుందా?- ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రభావాన్ని తగ్గించగలదా?- చిత్రహింసలకు గురి అవుతున్న స్ర్తిని పురుషాధిపత్య సంకెళ్లనుండి అది రక్షించగలదా?- అగ్రవర్ణాల అహంకారం నుండి అణగారిన వర్గాలకు చట్టం తోడుగా ఉండగలదా? ఏ చట్టం పేద ప్రజలకు ఉపయోగపడిందో-ఉపయోగపడుతోందో చెప్పగలరా? దోపిడీ వర్గంలోని వైరుధ్యాలను కక్షపూరితంగా వాడుకోవడానికి చట్టం పనిచేస్తూ ఉంది. దోపిడీ వర్గాలు శిబిరాలుగా చీలిపోయాయి. ఒకరిమీద ఒకరు దుమ్ము పోసుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి చట్టం పనికొస్తుంది. జి2 స్కాంపై సుబ్రమణ్యస్వామి పోరాటం అలాంటిదే-పైగా చట్టం ప్రజల హక్కులమీద చట్టబద్ధంగా దాడి చేయడానికి, అరెస్టు చేయడానికి-ఆఖరుకు ఎన్‌కౌంటర్ చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు ప్రజలెలా ఉన్నారు? పోరాడుతున్నారు. పిడికిలెత్తుతున్నారు. ధిక్కరిస్తున్నారు. మరికొంత మంది దుఃఖంతో, కన్నీళ్లతో, ఆకలితో, అప్పులతో, సమస్యలతో, అవినీతితో, అధిక ధరలతో, కరెంటు కోతతో, అశాంతితో పాలుపోక-ఏమీ చేయలేక నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నారు. తిరగబడే దగ్గర తిరగబడుతున్నారు. మొత్తంమీద ఈ వ్యవస్థపట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు? వారు ఎటువంటివారు?-ప్రశ్నించు . డాక్టర్ కాళ్లు మొక్కి డబ్బులిచ్చి వైద్యం చేయించుకుంటారు బయటకు వచ్చినప్పుడు ‘డాక్టర్ ఎలాంటివాడని ప్రశ్నిస్తే? ‘దొంగలు’ అనేస్తారు. షాపులో సామాను కొంటారు. బిల్లు కట్టి బయటకు వచ్చిన తర్వాత ‘దోచుకుంటున్నారు’ అనేస్తారు. న్యాయవాదికి డబ్బిచ్చి కేసు అప్పగిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ‘దొంగనాకొడుకు’ అనేస్తారు. వీళ్లంతా దొంగలా?-కాదు. కానీ మామూలు ప్రజల దృష్టిలో వీరంతా దొంగలయ్యారు. ఎందుకూ? వ్యవస్థ దొంగలమయమైంది. దోపిడీదారుల వశమైంది కనుక మనం వ్రాసే సాహిత్యం ‘దొంగలకు’ వరంగా మారకూడదు. మన రచన ప్రత్యక్షంగా, పరోక్షంగా దోపిడీకి సహకరించకూడదు. అంటే-శ్రమ ప్రజల దిక్కు నిటారుగా అంకిత భావంతో నిలుచుని వారి దుఃఖాన్ని సమస్యలను వ్రాస్తూ-వారి మనసులో ఉన్న ధిక్కార భావాన్ని పోరాటరూపంగా మార్చేవాడే నిజమైన రచయిత.
పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు పంచడానికి భయపడేవారు. కానీ ఇప్పుడు కోట్ల ప్రజలకు ఇల్లు, భూమి కల్పించాల్సిన ప్రభుత్వమే సెజ్‌ల పేరుతో లక్షలాది ప్రజల తరతరాల భూమిని లాక్కుంటోంది బలవంతంగా. ఎన్నో చోట్ల ఇందుకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. ఈ తరుణంలో నిజమయిన ప్రజారచయిత కర్తవ్యమేమిటి? ప్రజలభూమికి, ఆస్తికి బాసటగా ఉండాలి. ప్రజల పోరాటానికి మద్దతు పలకాలి. ఎంతమంది రచయితలు ఇలా ఉన్నారు. ఇది మా పని కాదు. ప్రజలను ఆనందింపచేయడానికి, రచనలు వ్రాస్తున్నాం అనేవారున్నారు. ఈ తరుణంలో సంతోషం, ఆనందం ఎవడికి కావాలి? కాలక్షేప రచనలు మనసును మధురిమలలో ఓలలాడించే రచనలు కార్పొరేట్ సాహిత్యం తప్ప ప్రజాసాహిత్యం కాదు. ‘సెజ్’ల దోపిడి మామూలు విషయం కాదు. సెజ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. రచయితలు ప్రజల పోరాటాన్ని చిత్రించడం ధర్మం కాదా? ప్రజలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఈ బాధలకు ఎవరు కారకులు?-సరియైన విద్య లేదు. వైద్యం లేదు. రక్షణ లేదు. భద్రత లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కుల వృత్తులు మంట గలిసాయి. ఉపాధి హామీలేదు. చదువుకున్నవారికి ఉద్యోగ గ్యారంటీ లేదు. దేశంలో విశృంఖలత్వం, జులాయితనం, గూండాగిరి, ఉగ్రవాదం పెరిగింది. నీతి పూర్తిగా కుప్పకూలింది. పేదోడు కడుపు నింపుకుంటాడో లేదో పరిస్థితి గడ్డుగా ఉంది. పోనీ ఇది ప్రజాస్వామ్యం కదాని? ఎన్నికల సమయంలో మంచివారిని ఎన్నుకోవడానికి అవకాశాలు లేవు. అన్ని రాజకీయపార్టీలు డబ్బున్న అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయి. డబ్బున్న వాళ్లకే టికెట్లు. వారికి బీదవాడి బతుకు అర్ధం కాదు. వీళ్లంతా కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తారు. వారికి అనుకూలంగా చట్టాలు నిర్మిస్తారు. వ్యవస్థ ఈ స్వరూపంలో ఉన్నప్పుడు- సాహిత్యం పేదవాడి ధర్మ యుద్ధానికి మద్దతుగా ఉండాలి. వాడి ఆలోచనలను, బాధలను దుఃఖాలను ఆవిష్కరించాలి. వాడి ధిక్కరణను, పోరాటాన్ని సాహిత్యం చిత్రించాలి. ప్రజలు నిశ్శబ్దంగా ఉండి ప్రజలకు ఏది మంచో గ్రహించి అది వ్రాసేవాడే నిజమైన ప్రజారచయిత.
                                                                                                                      -సిహెచ్ మధు, 9949486122