24, అక్టోబర్ 2011, సోమవారం

తల్లడిల్లిన టర్కీ


-వెయ్యికి పైగా మృతులు?
-భూకంప తీవ్రత 7.3గా నమోదు



ఆదివారం టర్కీని భారీ భూకంపం అతలాకుతలం చేసి తీవ్ర నష్టం కలుగజేసింది.టర్కీలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయి వుండవచ్చని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 79 మంది చనిపోయారని, 350 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఆధ్వర్యంలోని టిలివిజన్‌ తెలియచేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదైందని, ఈ ప్రకంపనల కేంద్రం దేశ తూర్పు భాగంలో వుండటంతో ఆ ప్రాంతంలో మృతుల సంఖ్య ఎక్కువగా వుండవచ్చని భావిస్తున్నామని టర్కీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ భూకంపంలో మృతుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ భూకంపంలో డజన్ల కొద్దీ భవనాలు నేలకూలాయి. వీటి నిర్మాణ ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ఇవి కుప్పకూలి భారీ సంఖ్యలో ప్రజల చనిపోయివుండవచ్చని భావిస్తు న్నారు. ప్రధాని తయ్యిప్‌ ఎర్డోగాన్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు ఇస్తాంబుల్‌ నుండి బయ ల్దేరి వెళ్లారు. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 10.41 గంటలకు వాన్‌ రాష్ట్ర రాజధాని వాన్‌కు ఈశాన్యంగా 20 కి.మీ దూరంలో భూగర్భంలో 7 కి.మీ లోతున ఈ ప్రకం పనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం మరోసారి 10.56 గంటలకు 20 కి.మీ లోతులో 5.6 పాయింట్ల స్థాయిలో మరోసారి ప్రకంపనలు సంభవించినట్లు కండ్లిలి ప్రయోగశాల, భూకంపనల పరిశోధనా సంస్థ అధికారులు టర్కిష్‌ టీవీకి చెప్పారు. బాన్‌ ప్రావిన్స్‌లోని తబన్లీ పట్టణం వద్ద ఈ ప్రకంపనల కేంద్రం వుంది. ఈ ప్రాంతం ఇరాన్‌ సరిహద్దుకు అతి సమీపంలో వుంది. భూకంప సమాచారం తెలుసుకున్న వెంటనే టర్కీ రెడ్‌ క్రెసెంట్‌ సంస్థ బాధితులకు టెంట్లు, దుప్పట్లు, ఆహార పదార్ధాల పంపిణీని చేపట్టింది. భూకంపం అనంతరం ప్రజలు భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలను టర్కీ టీవీ ప్రసారం చేసింది. ఇరాన్‌ సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో (వాన్‌ రాష్ట్రం) ఉన్న 75 వేల జనాభా గల ఎర్సిస్‌ పట్టణం భూకంపానికి తీవ్రంగా దెబ్బ తిన్నది. ఇదిటర్కీలో భూకంపాలు అధికంగా వచ్చే జోన్‌లో ఉంది. ప్రస్తుత భూకంపం వాన్‌ రాష్ట్రంలో గణనీయంగా నష్టం కలుగచేసింది. ఎర్సిస్‌ పట్టణంలో 30 భవనాలు, ప్రావిన్స్‌ కేంద్రమైన వాన్‌లో పది భవనాలు కుప్పకూలాయని డిప్యూటీ ప్రధాన మంత్రి బెసిర్‌ అటాలే తెలిపారు. ఎర్సిస్‌లో దెబ్బతిన్న ఎనిమిది అంతస్తుల భవనంలోకి ఎగబాకిన రక్షణ సిబ్బంది ఆ భవనంలోపల కొందరు ఉన్నట్లు కనుగొన్నారు. వారి రక్షణ కోసం బయట ఉన్న వారి ఆప్తులు, బంధువులు ఆత్రంగా ఎదురు చూడటాన్ని టెలివిజన్‌ ఛానెళ్లు ప్రసారం చేశాయి. 'నా భార్య, నాలుగు నెలల నా పాప లోపల చిక్కుకుపోయారు' అంటూ ఓ యువకుడు విలపించడాన్ని సిఎన్‌ఎన్‌-టర్క్‌ టెలివిజన్‌ చూపించింది. ఆ భవనం నుంచి ఎనిమిది మందని రక్షించారని, అయితే వెంటవెంటనే వస్తున్న ప్రకంపనాలు రక్షణ సిబ్బంది ప్రయత్నాలకు ఆటంకాలు కలిగిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 'అనేకమంది చనిపోయారు. అనేక భవనాలు కుప్పకూలాయి. తీవ్రంగా వినాశనం జరిగింది' అని ఎర్సిస్‌ మేయర్‌ జల్ఫికర్‌ అరపోగ్లు తెలిపారు. 'మాకు తక్షణ సాయం కావాలి. మాకు వైద్య సౌకర్యం కావాలి' అని ఆయన అన్నారు. ప్రపంచంలోని తీవ్ర సెస్మిక్‌ జోన్లలో టర్కీ ఒకటి. ఆదివారం మూడు గంటల్లోనే ఎనిమిది సార్లు భూప్రకంపనాలు వచ్చాయని, వీటిల్లో రెండు ప్రకంపనాలు 5.6 తీవ్రతతో నమోదయ్యాయని అమెరికా శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. ఎర్సిస్‌ మేయర్‌ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల పరిస్థితి గురించి అధికారులకు ఇప్పటివరకు సమాచారమేదీ లేదని తెలిపారు. భూకంపానికి దెబ్బ తిన్న ప్రాంతాల్లో గవర్నర్‌ హెలికాప్టర్లో పర్యటించారని చెప్పారు. ఈ భూకంపంలో 500 మంది నుంచి వెయ్యి మంది వరకు చనిపోయివుండవచ్చని అంచనా వేస్తున్నట్లు టర్కీలోని ప్రధాన సిస్మోగ్రఫీ కేంద్రం తెలిపింది.
బిట్లిస్‌ ప్రావిన్స్‌లోనూ అనేక భవనాలు కూలిపోయాయి. వాన్‌ ప్రావిన్స్‌ ముఖ్యపట్టణమైన వాన్‌ విమానాశ్రాయం దెబ్బ తినడంతో విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న ఆర్మేనియాలోనూ అనేక భవనాలు కూలిపోయాయి. ఆర్మేనియా రాజధాని ఎర్సిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఇక్కడ నష్టం గురించిన వివరాలు తెలియరాలేదు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న ఇరాన్‌లోని పలు పట్టణాల్లోనూ ప్రజలు భయపడిపోయారు. ఇక్కడ కూడా కొన్ని భవనాలు దెబ్బ తిన్నాయి. టర్కీలో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. 1999లో రెండు తీవ్ర భూకంపాలు వచ్చాయి. అప్పుడు 18 వేల మంది చనిపోయారు. 2010లో వచ్చిన భూకంపంలో 51 మంది చనిపోగా, 2003లో వచ్చిన భూకంపంలో 177 మంది మరణించారు. టర్కీలో అత్యంత భయంకరమైన, దారుణమైన భూకంపం 1939లో ఎర్జిన్‌కన్‌లో సంభవించింది. ఈ దుర్ఘటనలో అప్పట్లోనే 1,60,000 మంది చనిపోయారు. టర్కీలో కోటీ 12 లక్షల జనాభాతో దేశంలోనే అతి పెద్ద నగరమైన ఇస్తాంంబుల్‌ భారీ భూంకపాల జోన్‌లో ఉన్నట్లు చెబుతున్న నిపుణులు ఇక్కడ కనుక భూకంపం సంభవిస్తే విపరీతమైన జనాభా, నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న భవనాల కారణంగా 40 వేల మందికి పైగా మరణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.