కానీ అప్పుడు తెలీదు...ఈ వెనుకంజ మరో గొప్ప ముందంజ కోసమేనని... ఆ గాయాలు ఇప్పటి బాక్సాఫీసు విజయాల కోసమేనని...మళ్లీ తాజాగా ‘దూకుడు’గా మొదలైన తెలుగు సినిమా కలెక్షన్ల పరంపర ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్‌ని సరికొత్తగా నిర్వచించాల్సిన అవసరాన్ని సృష్టిస్తోంది.
‘రేంజ్’కి కొలమానమేంటి?
సినిమా-అది తెలుగుదైనా, తమిళమైనా, హిందీ అయినా అనేది ప్రధానంగా ఆర్థిక వ్యాపారం! జనాల్ని ఎంటర్‌టైన్ చేసి తద్వారా వచ్చిన ఆదాయంతో మనగలిగే పరిశ్రమ సినిమా రంగం! అందుకే సినీ పరిశ్రమలో ‘రేంజ్’కి కొలమానం బాక్సాఫీసు కలెక్షనే్ల! కాగా మనదేశంలో ప్రధానంగా బాలీవుడ్, కోలీవుడ్ (తమిళ సినీ పశ్రమ), మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ), సాండల్ వుడ్ (కన్నడ సినీరంగం), టాలీవుడ్ (తెలుగు సినీ రంగం) వంటివి సినిమాలను అధికంగా నిర్మిస్తున్న ప్రధాన సినీ పరిశ్రమలు. వీటన్నింటిలోను బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమ స్థాయిని అందుకున్న సినీరంగం మన తెలుగు సినీ రంగం! ఇలా ఈ స్థాయిని అందుకోవడంలో రెండు కారకాలు ముఖ్యమైనవి.
1. భారీ బడ్జెట్లు, 2. భారీ కలెక్షన్లు.
ఆ మాటకొస్తే ఏ సినీ పరిశ్రమనైనా దాని రేంజ్‌ని డిసైడ్ చేసేవి ఈ మూడు అంశాలే. ఈ మూడు కారకాల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ గత 80 ఏళ్ల కాలంలో ఎనె్నన్నో మైలురాళ్లని అధిగమించి ముందుకొచ్చింది. కొత్తకొత్త వ్యాపార మార్గాలను అనే్వషించింది. ఆదాయ మార్గాలను పెంచుకుంది. దేశవ్యాప్తంగా వ్యూయర్‌షిప్ ఉన్న బాలీవుడ్ సినిమాల కలెక్షన్లను ఇంచుమించు అందుకుంది. కొత్త మార్కెట్లకు విదేశీ ఆడియన్స్‌కు కూడా చేరువవుతూ తన వినోద సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది.
భారీ బడ్జెట్‌లు
ఒకప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ వేల రూపాయలు మాత్రమే. 1931లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘్భక్తప్రహ్లాద’ అప్పటి ధరల్లో కేవలం 15 వేల రూపాయలతోనే నిర్మాణమైంది. కానీ ఇప్పుడు చిన్న సినిమా తీయాలన్నా, లో బడ్జెట్ సినిమా తీయాలన్నా కనీసం 4 కోట్ల రూపాయలు అవసరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్ వంటి హీరోల సినిమాలు తీయాలంటే ఇప్పుడు అధమపక్షం 25 కోట్లు కావాల్సిందే. ఇక యంగ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, ప్రభాస్ వంటి హీరోల సినిమాలంటే ఇప్పుడు కావాల్సిన బడ్జెట్ 30 కోట్ల పైమాటే!
గత మూడేళ్ల కాలం నుండి తెలుగు సినిమాల బడ్జెట్‌లో భారీ పెంపుదల కానరావడం మొదలైంది. 2007లో ఈ హీరోల సినిమాల నిర్మాణ వ్యయం సగటున 15నుండి 20 కోట్ల వరకు పెరిగింది. అప్పుడే సినీ పెద్దలు, విశే్లషకులు అందరూ సినీపరిశ్రమ మనుగడ సాగించాలంటే నిర్మాత పచ్చగా ఉండాలంటే ‘బడ్జెట్‌లో నియంత్రణ’ అవసరమనే సూచనలు చేశారు. కానీ అనూహ్యంగా అప్పటి నుంచీ బడ్జెట్‌లు పెరిగాయే కానీ తగ్గలేదు. ఇక 2009 తర్వాత నుండి రవితేజ సినిమాలతో సహా 20 కోట్లు బడ్జెట్ అనేది సాధారణం అయిపోయింది. ఇక 2010లో సినిమా నిర్మాణ వ్యయంలో ఆ మొత్తం 30 నుండి 35 కోట్లకు పెరిగింది. మహేష్ ఖలేజా, ఆరెంజ్, కొమురంపులి, బద్రినాధ్, శక్తి, వరుడు వంటి సినిమాలన్నీ ఈ 35 కోట్ల మైలురాయికి అటు ఇటుగా వచ్చాయి. సినీపెద్దలు, విశే్లషకుల హెచ్చరికలను నిజం చేస్తున్నట్టుగా ఈ సినిమాల వ్యాపారం అంత భారీ స్థాయిలో జరగక పరిశ్రమ అంతా ఒక్కసారిగా నిస్తేజమయ్యే పరిస్థితి వచ్చింది. ఆఖరికి నిర్మాణ వ్యయాల్లో ఈ పెరుగుదలకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఒకరినొకరు నిందించుకోవాల్సిన అగత్యం దాపురించింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో అడుగులు వెనక్కి వెళ్లింది. అయితే ఈ వెనుకంజ ఓ గొప్ప ‘దూకుడు’ కోసమే అని ఎవరికీ తెలీదు.
భారీ కలెక్షన్లు
తెలుగు సినిమా స్టామినా, బాక్సాఫీసు కలెక్షన్ల రేంజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ సినిమా 4 కోట్ల కలెక్షన్లు చేసేంతవరకు తెలుగు సినిమా రేంజ్ అంత ఉంటుందనీ తలపండిన ప్రముఖులకు సైతం తెలీదు. అలాగే చిరంజీవి ‘ఘరానామొగుడు’ పదికోట్ల కలెక్షన్లు దాటినప్పుడు, ఆ తర్వాత ‘ఇంద్ర’ 20 కోట్ల కలెక్షన్లు చేసినపుడు అందరికీ అదే ఆశ్చర్యం! ఇక, మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమా 32 కోట్లు వసూలు రాబట్టడం పరిశ్రమలో భారీ రికార్డుగా రుజువైంది. కానీ ‘అరుంధతి’ సినిమా 35 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమాకి పెరిగిన రేంజ్‌ని నిరూపించింది. ఆ వెంటనే వచ్చిన రామ్‌చరణ్ ‘మగధీర’ సినిమా 68 కోట్లకుపైగా వసూలు చేసి తెలుగు సినీ పరిశ్రమ రేంజ్‌ని పునర్నిర్వచించింది. అలా ‘మగధీర’ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు ఓ బెంచ్‌మార్క్‌ను నిర్దేశించింది. దాంతో భారీ ఇనె్వస్టమెంట్‌లతో భారీ రిటర్న్‌లు వస్తాయనే ఆలోచన నిర్మాత, దర్శకులు, హీరోలలో మొదలైంది. అంతేకాక, ఇప్పటి యంగ్ హీరోలలో ఉన్న ఆరోగ్యకరమైన పోటీతో ‘మగధీర’ రికార్డును బ్రేక్ చేయాలనే సంకల్పంతో అందరు హీరోలు తమదైన తరహాలో భారీ సినిమాలు చేశారు. కానీ అవన్నీ నిరాశనే మిగిల్చాయి. హైజంప్‌లో రికార్డు సృష్టించాల్సిన ఆటగాడు అప్పుడు ఐదడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు గొప్ప ‘దూకుడు’!
మహేష్‌బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో యాక్షన్ కామెడీగా వచ్చిన ‘దూకుడు’ సినిమా కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల పరంగా ఎంతో ఎత్తుకు చేరుకుంది. మొదటివారంలో 50 కోట్ల పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా రెండో వారం నాటికి 70 కోట్లను దాటి 85కోట్ల దిశగా ఎగిసింది. ఇప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీసు కలెక్షన్ల స్టామినా దాదాపు 85 కోట్లకు చేరుకున్నదన్న మాట!
ఈ మొత్తం బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమాల కలెక్షన్లకు దాదాపు సమానం అని చెప్పాలి. జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ని, మార్కెట్‌నీ కలిగి వున్న బాలీవుడ్ సినిమా 85 కోట్లను వసూలు చేయడంలో పెద్ద విశేషమేం లేదు. కానీ, 9 కోట్ల ప్రజలతో ఓ ప్రాంతానికే పరిమితమైన తెలుగు సినిమా ఆ స్థాయి కలెక్షన్లను సాధించడం మాత్రం ఖచ్చితంగా విశేషమే! బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ లైన అమీర్‌ఖాన్ ‘గజినీ’ సల్మాన్‌ఖాన్ ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘బాడీగార్డ్’ సినిమాలు, ఫారుఖ్‌ఖాన్ ‘రబ్‌నె బనాదీ జోడీ’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటివన్నీ 85 కోట్ల కలెక్షన్లు సాధించినవే! ఆ లెక్కన ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ విస్తరించిదనడంలో సందేహం అక్కర్లేదు.
నిజమైన బలుపేనా?
ఐతే తెలుగుసినిమా రేంజ్‌ని కొత్తగా నిర్వచిస్తున్న ఈ 85 కోట్ల బెంచ్‌మార్క్ చెప్పుకోడానికి బాగానే ఉంది కానీ వ్యాపార-వాణిజ్య సూత్రాల ప్రకారం ఇది నిజమైన సాధనేనా అనేది ప్రశ్నగా ఉంది. తెలుగు సినిమా ఓ బిజినెస్ అనుకున్నప్పుడు, ఆ బిజినెస్ సూత్రం ప్రకారం పెట్టుబడికి వచ్చే ఆదాయానికి మధ్య వచ్చే తారతమ్యమే కొలమానం కావాలి. ఆ ప్రకారంగా చూస్తే ‘దూకుడు’ వంటి సినిమాల నిర్మాణ వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే మూడు రెట్ల లాభం మాత్రమే వచ్చినట్టు లెక్క (అంటే పెట్టుబడి దాదాపు 30 కోట్లు కాగా ఆదాయం 85 కోట్లు). సినీ ట్రేడ్ పండితులు ఈ విషయాన్ని వివరించడానికి ‘అలా మొదలైంది’ సినిమాని ఉదాహరణగా చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం 3 కోట్లు కాగా, రాబడి పదికోట్లకు పైగా వచ్చింది. అంటే దాదాపు4 రెట్లు అన్నమాట! అందుకే ట్రేడ్ నిపుణుల పరంగా ప్రస్తుత తెలుగు సినిమా వ్యాపారం ఎలా ఉన్నా, ‘దూకుడు’తో మాత్రం దాని ‘రేంజ్’ చాలా పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. - మామిడి హరికృష్ణ