మల్లాది మిరియాలు --- మల్లాది వెంకట కృష్ణమూర్తి
తను ఆ లైటు ఆర్పలేదా? తను చూస్తూండగానే బల్బ్ మాడిపోయిందా? ఆలోచిస్తూ బ్రెట్ డీలేన్ ఆ గది తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాడు. అతనికి లోపల దొంగ ఉండచ్చనే ఆలోచన కలిగితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసేవాడు. ఐతే లాస్ ఏంజెలెస్‌లో, బెవర్లి హిల్స్‌లో ప్రధానంగా నటీనటులు నివసించే ఆ కాలనీలో దొంగలు పడటం గురించి బ్రెట్ ఎన్నడూ వినలేదు. కాబట్టి అది దొంగ పని ఆవచ్చన్న అనుమానమే కలగలేదు.
ఆ గదిలోకి వెళ్ళి స్విచ్ నొక్కాడు. ఎదురుగా గోడకి ఓ మూల నక్కి ఉన్న ఓ పద్దెనిమిదేళ్ళ కుర్రాడు కనిపించాడు. అతని చేతిలో పిస్తోలు, కళ్ళల్లో భయం కనిపించాయి. ఆ గది కిటికీ తలుపు అద్దం పగిలి ఉండటం కూడా బ్రెట్ గమనించాడు.
బ్రెట్ అతనితో మాట్లాడటానికి నోరు తెరిచాడు. మరుక్షణం బాధగా గుండె దగ్గర చేతిని వేసి వెనక్కి తూలి, వెనక గోడకి ఆనించి వేసిన సోఫాలో పడ్డాడు. లైట్ పేంట్స్, మురికి జాకెట్ వేసుకుని ఉన్న ఆ యువకుడు బ్రెట్ వంక నిశ్శబ్దంగా చూసాడు. అతను తన చేతిలోని పిస్తోలుని ఏ క్షణంలోనైనా పేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
బ్రెట్ తేరుకోడానికి అర నిముషం పట్టింది. ఆయన లేచి తూలుతూ నెమ్మదిగా బల్ల వెనక ఉన్న రివాల్వింగ్ చెయిర్‌లో కూలబడ్డాడు. తర్వాత దాని డ్రాయర్‌ని తెరవడానికి దాని హేండిల్ మీద తన చేతిని వేసాడు.
‘‘డేడ్! దాన్ని తెరిస్తే గుండు నీ గుండెల్లో దిగుతుంది.’’ వెంటనే హెచ్చరికగా చెప్పాడా యువకుడు.
‘‘మందు. నా మందు...’’ బ్రెట్ ఆక్రోశించాడు.
‘‘ఏం మందు?’’
‘‘గుండె నొప్పికి నాలిక కింద ఉంచుకునే మందు. ఇది.’’
మాట్లాడుతూనే బ్రెట్ డ్రాయర్ లాగి అందులోంచి చిన్న డబ్బాని తీసాడు. దాన్ని తెరచి అందులోని ఓ మాత్రని నోట్లో నాలిక కింద ఉంచుకున్నాడు. సీట్‌లో నీరసంగా కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయాడు.
వెండి రంగు జుట్టు గల ఆ వృద్ధుడి వంక ఆ యువకుడు నిశ్శబ్దంగా చూస్తుండిపోయాడు. ఆయన నటుడని ఆ గదిలోని అనేక షీల్డ్‌లనిబట్టి గ్రహించాడు. ఐతే ఆయన నటించిన సినిమాలు విడుదలయ్యే కాలంలో ఆ యువకుడు పుట్టనే లేదు.
బ్రెట్ నటించిన అనేక కేరక్టర్ రోల్స్‌గల చిత్రాలు ఆ గదిలో గోడల నిండా అలంకరింపబడి ఉన్నాయి. ‘పాత కాలం నటుడు’ అనుకున్నాడు. బ్రెట్ డిలేన్ అనే పేరు కూడా ఆ యువకుడు ఎన్నడూ వినలేదు.
చిన్నగా మూలిగి కళ్ళు తెరచి బ్రెట్ ఆ యువకుడ్ని అడిగాడు.
‘‘నీకేం కావాలి?’’
‘‘దొంగతనం చేయడానికి వచ్చాను. బంగారం, నగదు.’’
‘‘నీకేం కావాలో అవి తీసుకుని వెళ్ళిపో.’’
‘‘సరే. కాని ముందుగా నిన్ను చంపి.’’
బ్రెట్ ప్రశ్నార్థకంగా చూసాడు.
‘‘సాక్షి సాక్షి నన్ను కటకటాల వెనక్కి పంపగలడు. జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. అందుకని...’’ ఆపేసాడు.
‘‘నన్ను చంపదలచుకున్నావా?’’
‘‘అవును.’’
‘‘నేను చావుకి సమీపంలోనే ఉన్నాను. ఇది మూడోసారి నాకు హార్ట్ అటాక్ రావడం. ఈ మందు వేసుకుంటే నాకు అన్నిసార్లు రిలీఫ్ కలిగేది. గుండె సర్దుకునేది. కాని ఈసారి మాత్రం... నిన్ను చూసిన షాట్‌కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మూడోసారి హార్ట్ అటాక్ వస్తే జీవించడం అంటూ ఉండదు.’’
‘‘అది అబద్ధం.’’
బ్రెట్ సన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఆ యువకుడికి కనిపించింది.
‘‘దేనికా నవ్వు?’’ అయోమయంగా చూస్తూ అడిగాడు.
‘‘పిల్లవాడా! బ్రెట్ డిలేన్ పేరు విన్నావా?’’
‘‘లేదు.’’
‘‘నన్ను తెరమీద సినిమాల్లో ఎప్పుడైనా చూసావా?’’
‘‘లేదు.’’
మళ్ళీ ఇందాకటిలా నవ్వాడు బ్రెట్.
‘‘ఐతే నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. నన్ను చంపు. కాల్చు.’’
ఆ యువకుడి అయోమయం రెట్టింపైంది.
‘‘నేను నిన్ను చంపడం నీకు సహాయం చేయడం ఎలా అవుతుంది?’’ ప్రశ్నించాడు.
‘‘నాకు నీ చేతుల్లో చావడానికి రెండు కారణాలున్నాయి.’’
‘‘ఏమిటవి?’’
‘‘ఒకటి. నా ప్రాణాంతక రోగం కొద్దికొద్దిగా నన్ను బలహీనపరుస్తూ చంపుతోంది. ‘ఎప్పుడు చస్తానా?’’ అనే భయంతో మరణించేకంటే ఇలా ఒక్కసారిగా మరణించడంలో నాకు ఆనందం ఉంది.’’
‘‘రెండో కారణం?’’
‘‘నువ్వే.’’
‘‘అయోమయంగా మాట్లాడకు.’’
‘‘నిజం. నా పేరు నువ్వు వినలేదన్నావు. నా సినిమా చూడలేదన్నావు. నేను నటుడ్ని. నీకు తెలుసా? రెండువందల నలభై ఆరు సినిమాల్లో నటించిన నటుడ్ని. సెట్‌లో నాకోసం మిగతా నటీనటులు ఎదురుచూసేవారు. ప్రేక్షకులు నేనున్న సినిమాలకి నాకోసం వచ్చేవారు. నేను ఎక్కడికీ ఒంటరిగా, బాడీగార్డులు లేకుండా వెళ్ళగలిగేవాడిని కాను. ఆటోగ్రాఫ్‌లకోసం నన్ను ప్రజలు చుట్టుముట్టేవారు. 1974లో ఓ రోజు షికాగో ఎయిర్‌పోర్ట్‌లోని తోటి ప్రయాణీకులు ఆటోగ్రాఫ్‌లకోసం నన్ను చుట్టుముడితే...’’
బాధగా మూలిగి మళ్ళీ గుండెని పట్టుకున్నాడు. గట్టిగా ఊపిరిపీల్చుకుని వదిలి, నుదుట పట్టిన చెమటని తుడుచుకుని మళ్ళీ కొనసాగించాడు.
‘‘నా విమానం నాకోసం పావుగంటసేపు ఆగాల్సి వచ్చింది. సెక్యూరిటీ పోలీసులు వచ్చి నన్ను వాళ్లనించి వేరుచేసి, నా విమానంలోకి ఎక్కించారు. మర్నాడు ఆ వార్త పేపర్లో వచ్చింది. ఇటీవల ఇంతటి అభిమానంగల నటీనటులే లేరు. ఐనా నువ్వు నా పేరు వినలేదు. నా మరణవార్త గురించి రేపు దినపత్రికలో లోపలి పేజీల్లో ఎక్కడో ఓ అరంగుళం జాగాలో వేస్తే దాన్ని ఎవరూ చదవరు. చదివినా నేనెవరో ఎవరికీ తెలీదు.’’
‘‘ఐతే?’’
‘‘అర్థం కాలేదా? ఏ నటుడికైనా గుర్తింపు ముఖ్యం. దానే్న కీర్తి అంటారు. గుండాగి సహజంగా మరణించేకంటే నేను హత్యచేయబడితే నా మరణవార్త మొదటి పేజీలో వేస్తారు. నా చిత్రాల్లోని పాపులర్ సినిమాల గురించి ప్రస్తావిస్తారు. నేను లిండన్ జాన్‌సన్ ఆహ్వానం మీద వైట్‌హౌస్‌కి వెళ్ళి ఆయనతో టీ తీసుకున్న ఫొటో వేస్తారు.’’
బ్రెట్ డిలేన్ కంఠం గద్గదమైంది. ఆయన కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
‘‘నా చేతి వేళ్ళల్లోంచి జరిపోయిన కీర్తి. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కీర్తి, జారిపోవడం చూస్తూ ఇనే్నళ్ళుగా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా?’’
బ్రెట్ దీర్ఘంగా నిట్టూర్చాడు.
‘‘నేను మరణించడం తప్పదు. దానికి దగ్గరగా కూడా వచ్చాను. కాబట్టి నన్ను కాల్చు, అహంకారంగల ఏ నటుడూ ఇంతకంటే ఇంకోటి కోరడు.’’
‘‘నీకు పిచ్చెక్కింది.’’
‘‘ఓ పాత్ర తెరమీదకి ప్రవేశించిన విధానంకన్నా ఆ పాత్ర నిష్క్రమించే విధానమే ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. రోమన్ హాలీడే చూసావా? చివర్లో గ్రెగరి పెక్ రాజప్రసాదంలోంచి నిశ్శబ్దంగా జేబుల్లో చేతులు ఉంచుకుని, నడిచి వెళ్తూంటే కేవలం అతని బూట్ల చప్పుడే వినిపిస్తుంది. ఆ సినిమా చూసిన వారెవరూ గ్రెగరీని మర్చిపోలేరు. కసబ్లాంకా చూసావా? అందులో హంప్రిబోగర్ట్ తన ప్రియురాలిని ఆమె ప్రియుడితో విమానంలో పంపించి చేసిన త్యాగం, ఆ తర్వాత అతను దూరంఅయ్యే విమానం వంక చూసిన తీరు... కసబ్లాంకా ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమా అయింది. హంఫ్రి ప్రేక్షకులకి గుర్తుండిపోయాడు. ఓనాటి గొప్ప నటుడు, ఒంటరి ఇంట్లో ఓ సామాన్య దొంగచేత కాల్చి చంపబడితే, అతని సినిమాలు మళ్ళీ టీవిలో ప్రసారం చేయబడతాయి. మరణించినా నేను మళ్ళీ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తాను.’’
బ్రెట్ వెక్కివెక్కి ఏడుస్తూ అర్ధించాడు.
‘‘చంపు. ఈ జీవచ్ఛవాన్ని చంపి పుణ్యం కట్టుకో.’’
ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ ఆశ్చర్యంగా చూసాడు.
‘‘నన్ను చంపు అని బతిమాలేవాళ్ళు పిచ్చివాళ్ళు. నీకు పిచ్చెక్కింది.’’
‘‘ప్లీజ్! నన్ను చంపు.’’
‘‘నాకు అర్థమైంది. టేప్ రికార్డర్‌ని ఆన్ చేసావా? ఇందాక బల్ల సొరుగు తెరిచినప్పుడు అది ఆన్ చేసావా?’’
‘‘లేదు. వచ్చి చూడు. సొరుగులో టేప్ రికార్డర్ లేదు. ఫోన్ రిసీవర్ కూడా క్రెడిల్ మీదే ఉంది.’’
‘‘దాచిన మైక్రోఫోన్‌లు ఈ గదిలో ఉన్నాయేమో?’’
‘‘ఉన్నా నీ కంఠ ధ్వనినిబట్టి వారు నిన్ను పట్టుకోలేరు.’’
‘‘నేను సాధారణ దొంగని. ఇంతదాకా ఎవర్నీ చంపలేదు. ఇంతదాకా ఎవరూ లేని ఇళ్ళల్లో నేను దొంగతనం చేసినప్పుడు నాకు సాక్షులు తారసపడలేదు. ఇవాళ మీకు దుర్దినం డేడ్. మీరు సహజంగానే మరణించాలి. నిన్ను చంపి నా తలని నేను రిస్క్ చేయదలచుకోలేదు. నీలాంటి గొప్ప నటుడ్ని చంపితే పోలీసులు నన్ను పట్టుకునేదాకా వదలరు.’’
అతను తక్షణం తను ఏ కిటికీలోంచి ఆ గదిలోకి ప్రవేశించాడో అదే కిటికీలోంచి బయటికి దూకి పారిపోయాడు.
బ్రెట్ డిలేన్ కొద్ది క్షణాలు గట్టిగా ఊపిరితీసుకుని వదిలాడు. తర్వాత సొరుగులోంచి పిస్తోలుని తీసి తయారుగా పట్టుకున్నాడు. మనసు మార్చుకుని వస్తే, రెండోసారి ఆ యువకుడికి అవకాశం ఇవ్వదలచుకోలేదు. తర్వాత రిసీవర్ అందుకుని ఓ నంబర్ తిప్పి చెప్పాడు.
‘‘సారీ! మీ అమ్మ వండిన కూరలోని మసాలా ఎంత గాఢంగా ఉందంటే నేను అల్సర్ మందుకోసం ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. మనింట్లో దొంగపడ్డాడు. నేను వాడి ముందు ఎంత గొప్పగా నటించానో రిపోర్టర్స్‌కి జరిగింది చెప్పేప్పుడు నువ్వు విందువు గాని. వెంటనే బయలుదేరిరా... నేను స్నానంచేసి మంచి దుస్తులు ధరించాలి. వాళ్ళు నన్ను చిత్రీకరిస్తారు. ఫొటోలు కూడా తీస్తారు.’’
బ్రెట్ డిలేన్ రిసీవర్‌ని పెట్టేసాడు.
- (లియో ఆర్ ఎల్లిస్ రచనకి స్వేచ్ఛానువాదం)