7, నవంబర్ 2011, సోమవారం

ఒమన్ సముద్రంలో భారతీయ నౌక మునక

-అయిదుగురు మృతి, తొమ్మిది మంది గల్లంతు
దుబాయి, నవంబర్7: దక్షిణ ఒమన్ తీరానికి దగ్గర్లో భారతీయ నౌక ఒకటి మునిగిపోవడంతో అయిదుగురు భారతీయ సెయిలర్లు మృతి చెందగా మరో 9 మంది జాడ తెలియరాలేదు. ‘ఎంఎస్‌వి శివ్‌సాగర్’ అనే ఈ నౌక శనివారం ఒమన్‌లోని దక్షిణ ధోఫర్ ప్రాంతానికి దగ్గర్లో సముద్రంలో మునిగిపోయింది. ఒమన్ కోస్ట్‌గార్డ్, నౌకాదళానికి చెందిన నౌకలు సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని రక్షించాయని, అయితే మరో తొమ్మిదిమంది జాడ తెలియడం లేదని ‘గల్ఫ్ న్యూస్’ పత్రిక తెలిపింది. ఈ వారంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ధోఫర్ ప్రాంతం అతలాకుతలమైంది. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, నౌకలు కూడా మరో 24 గంటల పాటు సముద్రంలోని పరిస్థితిని గమనిస్తూ ఉండాలని వాతావరణ విభాగం శుక్రవారం హెచ్చరించింది కూడా. జాడ తెలియకుండా ఉన్న సెయిలర్లను కెప్టెన్ ప్రభులాల్, ఇంజనీర్ సురేష్, లాల్జీ, భరత్, మోహన్ మెహతా, అష్రాఫ్ అసమ్, యూసుఫ్ సమారా, సులేమాన్ హాజీ సుమారా, హుస్సేన్ సుమారాలుగా గుర్తించారు. కాగా, కాపాడిన సెయిలర్లను పోలీసు స్టేషన్‌లో బంధించడం వింతగా ఉందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా తాము భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నామని ఇండియన్ సోషల్ క్లబ్ వెల్ఫేర్ సెక్రటరీ పిఎం జబీర్ చెప్పినట్లు ‘గల్ఫ్‌న్యూస్’ తెలిపింది.