21, అక్టోబర్ 2011, శుక్రవారం

శీతాకాలం గడవాల్సిందే

శీతాకాల సమావేశాల తర్వాతే తెలంగాణకు పరిష్కారం!
* కాంగ్రెస్ కృతనిశ్చయం
* సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ పట్ల సంతృప్తి
* బిజెపి ‘తొలి సంతకం’పై ధ్వజం
* అస్థిరత సృష్టించడానికే అద్వానీ ప్రకటన
* మీ పాలనలో తెలంగాణ ఎందుకివ్వలేదు?
* నిలదీసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సింఘ్వీ

‘‘1999 నుంచి 2004 వరకు మూడు కొత్త రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో ప్రజలను మోసం చేసిన బిజెపికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’’- సింఘ్వీ : అత్యంత జటిలంగా తయారైన తెలంగాణ సమస్యను పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాతే ఏదో ఒక విధంగా పరిష్కరించాలన్న కృతనిశ్చయానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఎట్టకేలకు వచ్చింది. రెండు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశలో కాంగ్రెస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. వచ్చే నెల రెండు లేదా మూడవ వారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మూడవ వారంలో ముగుస్తాయి. ఇవి ముగిసిన తరువాతే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నందున ఈ సమావేశాల్లో తెలంగాణపై బిల్లు ప్రతిపాదించాలని ఇటు స్వపక్షం అటు విపక్షం చేస్తున్న డిమాండ్ కార్యరూపం ధరించే అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే తెలంగాణ సమస్యను ఇంకా నాన్చకుండా అటో ఇటో తేల్చివేయవలసిన తరుణం ఆసన్నమైందని ఎఐసిసి వర్గాలు అంగీకరించాయి. తెలంగాణలో సాధారణ పరిస్థితులు క్రమేపి నెలకొనటంపై అధినాయకత్వం సంతృప్తిగా ఉంది. నెమ్మది నెమ్మదిగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మెను విరమించుకుని విధులకు హాజరు కావటం, ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతుండటంతో అధినాయకత్వం ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశలో అధినాయకత్వం నుంచి తమకు సంకేతాలు అందినట్లు చెబుతూ నలభై ఎనిమిది గంటలలో సమస్యకు పరిష్కారం లభించటం ఖాయమని తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు కె.కేశవరావు, మంత్రి జానారెడ్డి చేసిన ప్రకటనపై స్పందించటానికి పార్టీ సీనియర్ నాయకులు నిరాకరించారు. అయితే ఇప్పటి వరకు సమస్య పరిష్కారానికి జరుగుతున్న చర్చల ప్రక్రియ కొనసాగక తప్పదని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు ప్రాంతాలకు చెందిన నాయకులు విడివిడిగా కాకుండా ఒకే వేదికపై కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణకు చెందిన కేశవరావు, కోస్తాంధ్రకు చెందిన లగడపాటి ఎవరికి వారు తోచినట్లు కాక పక్కపక్కనే కూర్చుని జరిపే సంప్రదింపులు సమస్య పరిష్కారానికి మార్గం చూపించే వీలుంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. రెండు ప్రాంతాల నాయకులను ఉమ్మడి చర్చలకు పిలిచే అవకాశాలున్నాయా? తెలంగాణ సమస్యపై చర్చించి పరిష్కరించటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుందా? అన్న ప్రశ్నలకు పార్టీ నాయకులు పెదవి విప్పటం లేదు. ‘తెలంగాణ సమస్య అత్యంత సున్నితమైనది. ఈ సమస్యను పరిష్కరించటానికి రాజకీయ విజ్ఞత, అనుభవం, దూరదృష్టి అత్యవసరం’ అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో మరింత గందరగోళం సృష్టించి రాజకీయ అస్థిరతను సృష్టించటానికే అద్వానీ ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్న అద్వానీ ఈ విషయమై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన స్పష్టం చేశారు. 1999 నుంచి 2004 వరకు మూడు కొత్త రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో ప్రజలను మోసం చేసిన బిజెపికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సింఘ్వీ కరాఖండిగా చెప్పారు. ఇది ఇలా ఉండగా తమ పార్టీ అగ్ర నాయకుడు అద్వానీ ప్రారంభించిన జన చేతన యాత్రకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్‌ప్రతాప్ రూడీ చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చి తీరుతామని ఆయన ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తెలంగాణపై బిల్లు ప్రవేశపెడితే సమర్థించటానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని రూడీ చెప్పారు. సెటిలర్లపై పోచారం చిందులు October 21st, 2011 నిజామాబాద్/హైదరాబాద్, అక్టోబర్ 20: బాన్సువాడ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆశించిన స్థాయిలో ఆధిక్యత దక్కకపోవడం టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. భారీ మెజార్టీపై కనే్నసి తీవ్రంగా శ్రమించినప్పటికీ, 50 వేల ఓట్ల ఆధిక్యతను సైతం ఆయన రాబట్టుకోలేకపోయారు. దీంతో పోచారం తనకు మెజార్టీ తగ్గడానికి వివిధ వర్గాల వారే కారణమంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్, టిడిపి మిలాఖత్ అయ్యాయని, ఒక సామాజికవర్గం వారు తనకు ఓట్లు వేయలేదని చెప్పుకొచ్చిన పోచారం, తాజాగా సెటిలర్లను బాధ్యులుగా చిత్రీకరిస్తూ నిందారోపణలకు దిగారు. తెలంగాణ గడ్డపై ఉంటూనే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఫలితంగానే తనకు మెజార్టీ తగ్గిందని ఆక్షేపించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో తెలంగాణవాదిగా టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన పోచారం 49,889 ఓట్ల ఆధిక్యత మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. దీంతో తనకు ఓటు వేయని వారంతా తెలంగాణ ద్రోహులేనని అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఆయన సెటిలర్లను కూడా తన మెజార్టీ తగ్గేందుకు బాధ్యులుగా చిత్రీకరించడం ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉందని, ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసేందుకు సైతం అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. నిజానికి బాన్సువాడ సెగ్మెంట్‌లో సెటిలర్ల ఓట్లు 9 వేల వరకే ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సెటిలర్లు వాస్తవంగానే పోచారానికి వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తే, వారి ఓట్లన్నీ పోచారం ఖాతాలో కూడుకున్నా లక్ష మెజార్టీకి సుదూరంలోనే ఉండిపోతున్నారు. అలాంటప్పుడు తమను నిందిస్తూ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని సెటిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోచారం పట్ల ఓటర్లలో వ్యతిరేకత నెలకొని ఉండడం వల్లే ఆధిక్యత తగ్గిందని, దీనిని కప్పిపుచ్చుకునేందుకే ఆయన ఇతరులపై నెపం నెడుతూ నిందాపూర్వక ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెటిలర్లు.. తెలంగాణ ద్రోహులు! తెలంగాణలో స్థిరపడిన సెటిలర్లు తెలంగాణ ద్రోహుల్లా వ్యవహరిస్తున్నారని బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగినవారంతా తమ వాళ్ళేనని భావిస్తుంటే, సెటిలర్లేమో ఈ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతం పట్ల వారు తమ వైఖరిని మార్చుకోకపోతే వారికే నష్టమని హెచ్చరించారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో గెలుపొందాక పోచారం మొదటిసారి గురువారం తెలంగాణ భవన్‌కు రాగా, ఆయనకు టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, జూబ్లీహిల్స్ పార్టీ ఇంచార్జి సతీష్‌రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, బాన్సువాడ, కూకట్‌పల్లి ఎన్నికల్లో సెటిలర్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఓట్లేసి తమ నైజాన్ని చాటుకున్నారని విమర్శించారు. నేడు ప్రమాణ స్వీకారం బాన్సువాడులో గెలుపొందిన పోచారం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పేర్కొన్నారు. గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు ఆర్పించాక ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతల పాట్లు October 21st, 2011 న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య ఖాళీ చేసిన విధాన మండలి సీటును తమకు కేటాయించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలో పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మాజీ మంత్రులు కంతేటి సత్యనారాయణ రాజు, త్రిపురాన వెంకటరత్నం తదితర నాయకులు ఢిల్లీలో మకాంవేసి పార్టీ నాయకులను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారు. రోశయ్య ఖాళీ చేసిన సీటును వైశ్య వర్గానికి చెందిన నాయకుడికే కేటాయించాలని ఆయన వర్గం వాదిస్తుంటే సత్యనారాయణ రాజు తదితరులు మాత్రం ఈ సీటును కోస్తాంధ్రకు చెందిన నాయకుడికి ఇవ్వాలని వాదిస్తున్నారు. విధాన మండలి పునరుద్ధరణ కోసం తాను ఎంతో కృషి చేసినందున ఈ సీటుకు తనను ఎంపిక చేయాలని సత్యనారాయణ రాజు అడుగుతున్నారు. విధాన మండలి పునరుద్ధరణ కోసం తాను కాలికి బలపం కట్టుకుని తిరిగాననీ, తనతోపాటు పలువురు సీనియర్ నాయకుల కృషి మూలంగానే విధాన మండలి తిరిగి జీవం పోసుకున్నదని ఆయన అంటున్నారు. విధాన మండలి పునరుద్ధరణ కోసం ఎంతో కృషి చేసిన తనను కనీసం ఇప్పుడైనా విధాన మండలికి ఎంపిక చేయాలని సత్యనారాయణ రాజు కాంగ్రెస్ అధినాయకత్వానికి విజప్తి చేశారు. క్షమాభిక్షకు గడువు కుదరదు ‘సుప్రీం’కు కేంద్రం స్పష్టీకరణ October 21st, 2011 న్యూఢిల్లీ, అక్టోబర్ 20: క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా రాజ్యాంగ ప్రక్రియ అని, దీనికి సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గురువారం తెలియజేసింది. 1993 సెప్టెంబర్ 10న ఢిల్లీలో అప్పటి యువజన కాంగ్రెస్ అధ్యక్షడు మనిందర్ సింగ్ బిట్టాపై జరిగిన బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్నందుకు మరణశిక్షను ఎదుర్కొంటున్న భుల్లర్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరగడాన్ని సమర్థించుకుంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు తెలిపింది. అంతేకాదు, క్షమాభిక్ష మిటిషన్‌పై నిర్ణయంలో ఆలస్యాన్ని దోషికి శిక్షను తగ్గించడానికి కారణంగా పరిగణించరాదని కూడా కేంద్రం వాదించింది. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నంతమాత్రాన దోషి పట్ల క్రూరంగా వ్యవహరించినట్లు కానీ, అతని మనోవేదనను మరింత ఎక్కువ చేసినట్లు కానీ భావించడానికి వీల్లేదు. వాస్తవానికి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడం అంటే ఖైదీకి మరికొంతకాలం జీవించడానికి అవకాశం లభించడమే’నని ప్రభుత్వం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.