23, అక్టోబర్ 2011, ఆదివారం

ఒక్క సీటు కోసం..


-సిఎం, పిసిసి చీఫ్ తెరవెనుక రాజకీయం

 -తనవాడి కోసం ప్రయత్నాలు చేస్తున్న గవర్నర్

 -రంజుగా మారిన కౌన్సిల్ సీటు వ్యవహారం


 న్యూఢిల్లీ, అక్టోబర్ 23: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఖాళీ చేసిన శాసన మండలి సీటు కోసం పలువురు నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరి పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తన వర్గానికి చెందిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు తెరవెనక పావులు కదుపుతుంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వ్యక్తి కోసం కృషి చేస్తున్నారు. చివరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఒకరికి శాసన మండలి టికెట్ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు విద్యాధర్‌రావుకు టికెట్ ఇప్పించేందుకు బొత్సా సత్యనారాయణ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిసింది.

చిరంజీవి ప్రతిపాదిస్తున్న విద్యాధరరావును శాసన మండలికి తీసుకురావటం ద్వారా పార్టీని బలోపేతం చేయటంతోపాటు తన వర్గం మరింత పటిష్ఠం అవుతుందని బొత్స ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ఇందుకు సమ్మతించటం లేదని చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక నాయకుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఆయన తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నారని అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు తమ వర్గానికి చెందిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు జరుపుతున్న ప్రయత్నాలను గవర్నర్ నరసింహన్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు గంగాధరానికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. గంగాధరానికి టికెట్ ఇప్పించేందుకు ఆయన ఢిల్లీలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు టెలిఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు కూడా విధాన మండలి టికెట్ కోసం ఎక్కిన గడప మళ్లీ ఎక్కకుండా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. మరో నాయకుడు ప్రసాదరాజు కూడా సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీతోపాటు శాసన సభ మాజీ స్పకర్ ఒకరు కూడా శాసన మండలి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం కూడా దేశ రాజధానిలో మకాం వేసి సీటు కోసం ప్రయత్నించటం గమనార్హం. కొణిజేటి రోశయ్య కూడా తాను ఖాళీ చేసిన సీటును తన వర్గానికి చెందిన వారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తున్నా అది రూఢీ కావటం లేదు.
ఇదిలా ఉంటే ఇటీవలనే కాంగ్రెస్‌లో చేరిన ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు విద్యాధరరావుకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణను కలిసి స్పష్టం చేశారని అంటున్నారు. చిరంజీవికి ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు కానీ విద్యాధర రావుకు ఇప్పుడే శాసన మండలి సీటు కేటాయించటం ఎంత మాత్రం మంచిది కాదని వారు చెబుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు ఇటీవలనే బొత్సా సత్యనారాయణను కలిసి విద్యాధర రావుకు విధాన మండలి టికెట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారని అంటున్నారు