కొలిక్కిరాని కాంగ్రెస్ కోర్ కమిటీ
త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం
సుదీర్ఘంగా చర్చించిన అధిష్ఠానం

న్యూఢిల్లీ : తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు. ఓ వైపు సమ్మెతో తెలంగాణ తగలబడుతున్నప్పటికీ, గంటన్నరకు పైగా సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఓ బృందాన్ని పంపించాలని మాత్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశంపై కొలిక్కిరాని కోర్‌కమిటీ విషయాన్ని మళ్లీ వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సమావేశానంతరం సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్, ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌లను మీడియా కలసినప్పుడు వారు పెద్దగా స్పందించలేదు. 'మరికొంత సమయం పడుతుంది' అని మాత్రమే అన్నారు. ఈ కోర్ కమిటీ సమావే శానికి సోనియాగాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌లతోపాటు ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్‌లు హాజరయ్యారు. ఈ సమావేశం గంట 40 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగింది. తెలంగాణ, ఆజాద్ నివేదికపైనే ఈ చర్చంతా సాగింది. అంతకుముందు ఆజాద్ తన నివేదికను సోనియాగాంధీకి సమర్పించారు. దీంతో కదలిక వచ్చిన అధిష్ఠానం హడావిడిగా కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణ అంశంపై అతిత్వరలో కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. సకల జనుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఈ బృందం మదింపు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి పెంచడంతోపాటు సమ్మెతో రాష్ట్రం అస్తవ్యస్థం కావడంతో అధిష్ఠానం కదిలింది.