7, నవంబర్ 2011, సోమవారం

అంతరిక్షంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం!

వాషింగ్టన్, నవంబర్ 7: అంతరిక్షంలో అత్యంత కాంతివంతమైన, అతి తక్కువ వయసుగల నక్షత్రాన్ని కనుగొన్నట్లు ఖగోళ శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. దీంతో విశ్వంలో ఈ తరహా అత్యంత కాంతివంతమైన నక్షత్రాలు ఇప్పటివరకు తాము ఊహిస్తున్న దానికన్నా కూడా సాధారణంగా ఏర్పడుతూ ఉండవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. ‘జె 1823-3021ఎ’గా పేరుపెట్టిన అత్యంత వేగంగా పరిభ్రమించే ఈ నక్షత్రాన్ని భూమికి దాదాపు 27వేల కాంతి సంవత్సరాల దూరంలో ‘గ్లోబులర్ క్లస్టర్’గా పిలవబడే నక్షత్ర రాశి మధ్యలో కనుగొన్నారు. అత్యంత శక్తివంతమైన గామా కిరణాలను వెదజల్లుతున్న ఈ నక్షత్రాన్ని శాస్తజ్ఞ్రులు నాసాకు చెందిన ఫెర్మి గామా రే స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి అధ్యయనం చేసారు. ఈ పల్సర్ నక్షత్రం వయసు 2 కోట్ల యాభై లక్షల సంవత్సరాలుగా శాస్తజ్ఞ్రులు అంచనా వేస్తున్నారని, ఇలాంటి నక్షత్రాల్లో ఇదో చిన్న శిశువు లాంటిదని, ఎందుకంటే మిల్లీ సెకండ్ పల్సర్‌లు వందకోట్ల సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగినవే ఎక్కువ అని ‘లైవ్ సైన్స్’ మ్యాగజైన్ తెలిపింది. నక్షత్ర విస్ఫోటనాలు (సూపర్ నోవా)లు సంభవించి భారీ నక్షత్రాలు అంతమైనప్పుడు వాటినుంచి సూర్యుడి సైజులో పదార్థాలు శూన్యంలోకి వెదజల్లబడతాయి. అవి శూన్యంలో పరిభ్రమిస్తూ తిరిగి న్యూట్రాన్ నక్షత్రాలుగా ఏర్పడుతుంటాయి. వీటినే ‘పల్సర్స్’ అంటారు. ఈ పల్సర్‌లు అత్యంత వేగంగా పరిభ్రమిస్తూ ఉండడమే కాకుండా లైట్‌హౌస్ వెలుగంత కాంతివంతమైన వెలుగును తమ చుట్టూ వెదజల్లుతుంటాయి. అత్యంత శక్తివంతమైన ఇలాంటి మిల్లీసెకండ్ పల్సర్‌లు ఇంతకుముందు అనుకున్నదానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఏర్పడుతూ ఉండవచ్చని, ఒక్క గ్లోబులర్ క్లస్టర్‌లోనే కాకుండా విశ్వంలోని మిగతా నక్షత్ర రాశుల్లో కూడా ఏర్పడుతూ ఉండవచ్చని పరిశోధకుల బృందం నాయకుడు, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రేడియో అస్ట్రానమీకి చెందిన పావ్లో ప్రీరి చెప్పారు.