1, అక్టోబర్ 2011, శనివారం

తెలంగాణపై తాడోపేడో... హస్తినబాట

ఢిల్లీకి కెసిఆర్‌, జెఎసి ప్రతినిధివర్గం
హైదరాబాద్‌(వి.వి) : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఇక తాడోపేడో తేల్చుకోవడా నికి టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ నేతల బృందం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లింది. కెసిఆర్‌తో పాటు తెలంగాణ జెఎసి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, జెఎసిలో సభ్యులైన సింగరేణి, ఆర్టీసీ, న్యాయవాది జెఎసిల నాయకులు కూడా వెళ్లారు. కెసిఆర్‌తో పాటు మొత్తం 30 మంది జెఎసి నాయకులు ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణలోని పరిస్థితులను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి వీరంతా వెళ్లారు. ఢిల్లీకి బయలుదేరే ముందు కెసిఆర్‌ తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ శాంతియుతంగా జరుగు తున్న సకల జనుల సమ్మెను హింసా మార్గంలోకి తీసుకుపోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, ఇదే విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు టి.హరీష్‌రావు, కెటి రామారావులపై పోలీ సుల దాడులు, ఉద్యోగ సంఘం నాయ కులు స్వామిగౌడ్‌పై పోలీసులు హత్యా యత్నం చూస్తుంటే ప్రభుత్వం ఈ సమ్మెను హింసాయుత మార్గంలోకి తీసుకుపోవ డానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతున్న దని కెసిఆర్‌ అన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధాని మన్మో హన్‌ సింగ్‌తో పాటు బిజెపి అగ్రనేతలు, యుపిఎ, ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల ప్రతి నిధులతో కూడా కలిసి తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరిస్తా నని ఆయన చెప్పారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని ప్రధానిని కోరతామని, అందరూ సహకరించాలని జాతీయస్థాయి నాయకులకు విజ్ఞప్తి చేస్తామని చంద్రశేఖరరావు చెప్పారు.