14, నవంబర్ 2011, సోమవారం

బాబు ఆస్తులపై సిబిఐ విచారణ: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కోర్టు నిర్దేశించింది.1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణ తదితర అంశాలను వివరిస్తూ విజయమ్మ 2424 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు బినామీ సంబంధాలు, ఎంపి సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణంలో కోట్ల రూపాయల అక్రమార్జన వ్యవహారాలను కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చిత్తూరు డెయిరీని నాశనం చేసి, హెరిటేజ్ డెయిరీకి ఏ విధంగా లాభాలు చేకూర్చింది, సింగపూర్ లో హొటల్ వివరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు సాగించిన అక్రమాలను విజయమ్మ తన పిటిషన్ లో వివరించారు.
ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

స్వతంత్ర నివేదికలు కోరిన హైకోర్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,మరో 13 మంది ఆస్తులపై విచారణకు ఆదేశించిన హైకోర్టు వివిధ ప్రభుత్వ శాఖల స్వతంత్ర నివేదికలు కోరింది. పిటిషనర్ ఇచ్చిన అనేక పత్రాలు , డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేయాలని ఆదేశించింది. హొం శాఖ కార్యదర్శి, డిజిపి, సిబిఐ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెబీలు ఎవరికి వారు విచారించి, స్వతంత్ర నివేదికలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు అధికారాన్ని, హొదాని దుర్వినియోగం చేసినట్లుగా పిటిషనర్ ఆరోపించినట్లు కోర్టు తెలిపింది. పిటిషనర్ ఇచ్చిన డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది.
  చంద్రబాబు ఆస్తులకు అంతేలేదు:లక్ష్మీపార్వతి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులకు అంతేలేదని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సాక్షి టివి చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏ అధికారంలో లేని జగన్ పై విచారణ జరుగుతున్నప్పుడు, 9 ఏళ్లు అవినీతి పాలనసాగించిన చంద్రబాబు ఆస్తులపై విచారణ జరుపవలసిన అవసరం ఉందన్నారు. విచారణలో ఆయనకు సహకరించిన రామోజీరావు లాంటివారు బయటకు వస్తారన్నారు. ఎటువంటి దొంగ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ప్రజలు అందరూ తెలుసుకునే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబుది క్రిమినల్ మెంటాలిటీ అని ఆమె అన్నారు. విచారణకు అంగీకరించన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే తెచ్చుకోవడానికి బాబు ప్రయత్నిస్తారని చెప్పారు.సిబిఐ నిజాయితీగా విచారించాలని ఆమె కోరారు. బాబు గురించి ఎల్లో మీడియాకు బాగా తెలుసన్నారు. తను చేసి అవినీతి ఆస్తుల వ్యవహారంలో తల్లిని కూడా ద్రోహిగా నిలబెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు. హైకోర్టు ఆదేశంపై ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు దురుదృష్టకరం అని ఆమె అన్నారు.
సిబిఐ ఎంతతొందరగా స్పందిస్తుందో చూడాలి:గట్టు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సిబిఐ ఎంత త్వరగా స్పందించిందో, చంద్రబాబు విషయంలో కూడా అంతే తొందరగా స్పందిస్తుందోలేదో చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. సాక్షి టివి చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జగత్ కిలాడీ అన్నారు. ఒక్క కేసు విషయంలో కూడా ఆయనపై విచారణ జరగలేదని చెప్పారు. ఆయనకు క్లీన్ చిట్ ఎక్కడ లభించిందో చెప్పాలన్నారు. సిబిఐ విచారణపై స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దని ఆయన చంద్రబాబుని కోరారు.రామోజీ రావు ఆస్తుల విషయంలో ఎంపి ఉండవల్ల అరుణ్ కుమార్ తన వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి అందజేయాలని ఆయన కోరారు.
నోటీసు ఇవ్వకుండా విచారణా?: చంద్రబాబు
విజయనగరం: ముందుగా నోటీసు ఇవ్వకుండా విచారణకు ఎలా ఆదేశిస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేశారు. రైతు పోరుబాటలో భాగంగా ఈరోజు ఆయన కొత్తవలసలో ఉన్నారు. కోర్టు ఆదేశాలు వెలువడిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వడం అనేది సహజన్యాయం అన్నారు. తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ఎప్పుడో స్పష్టంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. బినామీ ఆస్తులు ఉన్నట్లు రుజువు చేస్తే తన ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పారు. కోర్టు ఆదేశాలపై తమ న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ హయాంలో తనపై 18 సార్లు కోర్టుకు వెళ్లారని, 24 సార్లు విచారణకు ఆదేశించారని, ఒక్కసారి కూడా నిర్ధారణ కాలేదని చెప్పారు. సిబిఐ విచారణను స్వాగతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.