24, అక్టోబర్ 2011, సోమవారం

జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ శాడిజం: గట్టు

హైదరాబాద్: జర్నలిజం ముసుగులో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ శాడిజం, రౌడీయిజం చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఈ మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తరపున తాము మాట్లాడితే కుక్కలు, నక్కలు అయితే, ఏబిఎన్ ఛానెల్ లో అతని తరపున మాట్లాడిన వారు కూడా జంతువులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ భాష దారుణంగా ఉందన్నారు. అది జర్నలిజాన్ని అవమానపరచడమేనన్నారు. కుక్కలు, నక్కలు ... అనే భాష సరైంది కాదన్నారు. భాష మార్చుకోమని సలహా ఇచ్చారు. తాము అటువంటి భాష వాడం అని చెప్పారు. వాస్తవానికి ఆ రకమైన భాష మాట్లాడినవారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదన్నారు. అది దమ్ము ఉన్న ఛానెల్ కాదు, దగ్గు సర్వరోగాలు ఉన్న ఛానెల్ అన్నారు.
తమ నేత జగన్ పై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేయడం జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ తమ సవాల్ కు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము సవాల్ చేసింది ఏమిటీ? మీరు మాట్లాడేది ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఆర్ త్రయం (రాధాకృష్ణ, రవిప్రకాష్, రామోజీ రావు) వచ్చి వారు ప్రసారం చేసినవి రుజువు చేసి, ఆ భవనాన్ని తీసుకోమని చెప్పామని, ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు. మీడియా వారిని తీసుకొని ముగ్గురూ లేక ఒక్కరే వచ్చినా సరే అన్నారు. జగన్మోహన రెడ్డి నివాసంలో 70 ఏసి గదులు, ఎస్కలేటర్లు, 150 సిసి కెమెరాలు, అనేక లిఫ్టులు, అధునాతన స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, విదేశీ బార్ ఉన్నాయని ప్రసారం చేశారు. మరో 24 గంటల సమయం ఇస్తున్నామని, వచ్చి వాటిని రుజువు చేయమని ఆయన సవాల్ విసిరారు.
రెడీ, రెడీ.... అంటే ఏంటని ప్రశ్నించారు. ఇలాగే రెడీ రెడీ అని కడప ఎన్నికలలో కొందరు తొడకొడితే తొడ వాసిపోయిందన్నారు. ఆ తొడ వాపు, నొప్పి తగ్గడానికి అమృతాంజనం ఆరు నెలలు రాసినా తగ్గలేదన్నారు.
సత్యవీడు వద్ద సెజ్ లో టివి9కి చెందినవారికి స్థలం కేటాయించినందుకు ఎంత ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మీడియాని అడ్డం పెట్టుకొని వారు అడ్డంగా సంపాదించారన్నారు. అందరూ తప్పుడు కథనాలు ప్రసారం చేసినందునే తాము ఈ ప్రశ్నలు అడుగుతున్నామన్నారు.
ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ జగన్ పై ఆరోపణలు రుజువు చేయకపోతే ఛానెల్ మూసుకుంటారా? అని రాధాకృష్ణని ప్రశ్నించారు. పాత తప్పుడు కథనాలనే ప్రసారం చేస్తూ, తమ నేతని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ని దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదన్నారు.
తమని పెంపుడు జంతువు అన్న రాధాకృష్ణ ఎవరికి పెంపుడు జంతువు అని ఆయన ప్రశ్నించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్, పత్రిక మూసివేసే పరిస్థితి వచ్చిందని అందువల్లే జీరో నుంచి మొదలు పెడదామని ఆయన అంటున్నారన్నారు. అదీగాక ఆయనకు బ్లాక్ మెయిల్ చేసే అలవాటు ఉన్నందున కూడా అలా అంటున్నార్నారు. కొన్ని పత్రికలు, కొన్ని ఛానెల్స్ జగన్మోహన రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి తమ నేతపై ఈ రకమైన ప్రసారాలు చేస్తున్న మీరు ఎవరికి పెంపుడు జంతువులని ఆయన ప్రశ్నించారు.


నామినేషన్ దాఖలు చేసిన డీఎస్
హైదరాబాద్ : శాసనమండలి సభ్యత్వానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, పలువురు మంత్రులు హాజరయ్యారు. అంతకు ముందు డీఎస్ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఆయన ఈ సందర్భంగా సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు.
'డీఎస్ ఎంపికకు తెలంగాణకు సంబంధం లేదు'
హైదరాబాద్ : ఎమ్మెల్సీగా డీ శ్రీనివాస్ ఎంపికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీఎస్ ఎంపిక ఢిల్లీలో జరగలేదని, ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారన్నారు. శాసనమండలి స్థానం పొందని ఆశావాహులకు భవిష్యత్ లో మంచి పదవులు ఉంటాయని బొత్స అన్నారు.


రేపటి నుంచి సమ్మె విరమించే అవకాశం
హైదారబాద్: సకల జనుల సమ్మె రేపటి నుంచి విరమించే అవకాశం ఉంది. సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘంతో తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సమావేశం ముగిసింది. వారి చర్చలు ఫలించాయి. సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా ఈ నేతలు సమావేశమవుతారు. ఆ సమావేశంలో నేతలు సమ్మె విరమణకు అంగీకరించే అవకాశం ఉంది. సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా పరిగణించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. నోవర్క్-నోపే జిఓ అమలులో ఉన్నందున జీతం అడ్వాన్స్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జిఓ 177ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల తరపున ఢిల్లీకి ఒక కమిటీని ప్రభుత్వం తరపున తీసుకువెళ్లడానికి అంగీకారం కుదిరే అవకాశం ఉంది. వారు ఢిల్లీలో తెలంగాణ వాదం వినిపిస్తారు. ఉద్యోగుల డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉంది.
సమ్మె విరమణపై జెఎసిలో అంతర్యుద్ధం
హైదరాబాద్: సకల జనుల సమ్మె విరమణపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసిలో అంతర్యుద్ధం మొదలైంది. సమ్మె విరమించాలని కొందరు, సమ్మె కొనసాగించాలని కొందరు పట్టపడుతున్నారు. సచివాలయం సి-బ్లాక్ ముందు రెండు వర్గాలు ధర్నాకు దిగాయి.


మైసూరులో తెలుగుపీఠం ఏర్పాటు విరమణ
హైదరాబాద్: మైసూరులో తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం (తెలుగు పీఠం) ఏర్పాటుని కేంద్ర మానవవనరుల శాఖ విరమించుకుంది. ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు ఒక లేఖ రాశారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ అధ్యయన కేంద్రంని ఏర్పాటు చేయమని ఆయన కోరారు. గతంలో కూడా పలువురు భాషాశాస్త్రవేత్తలు ఈ కేంద్రంని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయమని కోరిన విషయం తెలిసిందే.