23, అక్టోబర్ 2011, ఆదివారం

అఫూర్వ అక్కాచెల్లెళ్లు!


దో అందమైన కుటుంబం. జనెట్ - గ్రాహమ్ వాల్టన్‌లకి ఆరుగురు కూతుళ్లు. 1983, నవంబర్ 18 నుంచీ ఇప్పటి వరకూ అందరికీ ఒక్కటే మాట. ఎప్పటికీ ఒక్కటే మాట. ఎక్కడికి వెళ్లినా అంతా కలిసే వెళతారు. ఆఖరికి మార్కెట్‌లో కూరగాయలు కొనాలన్నా. వంట గదిలో ముచ్చట్ల మధ్య కలిసి వంట చేస్తారు. ఏ నిర్ణయమైనా కలిసి తీసుకుంటారు. ఏదైనా పార్టీ అంటే వీళ్లంతా ఉంటే చాలు. సందడే సందడి. పార్టీలకూ ఫంక్షన్లకూ పోలోమంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. సమిష్ఠి కుటుంబం ఊసే కనిపించిన ఈ రోజుల్లో వీళ్లంతా రేపటి ప్రపంచానికి ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న నినాదాన్ని చాటి చెబుతున్నారేమిటా? అంటూ అచ్చెరువొందబోయే ముందు మరో మాట చెప్పుకోవాలి. 1983, నవంబర్ 18న జనెట్ - గ్రాహమ్ వాల్టన్‌లకి పుట్టిన ఈ ‘సంతానం’ కేవలం రెండు మూడు నిమిషాల వ్యవధిలో జన్మించిన ‘కవలలు’ కావటం కొసమెరుపు. ప్రపంచంలో ఇటువంటి అరుదైన ‘కవల’లకు కొదువ లేకున్నప్పటికీ భూమీద పడిన వారందరూ ‘బట్ట’ కట్టిన దాఖలాలు బహు కొద్ది మాత్రమే. ఎన్నో అనారోగ్య సమస్యల్ని అధిగమించి ప్రస్తుతం 27వ వసంతంలోకి అడుగుపెట్టిన వీరంతా జాతికి ఎన్నో సందేశాల్ని మోసుకొస్తున్నారు. మొదటిగా పుట్టిన హన్నా, ఆ తర్వాతి లూసీ, రూత్, శారా, కటె, ఆఖరి జెన్నీ.. అప్పుడే పుట్టినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో మొదలుకొని.. ఇలా ప్రత్యేకించి ప్రతి సందర్భంలోనూ జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నారు. స్కూల్ యూనిఫాంలో పక్కపక్కన నిలుచుంటే.. ఎవరు ఎవరో గుర్తు పట్టడం అసాధ్యం. ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే.. ఇల్లంతా ఒక్కరే అక్కడక్కడ ప్రత్యక్షమై అదృశ్యమవుతున్నట్టు భావిస్తారట.
ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటార్ట అని నోరెళ్ళబెట్టబోయే ముందు ఆ సంఖ్యని ‘ఆరుగురి’కి కుదించి.. ఇదిగో ఇక్కడే అన్నట్టు ఉంటుంది. విర్రల్‌లోని వల్లాసెలో ఎనిమిది బెడ్‌రూంలో ఇంట్లో ఉంటున్న వీరంతా ఇటీవల ఉద్యోగాల రీత్యా... చదువుల రీత్యా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. అంతమాత్రం చేత ‘సమిష్ఠి’ అర్థం మారిందనుకుంటే పొరపాటే. వారాంతంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కలిసి భోజనాల బల్లకి చేరుకోవాల్సిందే. 58 ఏళ్ల తల్లి జనెట్ వీరిని చూసి మురిసిపోతూ.. ఒక్కొక్కరి మనస్తత్వం గురించి వివరిస్తుంది. లూసీ అందరినీ అజమాయిషీ చేస్తుంది. శారా కొద్దిగా నెమ్మది. రూత్‌లోనూ బాసిజం. కటె అయితే అకడమిక్‌లో ఫస్ట్.. హన్నాకి ఆర్గనైజ్ చేయటం బాగా తెలుసు. హన్నా ఇటీవలే ‘పిజిసిఇ’ పూర్తి చేసి ప్రైమరీ స్కూల్‌లో వర్క్ చేస్తోంది. షాపింగ్ చేయటం.. పుస్తకాలు చదవటం.. స్నేహితులతో కబుర్లతో కాలం గడిపేస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు.
ఇంతమంది కవలల్ని చూట్టం ఆ ఊరి జనానికి అలవాటై పోయినా.. ఎవరు ఎవరో కొద్ది క్షణాలు గడిస్తే తప్ప చెప్పలేరు. వారి 18వ ఏట ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించటం మరో విశేషం.