22, అక్టోబర్ 2011, శనివారం

'ప్రైవేట్' లంచాలపై ఉక్కుపాదం

క్రిమినల్ కేసులుగా నమోదు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవినీతి విషయంలో రాజీ లేదు ప్రజా చైతన్యం శుభ పరిణామం సిబిఐ, ఎసిబి సమావేశంలో మన్మోహన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రైవేటు రంగం ముడుపులు ఇవ్వడాన్ని నేరంగా చేయడానికి వీలుగా చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అవినీతిపై ఐక్యరాజ్య  సమితి ఒడంబడికకు భారత్ ఆమోదముద్ర వేసిందని, దీన్ని అమలు  చేయాలంటే అవినీతికి సంబంధించిన పలు చట్టాలను సవరించాల్సిన  అవసరం ఉందని ప్రధాని చెప్పారు. అందులో భాగంగా విదేశీ ప్రతినిధులకు ముడుపులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణించడానికి వీలుగా ఇప్పటికే  పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టామన్నారు. అలాగే ప్రైవేటు రంగం
లంచాలివ్వడాన్ని కూడా నేరంగాచేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకు  రావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. అయితే ప్రైవేటు రంగంలో లంచాలను ఎలా నిరోధిస్తారో మాత్రం ప్రధాని వివరించలేదు. శుక్రవారం ఇక్కడ రాష్ట్రాల అవినీతి నిరోధక విభాగాలు, సిబిఐ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మంటగలుపుతూ ఆర్థికాభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి విషయంలో రాజీ పడబోమన్న ప్రధాని స్పష్టం చేశారు. అయితే ఈ చీడపురుగును పూర్తిగా నిర్మూలించలేమని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం గణనీయంగా పెరిగినప్పటికీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని
అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం అవినీతిని కట్టడి చేయటానికి గట్టి చర్యలు తీసుకుంటోందని, అయితే నిర్ణయాలను తీసుకోవటంలో జరుగుతున్న తప్పిదాలు అవినీతికి, అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఇస్తున్నాయని చెప్పారు. అవినీతిని అదుపుచేసే ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉన్న విచక్షాణాధికారాలను కుదించనున్నట్టు చెప్పారు. అంతేకాక వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టే ప్రభుత్వ పధకాలను మంజూరు చేయటానికి పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ చట్టాన్ని అమలు చేయనున్నామని, అతి త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లును
ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. గతంలోకంటే అవినీతికి వ్యతిరేకంగా సమాజంలోని వివిధ వర్గాలు ఉద్యమిస్తున్న తీరు ప్రజాస్వామ్య భవితవ్యానికి మంచిదని ప్రధాని  అభిప్రాయపడ్డారు. ప్రజా చైతన్యాన్ని శుభ సంకేతంగా పరిగణించి ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపటానికి అన్ని చర్యలను తీసుకుంటోందన్నారు. అవినీతికి దారితీసే నిర్ణయాలకు స్వస్తి చెప్పిన పక్షంలో అవినీతి బాగా తగ్గుతుందని మన్మోహన్ అభిప్రాయ పడ్డారు.
‘ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అధికారులు సక్రమంగా తమ విధులను నిర్వహిస్తే మంచి ఫలితాలు లభించి  తీరుతాయి’ అని  వ్యాఖ్యానించారు.  ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని బలమైన ఆయుధంగా వినియోగించుకుంటే అవినీతి దానంతటదే దారికి వస్తుందని ప్రధాని చెప్పారు. ప్రజలు అడిగిన ప్రతి విషయంపై పూర్తి  సమాచారాన్ని బహిరంగం చేయటానికి అధికారులు తటపటాయించవద్దని  సూచించారు. అవినీతిపరులు ఏదో ఒక రోజు చట్టానికి దొరికి తీరుతారని  ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై పెట్టిన కేసుల  విచారణను వీలైనంత త్వరితంగా పూర్తిచేసి శిక్ష పడేట్టు చేయాలని ఆయన  చెప్పారు. సిబిఐ వద్ద పదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులను
పరిశీలించి వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు  పదవీ విరమణ చేసిన సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని నియమించినట్టు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే
వారికి రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తున్నామన్నారు. అవినీతికి సంబంధించిన కేసులను విచారించి దోషులకు శిక్ష పడేట్లు చేయటంలో సిబిఐ అత్యంత నైపుణ్యంగా పని చేస్తూ అంతర్జాతీయంగానే మంచి  గుర్తింపు పొందుతోందని ప్రశంసించారు. లోక్‌పాల్ వ్యవస్థ అవిర్భవించినప్పటికీ సిబిఐ దేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థగా
ప్రభుత్వానికి సేవలు అందిస్తుందని ప్రధాని నిష్కర్షగా చెప్పారు. ఒత్తిడులకు లొంగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సిబిఐ పని చేయాలన్నారు. అవినీతిపరుల పాలిట సింహస్వప్పంగా మారిన సిబిఐపై
ప్రజలకు, ప్రభుత్వానికి విపరీతమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయని ఆయన చెప్పారు.

డయల్.. 1964
లంచాల బాధితుల కోసం త్వరలో సివిసి హెల్ప్‌లైన్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: లంచాల కోసం అవినీతిపరులు మిమ్మల్నివేధించుకుతింటున్నారా? మీ పనులు ఆలస్యం చేస్తున్నారా? అయితే 1964 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే సరి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) అధికారులు వారి భరతం పడతారు. సివిసి త్వరలోనే  అందుబాటులోకి తీసుకురానున్న ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా  అవినీతి బాధితులకు నిరంతర సేవలు అందుతాయి. అవినీతికి  సంబంధించిన అన్ని రకాల ఫిర్యాదులను ఈ హెల్ప్‌లైన్ పరిష్కరిస్తుందని  సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ  విభాగాల్లో లంచగొండులకు ముడుపులు ముట్టజెప్పలేక, సకాలంలో పనులు పూర్తిగాక ఇబ్బందులు పడే బాధితులకు ఈ హెల్ప్‌లైన్ అండగా నిలుస్తుందని సివిసి అధికారులు చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఒక పూర్తిస్థాయి కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ
విభాగాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ లంచగొండుల నుంచి  ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎవరైనా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తమ సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవచ్చన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం, దాని
విభాగాలు ఈ హెల్ప్‌లైన్ పరిధిలోకి రావని, కనుక వాటిని ఈ హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించడం జరగదని సివిసి అధికారులు తెలిపారు.