21, అక్టోబర్ 2011, శుక్రవారం


గఢాఫీ హతం

తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతి

 * ముగిసిన నియంత పాలన 

* ట్రిపోలీలో హర్షాతిరేకాలు


ట్రిపోలి, అక్టోబర్ 20: నాలుగు దశాబ్దాలకు పైగా దేశాన్ని తిరుగులేని అధికారంతో పాలించిన లిబియా నియంత మహమ్మద్ గడాఫీని తిరుగుబాటుదారులు గురువారం ఆయన సొంత పట్టణం సిర్టేలో కాల్చి చంపేసారు. నెలల తరబడి భీకర పోరాటం తర్వాత తిరుగుబాటుదారులు గడాఫీ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంలో తన సొంత పట్టణంలోని ఓ బంకర్లో దాగి ఉన్న గడాఫీని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా జరిపిన కాల్పుల్లో గడాఫీ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను అక్కడినుంచి వేరే చోటికి తరలిస్తుండగా చనిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. సిర్సేలో జరిగిన పోరులో గడాఫీ కుమారుడు ముతస్సిమ్ కూడా చనిపోయాడని జాతీయ తాత్కాలిక పాలక మండలి ప్రకటించింది. ‘విప్లవం చేతిలో గడాఫీ హతమైనాడని ప్రపంచానికి మేము ప్రకటిస్తున్నాం’ అని జాతీయ తాత్కాలిక పాలక మండలి (ఎన్‌టిసి) ప్రతినిధి అబ్దెల్ హఫీజ్ ఘోగా తెలిపారు. ఇది చరిత్రాత్మకమైన రోజని, నియంతృత్వ పాలన, అణచివేతకు ముగింపు పలికిన రోజని ఆయన అంటూ, తాను చేసిన పాపాలకు గడాఫీ తగిన ఫలితం అనుభవించాడని అన్నారు. గడాఫీ చనిపోయినట్లు మరో ఎన్‌టిసి మిలిటరీ నాయకుడు అబ్దుల్ హకీమ్ బెల్హాజ్ కూడా చెప్పినట్లు అరబ్ శాటిలైట్ చానల్ ‘అల్ జజీరా’ కూడా తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా గడాఫీ మృత దేహాన్ని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లినట్లు ఎన్‌టిసికి చెందిన మరో నాయకుడు చెప్పినట్లు ఆ చానల్ తెలిపింది. వారాల తరబడి భీకర పోరాటం తర్వాత తాము సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించిన కొద్ది సేపటికే గడాఫీ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నలభై రెండేళ్ల పాటు లిబియాను ఎదురులేకుండా పాలించిన గడాఫీని తిరుగుబాటుదారులు పట్టుకుని అతనిపై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గడాఫీ పట్టుబడిన వార్త పొక్కగానే ట్రిపోలీ వీధుల్లో జనం విజయోత్సవాలు జరుపుకొన్నారు.