29, సెప్టెంబర్ 2011, గురువారం

చైనాలో గోల్డ్ వెండింగ్ మిషన్లు


AA

* బంగారం కొనుగోళ్ల ప్రోత్సాహం కోసం
* బీజింగ్ మొదటి గోల్డ్ వెండింగ్ మిషన్
* అందుబాటులో కాయిన్స్ నుంచి గోల్డ్ బార్స్ వరకూ
* చైనాలో పుత్తడికి పెరిగిన డిమాండ్
* బంగారంపై పెట్టుబడి కోసం...
* బంగారం వినియోగంలో భారతీయులే టాప్


మనం బంగారం కొనాలంటే షాపుకెళ్లాలి. బేరమాడాలి. క్వాలిటీ చూడాలి. ఇలా చాలా పెద్ద తతంగం ఉంటుంది. కానీ, చైనావాళ్లకు ఇప్పుడా బాధ లేదు. ఎంచక్కా ఏటీఎమ్ లో డబ్బులు తీసుకున్నట్టే గోల్డ్ ను డ్రా చేసుకోవచ్చు. అదీ కేజీల్లో కూడా హాయిగా కొనుక్కోవచ్చు. కార్డ్ ఆర్ క్యాష్ ఏదిచ్చినా పుత్తడి మీదవుతుంది. అదెలా అంటారా! మీరే చూడండి.
పండగలకు, పబ్బాలకు బంగారాన్ని కొనడం చాలామంది సెంటిమెంటు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట కొలువుంటుందని నమ్ముతారు. కానీ, దాన్ని కొనాలంటే కాస్త ఇబ్బందే. ఇప్పుడా బాధ లేదు. బంగారం కొనాలంటే సింపుల్ గా గోల్డ్ వెండింగ్ మిషన్ దగ్గరకు వెళ్లడం.. తెచ్చుకోవడం. ఇంతే. ప్రస్తుతానికి ఈ సదుపాయం మనదగ్గర లేదు కాని.. చైనాలో వచ్చేసింది. అవును. బీజింగ్ లో ఫస్ట్ టైమ్ గోల్డ్ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేశారు.
ఇండియా తరువాత బులియన్ మార్కెట్లో చైనాదే స్థానం. అందుకే బంగారం కొనుగోలును ప్రోత్సహించడానికి నిర్ణయించుకుంది చైనా. బీజింగ్ లో వాంగ్ ఫూజింగ్ షాపింగ్ డిస్ట్రిక్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. క్యాష్ కాని, బ్యాంకు కార్డులు ఉపయోగించి.. ఈ గోల్డ్ బార్ లను కొనుక్కోవచ్చు. ప్రజల సౌలభ్యం కోసం కాయిన్స్ నుంచి గోల్డ్ బార్స్ వరకూ వెండింగ్ మిషన్ లో ఉంటాయి.
ఒక విత్ డ్రాలో అత్యధికంగా రెండున్నర కేజీలను డ్రా చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి మెషీన్ లు ఏర్పాటు చేయడానికి చైనా రెడీ అయింది. చైనాలో కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది పుత్తడి డిమాండ్ 27శాతం పెరిగింది. దేశంలో ప్రాపర్టీ ధరలను కంట్రోల్ చేయడానికి, అనవసరమైన స్పెక్యులేషన్ నివారించడానికి, బంగారం మీద పెట్టుబడిని ఆకర్షణీయంగా మార్చడానికి వీటిని ఏర్పాటు చేసింది.
భారతీయులతో పోల్చితే... చైనీస్ బంగారం కొనుగోళ్లు ఇప్పటికీ తక్కువే. గత ఏడాది మనం 963.1 టన్నులు కొంటే, చైనావాళ్లు 579.5 టన్నులే కొన్నారు. గోల్డ్ వెండింగ్ మిషన్ లు ఇప్పటికే బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నాయి.