1, అక్టోబర్ 2011, శనివారం

ద్వివేది బాధ్యతల స్వీకరణ

Sat, 1 Oct 2011, IST   
హైదరాబాద్‌ (వివి) : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పంకజ్‌ ద్వివేది శుక్రవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌వి.ప్రసాద్‌ నుండి సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బదిలీ ఫైల్‌ పైన, కెరీర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌ ఫైల్‌ పైన తొలిసంతకం చేశారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం శక్తివంచలన లేకుండా కృషిచేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు కింది స్థాయి లబ్ధిదారుల వరకు చేరేందుకు పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడం తన ప్రాధాన్యతలన్నారు. త్వరలోనే భూ కేటాయింపు విధానం ఖరారు కానుందన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా రూపకల్పన జరిగిందన్నారు. కౌలు రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చేసిన చట్టం రాష్ట్ర చరిత్రలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకే చోట అప్పటికప్పుడు లభ్యమయ్యేలా ఒక పటిష్ట విధానాన్ని రూపొందిస్తామన్నారు. రాష్ట్ర పరిస్థితులు సంక్లిష్టంగా వున్నాయని, సమ్మె చేస్తున్న ఉద్యోగులు సమ్మెను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు.
కొత్త రథ సారధులకు అభినందన
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ రథ సారధులు కొత్త ఉద్యోగాల్లో చేరినందుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారుల సమావేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి నూతనంగా స్టేట్‌ విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా నియమితులైన ఎస్‌వి.ప్రసాద్‌ను, సిసిఎల్‌ఎగా వుంటూ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్‌ ద్వివేదిని, ప్రస్తుత ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సిసిఎల్‌ఎగా బదిలీ అయిన జె.సత్యనారాయణలకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు సంయుక్తంగా శాలువలు కప్పి, పుష్పగుచ్చాలు, మెమెంటాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల హర్షధ్వనాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా ఉన్నతాధికారులందరూ తమ కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.