22, అక్టోబర్ 2011, శనివారం

ఇది కొత్త ట్రెండ్‌కి శ్రీకారమా?

ప్పుడొక కొత్త ట్రెండ్(?)కి తెర తీశారు...ఈ దసరాకి విడుదలైన రెండు భారీ ప్రతిష్టాత్మకాలు యాదృచ్ఛికంగా ఒకే పంథాననుసరించి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓ సినిమాని సాంతం ఇంకో సినిమాననుసరించి అంటే పరాయి సినిమా కథని చోరీ చోరీ చుప్కే చుప్కేగా చటుక్కున స్వీక(తస్క)రించి తీర్చిదిద్దడం అమల్లో ఉన్న ఆనవాయితీ. ఇప్పుడా పరాయి సొత్తుని సినిమా కథలో ఓ భాగంగానో లేదా ఫ్లాష్‌బ్యాక్‌గానో ప్రధాన కథకి అనుగుణంగా కుదించుకుని, గొప్పగా ఫీలవ్వడం ఆ ఆనవాయితీకో కొత్త మలుపు. దీన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకుని గర్విస్తున్నారు. ఇలాంటి ఇన్‌స్పిరేషన్‌ల వ్యవహారానే్న కొందరు అత్యుత్సాహవంతులు ఇంటర్నెట్‌లో టప టపా కొట్టేసి అవతల ఆయా ఒరిజినల్ సృష్టికర్తలకు క్షణాలమీద అందించేస్తున్నారు. ఇదెక్కడికి దారి తీస్తుందో తెలీదు. బాలీవుడ్‌లో ఈ తస్కరణ పైత్యమే ముదిరి, హాలీవుడ్ స్టూడియోలనుంచి తాఖీలందుకున్నాక తాళాలు పడ్డాయి. ఎక్కడో మారుమూల తెలుగు సినిమాల వ్యవహారం ఎవరికి తెలుస్తుందిలే అనుకోవడానికి వీల్లేదు. తెలుగు సినిమాల్ని ఇప్పుడు ‘ప్రపంచవ్యాప్తంగా’ విడుదల చేసే స్థాయికి తీసుకెళ్లాక ఏమైనా జరగొచ్చు. అమెరికాలో ‘దూకుడు’ విజయ దుందుభికి అక్కడి ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికే ఆశ్చర్యపోయి వార్త రాసింది. ముంబాయి క్రిటిక్స్ కూడా ‘దూకుడు’ ఘనవిజయ కారణాలేమిటో స్వయంగా సినిమా చూసి విశే్లషించాలని తహతహలాడుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా ఓ షో వేయాలని కోరుతున్నారు. ‘దూకుడు’ సంచలన సక్సెస్‌కి కారణం దాని కంటెంటా, లేక మేకింగ్ స్కిల్సా తేల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే రేపు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి గుట్లు రట్టు చేస్తారో తెలీదు.
దూకుడునో, ఊసరవెల్లినో ఎవరికో పట్టించాలని ఈ వ్యాసం ఉద్దేశం కాదు. పైరసీ ఎంత సహజమో, కథా చౌర్యమూ అంతే సహజంగా మారిపోయింది. రెండూ ఒకే ఆత్మకి రెండు శరీరాలు. కానీ కథని చోరీ చేసిన శరీరం, పైరసీకి పాల్పడిన శరీరాన్ని హెచ్చరిస్తుంది. చట్టాల పేర్లు చెప్పి దాడులు చేస్తుంది. ఒక సినిమా కథకీ అంతే పకడ్బందీగా కాపీ రైట్ చట్టాలుంటాయన్నది తెలివిగా మరుగుపరుస్తుంది. పాపం నోరూ వారుూ లేని పైరసీ శరీరం తానొక్కతే దోషి గా ప్రపంచం ముందు నిలబడుతుంది. ఆత్మకి మాత్రం ఒక సందేహ మెప్పుడూ మిగిలే ఉంటుంది. ఒక శరీరం చోరీ చేసిన సొత్తుని, ఇంకో శరీరం చోరీ చేస్తే, దాన్ని చోరీ అని ఎందుకంటారని. అది బై ప్రొడక్టే కదా?
దూకుడు, ఊసరవెల్లి అనే రెండు దసరా సినిమాలూ యాదృచ్ఛికంగా అనుసరించిన కొత్త పంథా బాగోగుల్ని తెలియపరచడమే ఈ వ్యాసం ఉద్దేశం. ‘దూకుడు’ వెబ్ సైట్ ప్రకారం ఈ సినిమా కోసం ఎనె్నన్నో కథలనుకున్నారు. కొన్ని కథలు తయారుచేసి పక్కనపడేశారు. ఎంతోకాలం గడిచిపోయింది. చివరికి మొదట్లో అనుకున్న కథే ఫైనల్ చేసుకున్నారు. ఈ ఫైనల్ చేసుకున్న కథా విశేషాలు తప్పించి, మిగతా వాటికి జరిగిన గ్రంథ పఠనం, పాత క్లాసిక్స్ వీక్షణం వంటి ప్రక్రియలన్నీ వివరించుకొచ్చారు. కానీ ఎందుకో ఫైనలైన కథ అదెలా ఫైనల్ అయిందీ చెప్పలేదు. తీరా సినిమా విడుదలయ్యే వరకూ మనకి తెలీదు-అందులో జర్మన్ ట్రాజీ-కామెడీ ‘గుడ్‌బై లెనిన్’ కథ వచ్చేసి జొరబడి పోయందని! 2003లో విడుదలై అనేక ప్రశంసలూ, అవార్డులూ అందుకున్న ‘గుడ్‌బై లెనిన్’ చారిత్రక నేపథ్యమున్న కథ, అందులో ఒక కమ్యూనిస్టు నాయకురాలు కొడుకుని పోలీసులు కొట్టడం చూసి తట్టుకోలేక షాక్‌తో కోమాలోకెళ్లిపోతుంది. ఆమె కోమాలో ఉన్న కాలంలో బెర్లిన్ గోడ కూలి, ఉభయ జర్మనీలూ ఒకే దేశంగా అవతరిస్తాయి. కమ్యూనిజం అంతరించి క్యాపిటలిజం వేళ్ళూనుతుంది. దేశ రాజకీయ, సాంస్కృతిక స్వరూపాలే మారిపోతాయి. ఎనిమిది నెలల తర్వాత కళ్లు తెరిచిన ఆమెకి ఎలాటి దుర్వార్త తెలిసినా గుండెపోటు రావచ్చని హెచ్చరిస్తారు డాక్టర్లు. దాంతో హీరో అయిన కొడుకు ఆమెని గదిలో పడకమీద వుంచి, ఆమెకి తెలిసిన జర్మనీయే ఉందని చెప్పి నమ్మిస్తుంటాడు. ఇందుకోసం చెల్లెలితో, ప్రియురాలితో కలిసి అనేక నాటకాలాడుతుంటాడు. దర్శకుడు వుల్ఫ్‌గ్యాంగ్ బెకర్ ఎంతో ఇంటిలిజెంట్‌గా, లాజికల్‌గా బాగా నవ్వించే దృశ్యాలు సృష్టిస్తాడు. ఇదెక్కడి దాకా పోతుందంటే, నాటకాలేసీ
వేసీ అలసిపోయిన హీరో, ఆ తల్లి చనిపోతే బావుండుననే స్థితికొస్తాడు. ఎంత నవ్విస్తుందో, అంత కంట తడిపెట్టించే జీవమున్న ట్రాజీ-కామెడీ ఇది.
‘దూకుడు’లో దీన్ని ప్రకాష్‌రాజ్-మహేష్‌బాబుల ఎపిసోడ్‌గా పెట్టుకున్నారు. రాజకీయ నాయకుడైన ప్రకాష్‌రాజ్ 14 ఏళ్ల తర్వాత కోమాలోంచి మేల్కొన్నాక, అతడ్ని డిస్టర్బ్ చేసే విషయాలు తెలిస్తే గుండెపోటు రావచ్చునని చెప్తారు డాక్టర్లు. దాంతో కొడుకు పాత్రలో మహేష్‌బాబు ప్రకాష్‌రాజ్ శ్రేయస్సుకోసం, అదే 14 ఏళ్లనాటి రాష్ట్ర పరిస్థితిని నమ్మిస్తూ, తను ఎమ్మెల్యేగా నటిస్తూ రియాల్టీ షో పేరుతో ఒక వర్చువల్ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎన్టీఆర్ బ్రతికే ఉంటాడు. కాకపోతే దేశ ప్రధానిగా ఉంటాడు. ప్రకాష్‌రాజ్ అభిమాన ఎన్టీఆర్ గురించి ఈ మంచి విషయాలు, మహేష్‌బాబు ఎమ్మెల్యే అయి ప్రకాష్‌రాజ్ కోర్కె తీర్చిన శుభ పరిణామం ఇత్యాదివన్నీ ప్రకాష్‌రాజ్ నమ్మేస్తూ బ్రతికేస్తూంటాడు. అయితే ఈయన ఆనాడే చనిపోయాడని కుటుంబం ప్రపంచాన్ని నమ్మించింది. విగ్రహం పెట్టి ఇప్పుడు కూడా వూరి జనాన్ని నమ్మిస్తూ, 15వ సంవత్సరీకం జరపబోతున్నారు...ఇదీ విషయం. ఇంకా చాలా లాజిక్‌లేని, అర్ధం పర్ధంలేని అంశాలు అనేకం ఉంటాయి.ప్రధానంగా ప్రకాష్‌రాజ్ లేచి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. చేతిలో దినపత్రిక కూడా ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ కాకమ్మ కథలా ఉంటుంది.
సినిమాల్లో-ఆ మాటకొస్తే కామెడీకి అంతగా లాజిక్ పట్టించుకోవద్దంటారు నిజమే, కానీ ఎప్పుడు పట్టించుకోవద్దు? మనకి ఎప్పుడు నవ్వొస్తుంది? జోక్ ఎప్పుడు పేలుతుంది? వీటి బీజం లాజికల్‌గా ఉన్నప్పుడే. ఆరిస్టాటిల్ ప్రకారం, ఒక హాస్య ప్రహసనానికి బేస్ లాజికల్‌గా ఉంటే, దాన్ని ఆసరాగా చేసుకుని ఎంత అసంబద్ధ కామెడీనైనా సృష్టింవచ్చు. అదే బేస్ అసంబద్ధంగా ఉంటే, ఎలాంటి కామెడీకి నవ్వు రాదు. దూకుడులో మహేష్‌బాబు సృష్టించిన వర్చువల్ ప్రపంచం ఇలాంటి బేస్ లేనిదే. జర్మన్ సినిమాకి ఈ బేసే ప్రాణమైంది. అయినా ‘దూకుడు’ని చూసి ప్రేక్షకులు తెగ నవ్వుతున్నారంటే దాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలెయ్యాలి.
జర్మన్ సినిమా ‘దూకుడు’లో పొసగని ఒక భాగంగా ఇరుక్కుంటే, ‘ఊసరవెల్లి’లో హాంకాంగ్ దర్శకుడి హాలీవుడ్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ అయింది. జానీ టో దర్శకత్వం వహించిన ‘వెంజెన్స్’లో హాంకాంగ్‌లోని ఒక ఫ్రెంచి కుటుంబం మీద దుండగులు దాడి చేస్తారు. ఆమె గాయపడి, ఆమె భర్త్తా పిల్లలూ చనిపోయి, దీనావస్థలో ఆ హంతకుల మీద పగ తీర్చుకోమని తండ్రిని వేడుకుంటుంది. తండ్రి కుక్. అతనెప్పుడో కిల్లర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఓపిక లేదు. అయినా కన్న కూతురికి జరిగిన దానికి చేవ తెచ్చుకుని, ముగ్గురు కిల్లర్స్‌ని మాట్లాడుకుని, శత్రు సంహారం మొదలెడతాడు.
దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్‌గా పెట్టినప్పుడు, ఇందులో కథంతా హీరోయిన్ తమన్నాదే. ఆమె అన్న కుటుంబాన్ని మాఫియాలు హతమారుస్తారు. ఆమె తీవ్రంగా గాయపడి మతి స్థిమితం కోల్పోయి, ప్రతీకారం కోసం అంగలారుస్తున్నప్పుడు, చివర్లో చిల్లర నేరస్థుడి పాత్రలో ఎన్టీఆర్ తారసపడతాడు. మాఫియాల్ని చంపమని అతడ్ని బతిమాలుతుంది. అతను ఒప్పుకుని బయలుదేరుతాడు. దాంతో ఈ ఫ్లాష్‌బ్యాకే కాదు, మొత్తం సినిమా అంతా తమన్నా కథగా మారిపోయి ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. ఒరిజినల్‌లో ఉన్న తండ్రీ కూతుళ్ల మధ్య ఎటాచ్‌మెంట్ లాంటిది ఇక్కడ కుదరకపోవడం, హీరో లక్ష్యం- పోరాటం-పాత్ర సమస్తం సెకండ్ హేండ్‌గా మారిపోవడం వంటి దుష్పరిణామాలకి దారి తీసిందీ ఫ్లాష్ బ్యాక్.
ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. దీన్ని కాపీ అనకుండా ఇన్‌స్పిరేషన్ అనే అనుకుందాం. కానీ ఇన్‌స్పిరేషన్స్ ఇంత నిస్సారంగా ఉంటాయా? వీటినే సినిమాలనుకోవాలా?                              -సికిందర్