7, నవంబర్ 2011, సోమవారం

పరువు పోకూడదు ... సర్కారు పడకూడదు

-అవిశ్వాసంపై బాబు వ్యూహ రచన
-జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే కష్టమన్న ఆందోళన
- సీనియర్లతో బాబు మంతనాలు



హైదరాబాద్, నవంబర్ 7: ‘ప్రభుత్వం నిలబడాలి. అదే విధంగా మన పరువు నిలబడాలి. ఈ లక్ష్యంతో అవిశ్వాస తీర్మానంపై ఆలోచన చేయండి’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లకు సూచించారు. ‘మేం అనుకున్నట్టుగా జరిగి, జగన్ బలం ప్రస్తుతం ఉన్న బలానికే పరిమితం అయితే మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా ప్రభుత్వం నిలబడుతుంది. అదే సమయంలో మా పరువు నిలబడుతుంది. మాకు కావలసింది ఇదే’ అని టిడిపి నాయకులు చెబుతున్నారు. అలా కాకుండా జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఎలా? అనే సందేహమే అవిశ్వాస తీర్మానంపై ఆచితూచి వ్యవహరించేట్టు చేస్తోందని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు రాగానే చంద్రబాబు వివిధ సందర్భాల్లో పార్టీ సీనియర్లతో అవిశ్వాస తీర్మానంపై చర్చించినట్టు తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి సవాలుగా మారాయి. తప్పనిసరిగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలి. ఒకవేళ ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒత్తిడి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిపై ఎక్కువవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టిడిపి అధ్యక్షుడు అవిశ్వాస తీర్మానం గురించి సీమాంధ్ర టిడిపి నాయకులతో, తెలంగాణ నాయకులతో విడివిడిగా మంతనాలు జరిపారు. ‘మాకున్న అంచనా ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం పడిపోదు. మాకు కావలసింది కూడా అదే. ఆ కోణంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అభిప్రాయమే పార్టీలో బలంగా వినిపిస్తోంది’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ‘హఠాత్తుగా ప్రభుత్వం పడిపోయి, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనే స్థితిలో టిడిపి లేదు. కాంగ్రెస్ లేదు. అలా అని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా వౌనంగా ఉంటే కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కు అయ్యాయనే ప్రచారానికి వీలు కల్పించినట్టు అవుతుంది’ అని టిడిపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. తెలంగాణ సమస్య అలానే ఉండగా, ఈ పరిస్థితిలో తాము ఎన్నికలకు వెళితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, కోస్తాంధ్రలో జగన్‌ను ఎదుర్కొని అధికారంలోకి రావడం అంత సులభం కాదని టిడిపి నాయకులు చెబుతున్నారు. టిడిపి అంచనా ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంటుంది. పార్టీ నుండి కొంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరువాత ఇప్పుడు టిడిపిలో 80 మంది ఉన్నారు. వీరితో పాటు జగన్ వర్గం, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారని టిడిపి నాయకులు తెలిపారు. సిపిఐ, సిపిఎం పార్టీల నుండి టిడిపికి అందిన సమాచారం ప్రకారం ఆ రెండు పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం చర్చలో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి వ్యితిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా లేరని టిడిపి నాయకులు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని, దీని వల్ల స్వల్ప మెజారిటీతో అయినా ప్రభుత్వం నిలబడుతుందని టిడిపి అంచనా వేస్తోంది. జగన్ బలం ఇప్పుడున్న దాని కన్నా పెరగదు అని టిడిపి అంచనా వేస్తోంది. ఇదే విధంగా తాము అనుకున్నట్టుగా జరిగితే అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనే విమర్శను తిప్పికొట్టడానికి అవకాశం లభిస్తుందని టిడిపి నాయకులు తెలిపారు. దీంతో పాటు తెలంగాణ కోసం ఇంత హడావుడి చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే తాము వారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుందని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు.
‘అయితే ఇదంతా మేము అనుకున్నట్టు జరిగితే ఫరవాలేదు. అలా కాకుండా జగన్ రంగంలోకి దిగి ఎన్నికల్లో ఖర్చును భరించి తిరిగి గెలిపించే బాధ్యత నాది అని మరో పది మంది ఎమ్మెల్యేలను తనవైపు మార్చుకుంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అది మాకు ఇబ్బందికరంగా మారుతుంది’ అని టిడిపి నాయకులు చెబుతున్నారు. జగన్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంతకు మించి పెరిగే అవకాశం లేదని భావిస్తున్నామని, అయితే నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్ జరిగే పరిస్థితి వచ్చినప్పుడు జగన్ మరో పది మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే ఎలా? అనే ప్రశ్న తమ చర్చల్లో వచ్చిందని పార్టీ నాయకులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా? లేదా? చూడాలి, నిజంగానే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని సీనియర్లతో జరిగిన చర్చలో చంద్రబాబు తెలిపారు.