24, అక్టోబర్ 2011, సోమవారం

జైలులోనే కనిమొళి దీపావళి పండుగ

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోసం కనిమొళి తాజాగా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కనిమొళి గత ఐదు నెలలుగా జైలులోనే ఉన్నారు. కనిమొళి బెయిల్ పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించలేదు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరు కావడంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అయితే, కనిమొళికి నిరాశే ఎదురైంది. ఇంటి వద్ద దీపావళి జరుపుకోవడానికి వీలుగా సోమవారమే బెయిల్ మంజూరవుతుందని అనుకున్నారు. కానీ, కోర్టు నిర్ణయంతో ఆమె దీపావళి పర్వదినాన్ని జైలులోనే జరుపుకోవాల్సిన పరిస్థితిలో పడింది.
కనిమొళితో పాటు కళైంగర్ టీవి చానెల్ ఎండి శరద్ కుమార్, కరీం మొరానీ, ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్‌ల బెయిల్ పిటిషన్లను కూడా తాము వ్యతిరేకించబోమని సిబిఐ అధికారులు కోర్టు నిర్ణయానికి ముందు చెప్పారు. ఈ ఐదుగురు కూడా స్వాన్ టెలికమ్ నుంచి లంచాలు తీసుకునేందుకు టెలికం మాజీ మంత్రి ఎ. రాజాకు సహకరించారని ఆరోపణలున్నాయి. కనిమొళిని సిబిఐ మే 20వ తేదీన అరెస్టు చేసింది.