7, నవంబర్ 2011, సోమవారం

స్వరం మారుతోంది

టి.కాంగ్రెస్‌లో సరికొత్త సమీకరణలు నిన్నటి వరకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారమన్న నేతలు నేడు సమైక్యానికే అధిష్ఠానం నిర్ణయించినా అభ్యంతరం లేదన్న అభిప్రాయం ఎంపీల వైఖరిలో మాత్రం కానరాని మార్పు

హైదరాబాద్, నవంబర్ 7: ‘తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే’ అంటూ నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్వరం క్రమంగా మారుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణలు మారుతుండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గళాలు కూడా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోను తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని, ప్రత్యేక తెలంగాణ తప్ప మరో పరిష్కారం లేదని చెప్పిన గొంతులే ఇప్పుడు సమైక్యాంధ్రనే కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించినా అభ్యంతరం లేదని అంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వైఖరిలో మార్పు వస్తున్నా పార్లమెంటు సభ్యులు మాత్రం అదే పట్టుదలతో ఉన్నారు.
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయంగా కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో మార్పు తెచ్చాయి. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసినా, సమైక్యాంధ్రనే కొనసాగించినా ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఆ పదవి తనకే దక్కుతుందన్న అభిప్రాయంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజీనామాలు తదితర వ్యవహారాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశాల్లో చర్చకు వచ్చినపుడు ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, రాజీనామా చేస్తే ఎలా’ అని జానారెడ్డి అనే వారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు స్వామిగౌడ్ తదితరులు జానారెడ్డిని కలిసి రాజీనామా చేయాలని కోరినపుడు కూడా ఆయన అదే విధంగా స్పందించారు. అయితే ప్రత్యేక తెలంగాణవాదిగా ముద్రపడ్డ జానారెడ్డికి సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరిస్తుందా అన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపించాయి. ఇంతలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు శాసనమండలి సభ్యత్వాన్ని అధిష్ఠానం ఇచ్చింది. దీంతో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే శ్రీనివాస్‌కే అవకాశం లభించవచ్చన్న ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో జానారెడ్డి కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘చారిత్రక కోణంలో గాని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా గాని అధిష్ఠానం ఆలోచించి సమైక్యాంధ్రనే కొనసాగించాలని నిర్ణయించినా అభ్యంతరం లేదు’ అని శనివారం తిరుపతిలో మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నాయకుల్లో కలకలం సృష్టించాయి. తెలంగాణవాదిగా తనపై పడ్డ ముద్రను చెరుపుకునేందుకే జానారెడ్డి ఆ విధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో మొదట్లో అగ్రభాగంలో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జానారెడ్డితో పడకపోవడంతో క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘానికి దూరమయ్యారు. పలు సందర్భాల్లో జానారెడ్డికి వ్యతిరేకంగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టయినా తెలంగాణను సాధిస్తామని ప్రకటించిన దామోదర్ వైఖరిలో ఇటీవల కొంతమార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అనుసరించిన వైఖరికి భిన్నంగా తెరాసపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా కూడా దామోదర్‌రెడ్డిలో కొంత మార్పుకు కారణమై ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణ ఉద్యమం పేరుతో రెండు నెలల పాటు సచివాలయానికి దూరంగా ఉన్న తెలంగాణ మంత్రుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మెను విరమించుకోవడం, తెలంగాణ మంత్రులు సచివాలయానికి వచ్చినా అడ్డుకోబోమని సచివాలయ తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు ప్రకటించడం తెలిసిందే. వీటికి తోడు అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలతో తెలంగాణ మంత్రులు తమ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నా తెలంగాణ మంత్రులు తమతమ జిల్లాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మెకు మద్దతు కూడా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం గురించి అధిష్ఠానవర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని విమర్శించారు. అటువంటిది ఆ ఎమ్మెల్యేలే సకల జనుల సమ్మెను విరమించుకోవాలంటూ పదేపదే తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేయడం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూండటం విశేషం. మొదట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా వ్యవహరించగా ఆ తర్వాత పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేలు దూరమై ముఖ్యమంత్రికి దగ్గరయ్యారు. రచ్చబండను వ్యతిరేకించాలని పార్లమెంటు సభ్యులు పిలుపు ఇవ్వగా రచ్చబండలో పాల్గొంటామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా మాటే ఎత్తడం లేదు. వీరిలో వచ్చిన మార్పునకు అధిష్ఠానం ఆదేశాలు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.