24, అక్టోబర్ 2011, సోమవారం

దిగ్గజాల మధ్య ధీరుడు ! : 'మావీరన్‌'గా తమిళంలో మగధీర అనువాదం

మిళ సినీరంగంలోనికి రామ్‌చరణ్‌తేజ్‌ను ఆహ్వానిస్తున్నామని పద్మశ్రీ కమల్‌హాసన్‌ అన్నారు. గీతాఆర్ట్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌, కాజల్‌, శ్రీహరి ప్రధాన తారగణంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర' తమిళంలో 'మావీరన్‌' పేరుతో అనువాదమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నయ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయిన కమల్‌హాసన్‌ తొలి సిడిని విడుదల చేసి, దర్శకుడు మణిరత్నంకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తొలిరోజుల్లో బాలచందర్‌ దర్శకత్వంలో చిరంజీవీ, తాను చేశామని, చెన్నయ్ లో ఒకే వీధిలో వున్నామని గుర్తుచేసుకున్నారు. తాను మగధీర గురించి విన్నానని, ఏదో అదృష్టం, పాపులారిటీ వల్ల చరణ్‌కు వచ్చిన విజయం కాదని అన్నారు. అతని నటన, సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకులను ఆకట్టు కున్నాయని, విదేశాలలో భారతీయ సినిమా అంటే ముంబాయే అనే పేరువుందని, కానీ ముంబరుతో పాటు దేశంలోని పలు భాషలలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలను నిర్మించిన వారు వున్నారని పేర్కొన్నారు.
తమిళ, తెలుగు సినీరంగాలకు ప్రత్యేక అనుబంధం వుందన్నారు. ఈ రెండు భాషల వారు కలిస్తే నూతనత్వాన్ని తీసుకురాగలమని అన్నారు. తనకు ప్రాంతీయభేధం లేదని, కన్యాకుమారీ నుండి కాశ్మీర్‌ వరకు అంతా నా ప్రాంతమేననని అన్నారు. తెలుగు, తమిళ రంగాల స్నేహం ఇలాంటి వేదికలు ముందుకు తీసుకెళుతాయని అన్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సమయంలో విడుదల చేస్తే బాగుండేదని అన్నారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ...తరుచూ ఈ సినిమా గురించి చర్చించామని, ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న రెడ్‌జెయింట్‌ మూవీస్‌ అధినేత ఉదయానిధి స్టాలిన్‌ మాట్లాడుతూ...చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుండి తనకు ప్రత్యేక అభిమానం వుందన్నారు. ఆయన డాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తొలిపాటలో చరణ్‌తో పాటు చిరంజీవి డాన్స్‌ చేయడం గురించి విన్నానని, ప్రివ్యూ సమయంలో చిరంజీవి డాన్స్‌ చేసే సన్నివేశం లేదన్నారు.
తమిళ వర్షన్‌లో ఈ సన్నివేశాన్ని తొలగించామని నిర్వాహకులు పేర్కొన్నారన్నారు. కానీ, తప్పకుండా ఆ సన్నివేశం వుండాలని కోరామన్నారు. ఆయన డాన్స్‌ అంటే ఇక్కడి ప్రజలకు కూడా ఎంతో ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజమౌళి, దర్శకుడు కెఎస్‌. రవికుమార్‌, నిర్మాత ఆర్‌బి. చౌదరి, సుహాసిని మణిరత్నం, అల్లు అరవింద్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.