7, నవంబర్ 2011, సోమవారం

‘సెన్స్’లేని సినిమా!

** సెవెన్త్ సెన్స్
తారాగణం:
సూర్య, శృతీహాసన్
జానీ ట్రై న్యూయెన్ తదితరులు
సినిమాటోగ్రపీ: రవి కె. చంద్రన్
సంగీతం: హారిస్ జయరాజ్
నిర్మాణం: లక్ష్మీగణపతి ఫిలింస్
రెడ్‌జెయింట్, జెమిని ఫిలిం సర్క్యూట్
నిర్మాతలు: సుబ్రహ్మణ్యం బి., రూపేష్ వై.
సమర్పణ: ఉదయనిధి స్టాలిన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
ఎ.ఆర్.మురుగదాస్


‘గజిని’ లాంటి మెగాహిట్ తర్వాత ఆరేళ్లు ‘క్రాఫ్ట్ హాలిడే’ ప్రకటించుకున్న దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ మురిపిస్తూ తీసిన ‘సెవెన్త్ సెన్స్’ అర్జంటుగా ఓ పాఠం నేర్పుతోంది. ఎలాగైతే దర్శకులు ముందుగా కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోకుండా, కళాత్మక సినిమాలకి సాహసించకూడదని అనుభవజ్ఞులంటారో, అలా 15-20 కోట్ల వ్యయాలతో రెగ్యులర్ వాణిజ్య సినిమాలు తీసే దర్శకులు అమాంతం 70-80 కోట్ల మెగా బడ్జెట్లకి వెళ్లే ముందు, ఒకటికి వేయిసార్లు బాగా ఆత్మపరిశీలన చేసుకోవాలని...అంతటి తాజ్‌మహళ్లు కట్టే సత్తా నిజంగా తమకుందా? గమ్మత్తేమిటంటే మళ్లీ ఈ మెగా వెంచర్స్ బోలెడన్ని కళాత్మక విలువల్నే డిమాండ్ చేస్తాయి. క్లాసిక్ హోదాని కోరుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్స్‌లా వాటిని చుట్టి పారెయ్యలేరు. అక్షరాలా 84 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్న మురుగదాస్‌కి నిజంగా ‘సెవెన్త్‌సెన్స్’ తీసేంత స్థాయి ఉందా అంటే, దురదృష్టవశాత్తు లేదనే చెప్పుకోవాలి.
ఈ మధ్యే కేవలం 20 కోట్ల మినీ బడ్జెట్‌తో ‘నాన్న’ ఫేమ్ తమిళ యువ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ‘1947 ఎ లవ్‌స్టోరీ’ (మద్రాస పట్టినం) అనే పీరియడ్ ఫిలిం తీసి అన్ని విలువలతో-ఉత్తమ కథా కథనాలు, పాత్రలు, అభినయ ఆహార్యాలు, సంగీత సాహిత్య నాట్యాల, చిత్రీకరణా సాంకేతిక హంగులూ కలగలిపి మూడు గంటలపాటు ఒక అద్భుత కళాత్మక ప్రపంచంలో విహరింపచేశాడు. ఆర్టు అతడికి తెలుసు. ఆ ఆర్టుద్వారా ప్రేక్షకుల మనో ఫలకాల మీద బలమైన ముద్ర ఎలా వేసి వదలాలో కూడా తెలుసు. ఇందులో సగమైనా సాధించి ఉంటే మురుగదాస్ ధన్యుడయ్యేవాడు
ధన్యుడవ్వాల్సిన అవసరమెందుకంటే, అతను తలపెట్టింది తమిళ జాతి గర్వించే బౌద్ధ భిక్షువు బోధిధర్మ జీవిత చరిత్ర కాబట్టి. ఖచ్చితంగా బోధిధర్మ స్మృతికి నిజమైన నివాళి అర్పించాల్సిన బాధ్యత అతనికుంది. కానీ మరోసారి అతను బోధిధర్మని చంపడానికి ‘ఆపరేషన్ 84 క్రోర్స్’ చేపట్టి అమలుపరిచినట్టుంది. ఇందులో మాత్రం ఘనవిజయం సాధించాడు! తిరిగి ‘గజిని’ కాంబినేషన్ మురుగదాస్-సూర్య-హేరిస్ జయరాజ్‌ల ఈ హనన ప్రక్రియలో మొదటి కథా కాలం ఆరవ శతాబ్దం. పల్లవ యువరాజు బోధిధర్మ తల్లి కోరికపై భార్యాబిడ్డల్ని వదిలి చైనా ప్రయాణిస్తాడు. మార్షల్ ఆర్ట్స్, వైద్యం, హిప్నాటిజంలలో ప్రావీణ్యుడైన అతను చైనీయులకు వాటిని నేర్పి మహోన్నతుడవుతాడు. వాళ్లకి జెన్ (్ధ్యనం) నేర్పుతాడు. ఏదో మహమ్మారి గ్రామాన్ని కబళిస్తుంటే మూలికా వైద్యంతో రక్షిస్తాడు. గ్రామంపై దండెత్తిన బందిపోట్లకి కుంగ్‌ఫూతో దీటైన జవాబిస్తాడు. ఇక సెలవుతీసుకుంటానంటే ప్రాణత్యాగం చేయమంటారు ప్రజలు. అతను ఇక్కడి మట్టిలోనే కలిసిపోతే అతడి శక్తులు తమని రక్షిస్తాయని నమ్ముతారు. వాళ్ల విశ్వాసాన్ని మన్నించి విషం సేవిస్తాడు. సమాధి అయిపోతాడు. ‘దామో’గా ఆరాధ్య దైవమవుతాడు.
రెండవ కధా కాలానికొస్తే నేటి చైనా ఇండియా మీద ‘ఆపరేషన్ రెడ్’ సిద్ధం చేస్తుంది. బోధిధర్మ కాలంలోని మహమ్మారి వైరస్‌నే ఇండియాలో ప్రవేశపెట్టి మారణహోమం సాగించాలనుకుంటుంది. దీనికి విరుగుడు బోధిధర్మ వ్రాసిన గ్రంథంలోనే ఉంది కాబట్టి, దాన్ని అడ్డుపెట్టుకుని, ఇండియాని బ్లాక్‌మెయిల్ చేసి, అడ్డమైన పనులూ చేయించుకోవాలని కుట్ర పన్నుతుంది. అయితే చెన్నైలో బోధి ధర్మ జెనెటిక్ మెమొరీ మీద పరిశోధన చేస్తున్న రీసెర్చి స్టూడెంట్ ఈ ఆపరేషన్‌కి అడ్డు కావచ్చు కాబట్టి ఈమెని చంపడంతోపాటు అక్కడ వైరస్‌ని పరివ్యాప్తం చేయడానికి ఒక ఏజెంట్‌ని పంపుతుంది.
ఏజెంట్ డాంగ్‌లీ (జాన్ ట్రై న్యూయెన్) మార్షల్ ఆర్ట్స్, హిప్నాటిజంలలో కాకలు తీరిన యోధుడు. ఇతను చెన్నై వచ్చే ముందు, రీసెర్చ్ స్టూడెంట్ శుభ ( శృతీహాసన్) ఓ సర్కస్ కళాకారుడైన అరవింద్ (సూర్య)తో స్నేహం చేస్తుంది. అతను ప్రేమిస్తాడు. ఇది కాదనుకుని అసలు విషయం చెప్తుంది. మహోన్నతుడైన మన పూర్వీకుల వారసుల్ని పట్టుకోగలిగితే వాళ్ల జన్యువుల్లో నిద్రాణంగా ఆ మహోన్నతుల అంశని ప్రేరేపించవచ్చనీ, దాంతో తిరిగి ఆ మహోన్నతులు మనకి లభించినట్టు అవుతుందనీ వివరిస్తుంది. అరవింద్ బోధిధర్మ వారసుడని కనిపెట్టింది. ఇది విన్న అరవింద్ తనమీద ఏ ప్రయోగాలకైనా సిద్ధమేనంటాడు.
సరిగ్గా అప్పుడు డాంగ్‌లీ దిగబడి బయోవార్ ప్రారంభిస్తాడు. అంతుచిక్కని మరణాలతో నగరం అట్టుడికిపోతుంది. మరోవైపు శుభని వెతుకుతుంటాడు. అతడిన్ని అడ్డుకోగల శక్తి ఏదీ లేదు. హిప్నాటిజంతో పోలీసుల్ని పోలీసులతో కాల్పిస్తాడు. ట్రాఫిక్‌ని శుభ-అరవింద్‌లపైకి ఎగదోస్తాడు. నానా బీభత్సం సృష్టిస్తుంటాడు. ఇక ఇతడ్ని ఎదుర్కోవడానికి శుభ-అరవింద్‌లు ఏం చేశారన్నది మిగతా సినిమా.
ఈ సినిమా మొదటి ఇరవై నిముషాలూ మురుగదాస్‌ని ఉన్నతాసనం మీద కూర్చోబెడతాయి. చరిత్రని లోతుగా శోధించాడు. దానికి తెరమీద సమున్నతంగా అద్దం పట్టాడు. చైనీయులతో చైనా వాతావరణం, బోధిధర్మ పాత్రలో సూర్య అభినయం సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించాడు. ఇరవై నిముషాలూ ఇలా కట్టిపడేశాక, ఇక ఆ తర్వాత పాతాళంలోకీ, అథఃపాతాళంలోకీ జారిపోయాడు.
‘ఖలేజా’లో మహేష్‌బాబు తెలుగు నేటివిటీని వదిలేసి ఎక్కడో రాజస్థానీయుల సమస్యల గురించి పోరాడతాడు. మురగదాస్ సినిమాలో సూర్య చైనా వెళ్లి చైనీయులకోసం పాటుపడినా నేటివిటీ సమస్య రాదు. అది బోధిధర్మ చరిత్రే కాబట్టి. ఇలా నేటివిటీని జయించగలిగిన దాస్, తీరా నేటివిటీలోకొచ్చాక ‘బద్రినాథ్’ బాటపట్టిపోయాడు.
‘బద్రినాథ్’ మొదటి పదిహేను నిముషాలు దేవాలయాలు వర్సెస్ టెర్రరిజం ఎత్తుగడతో బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ తర్వాత ఆ పాయింటునే మరిచిపోయి ఫార్ములా ప్రేమలోకి తిరగబెడుతుంది. చైనానుంచి చెన్నైకి కథ తీసుకువచ్చిన మురుగదాస్ కూడా ఇదే పోకడతో బోధిధర్మని మర్చిపోయాడు. ‘బద్రీనాధ్’లాగే ఫ్లాపయ్యాడు. అరవింద్ ఎంతకీ బోధిధర్మ అంశ పొందకుండా చివరి వరకూ డాంగ్‌లీ దాడులనుంచి తప్పించుకు పారిపోవడమే తంతుగా మారింది. క్లయిమాక్స్‌లో తప్ప అతడిమీద ప్రయోగం జరపదు. అంతసేపూ అరవింద్ ఓ లక్షణం, లక్ష్యం లేక సగటు జీవిగా పరాజితుడిగా తేలిపోయాడు.
ఇంతటి భారీ సినిమాని అడ్డంగా కుప్పకూల్చిన ప్రధానాంశం, అంతటి బిల్డప్‌తో ఎస్టాబ్లిష్ చేసిన బోధిధర్మ అవతారంగా వెంటనే సూర్యని చలనంలోకి తేకపోవడం. బోధి ధర్మ కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిలిపోవడం. దర్శకుడు బోధి ధర్మ ఎవరో నేటితరం తమిళులకి తెలియనట్టూ, చైనీయులకి బాగా తెలిసినట్టు కొన్ని మగ్‌షాట్స్ వేశాడు. మరి తెలియని జాతికి తనేం తెలియజేశాడు ఈ సినిమా ద్వారా? అసలీ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? చైనా తలుచుకుంటే భారతీయులు పారిపోతారని, చైనీయుడు వచ్చి స్వైరవిహారం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పీకలేదనీ, బయో వార్‌కి బెంబేలెత్తిపోయి దేశాన్ని శవాల కుప్పగా మార్చుకుంటుందనీ (బయోవార్‌ని ఎదుర్కొనట్టు, ఆపినట్టు ఎక్కడా చూపించకుండానే ముగించాడు) ప్రచారం చేయడానికే ఉదయనిధి స్టాలిన్‌ని అడిగి 84 కోట్లు పొందినట్లుంది. బోధిధర్మ శమించుగాక!
శృతీ హాసన్ ఫ్రెష్‌గా ఉంది. ఆడేపాడే బొమ్మలా కాకుండా ఆమెకి పనిగల మంచి పాత్రే దొరికింది. డాంగ్‌లీ పాత్రధారి వియత్నాం నటుడు జానీ ట్రై న్యూయెన్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. సైలెంట్ విలన్‌గా అతను కన్పించిన దృశ్యాలకే ప్రేక్షకులు గంగవెర్రు లెత్తిపోతున్నారు. తర్వాత నీరసించి పోతున్నారు- ఒక్క పాపులర్ బాణీని ఇవ్వలేని హేరిస్ జయరాజ్‌నీ, చివర్లో తప్ప ఒక ఫైట్ కూడా చెయ్యని యాక్షన్ స్టార్ సూర్యనీ చూసి! కళాత్మక విలువలు, మంచి విజువల్స్, క్లాసిక్ టచ్ కొంతైనా కనబర్చని విఫలమైన సాధారణ మేకింగ్ ఈ 84 కోట్ల మెగా వెంచర్. -వీనస్