24, అక్టోబర్ 2011, సోమవారం

పోలవరం టెండర్లు రద్దు చేయాలి:కెసిఆర్‌ లేఖ


 హైదరాబాద్‌;పోలవరం ప్రాజెక్టు టెండర్లు వివాస్పదం కావడం, తనపై ముప్పేటదాడి జరుగుతుండటంతో ఎట్టకేలకు టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కెసిఆర్‌ స్పందించారు. పోలవరం టెండర్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఆదివారం ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించే వరకూ ఎలాంటి పనులకు అనుమతివ్వొద్దని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మొత్తం 299 గ్రామాలు అంతరించి పోతా యన్నారు. వీటిలో 23 గ్రామాలు ఒడిషా, చత్తీస్‌గఢ్‌కు చెందినవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 1,93,357 మంది నిర్వాసితులుగా మారతారని తెలిపారు. వీరిలో 73 వేల మంది గిరిజనులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మూలంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని, ముంపును తగ్గించాలని యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని గతంలో తాను కోరానన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, సుప్రీంకోర్టు 2011 ఫిబ్రవరిలో ఆదేశించాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించి టెండర్లను పిలిచిందన్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్‌కు సంబంధించి రూ. 4717 కోట్ల కు టెండర్‌ వచ్చినట్టు తెలుస్తోందన్నారు. టెండర్లను అనుమతించాల్సి ఉన్నట్టు తెలుస్తోం దన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్లను రద్దు చేయాలని కెసిఆర్‌ కోరారు. పోలవరం టెండర్లలో అవకతవకలు జరిగాయనీ, కెసిఆర్‌ తన బినామీకి బిడ్‌ను ఇప్పించుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. పోలవరం టెం డర్‌కు సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారని టి టిడిపి ఫోరం విమర్శించింది. టెండర్‌ దక్కించుకున్న స్యూ-పటేల్‌-ఎఎంఆర్‌ జాయింట్‌ వెంచర్‌లోని లక్ష్మీరాజం నమస్తే తెలం గాణ పత్రికకు సిఎండిగా ఉన్నారని ఆరోపించింది. పటేల్‌ కంపెనీకి అర్హత లేకపోయినా, బ్లాక్‌లిస్టులో ఉన్నా కాంట్రాక్ట్‌ దక్కిందని పేర్కొంది. కాంగ్రెస్‌, కెసిఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపణలొచ్చాయి. రాజకీయ జెఏసిలోని న్యూడెమోక్రసీ ఖమ్మంలో పోలవరం టెండర్లకు వ్యతిరేకంగా రౌండ్‌ టేబుల్‌ నిర్వహించింది. మరోపక్క గద్దర్‌, విమలక్క తదితరులతో పాటు కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ సైతం విమర్శలు సంధించారు. కాగా ఆర్థిక బిడ్‌ మాత్రమే వచ్చిందని ఇంకా టెండర్‌ ఖరారు కాలేదని సిఎం చెప్పారు. దీంతో కెసిఆర్‌ ఎట్ట కేలకు టెండర్లను రద్దు చేయాలని లేఖ రాశారని టిడిపి నేతలు అంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన లేఖలో ప్రస్తావించకపోవడం గమనార్హం.