4, జనవరి 2012, బుధవారం

రాజా ఆంపట్ ద్వీపాలు

గ్నేయ ఆసియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఇండోనేషియా ఒకటి. ఇండోనేషియాలో మొత్తం 17 వేల ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 11 వేల ద్వీపాలలో జనావాసం ఉంది. ఒక్కో ద్వీపంలో ఒక్కో రకం పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బాలి, కలిమంటన్, బైలమ్, సుమత్రా, లోంబోక్, సులావెసి లాంటి ద్వీపాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. కాని ప్రపంచానికి పెద్దగా తెలియని ఇండోనేషియా పర్యాటక కేంద్రంలో కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి రాజా అంపట్ ద్వీపాలు.
రాజా అంపట్ అంటే, నలుగురు రాజులు అని అర్థం. ఇతిహాసాల ప్రకారం ఇక్కడి ఆ నాలుగు ద్వీపాల పేర్లు వాటిని పాలించిన వైజియో, మిశూల్, సలావతి, బటంట్ అనే ఇస్లాం రాజుల పేర్ల మీద ఏర్పడ్డాయి. ఇక్కడి పర్వత గుసల్లో చెక్కిన పురాతన చిత్రాలను చూడొచ్చు. ఇండోనేషియన్స్‌కే పెద్దగా తెలియని ఈ రాజా అంపట్ ద్వీపాలు గత కొనే్నళ్లుగా పర్యాటక కేంద్రాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జకార్తాలో నివసించే విలేకరి యాయూ యునియెర్ అనే ఆమె 2007 నించి నేటి దాకా ఏటా ఓసారి ఈ ద్వీపాలకి వెళ్లి, అక్కడ పర్యాటకులను ఆకర్షించే అంశాల మీద రాసిన వాయసాలు, విశేషాల వల్ల ఇక్కడికి పర్యాటకులు రావటం మొదలైంది.
పపావు తీరానికి కొద్ది దూరం నించి రాజా అంపట్ ద్వీపాలకి సముద్ర మార్గంలో చేరుకోడానికి వారం నించి పది రోజులు పడుతుంది. కాని ఇంత శ్రమపడి వెళ్లిన వారికి చక్కటి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా చేపలు, పగడాలు లాంటి సముద్ర విషయాల మీద ఆసక్తిగల వారికి ఇక్కడ చూడడానికి చాలా విశేషాలు ఉన్నాయి.
ఇండోనేషియాలోని అత్యంత పెద్ద జాతీయ మెరైన్ పార్క్ ఇక్కడే ఉంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన పగడాల ద్వీపం కూడా ఇక్కడే ఉంది. అంతేకాక ప్రపంచంలో మరెక్కడా లేని అనేక చేపల జాతులు కూడా రాజా అంపట్ ద్వీపాల చుట్టూగల సముద్రంలో ఉన్నాయి. ఇది ప్రపంచంలోని తొలి మెరైన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్! పదివేల ఏళ్ల క్రితం ఇక్కడ జనావాసం ఉండేది. మూడు వేల ఏళ్ల క్రితపు కళా వస్తువులు, ఆసియాలోని ఇతర ప్రాంతాలతో వర్తకం జరిపిన దాఖలాలు అనేకం ఇక్కడ లభించాయి. సముద్ర గర్భంలో పురావస్తు పరిశోధన శాఖ చేసిన పరిశోధనల వల్ల ఈ విషయాలు తెలిసాయి.
రాజా అంపట్ మొత్తం పదిహేను వందల చిన్న ద్వీపాల సముదాయం. రాజా అంపట్‌లోని నాలుగు పెద్ద ద్వీపాలు కాక మిగిలినవి చిన్నవి. అన్నిటికన్నా చిన్నదాని పేరు కొఫయూ. ఈ ద్వీపాలు, చుట్టూగల సముద్ర విస్తీర్ణం మొత్తం 40 వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడమే. ఇక్కడ అనేక తెగలవారు చిన్నచిన్న కాలనీలలో నివసిస్తున్నారు. క్రైస్తవం ప్రధాన మతం. ఇక్కడ సున్నపు కొండలు, వాటిలోని గుహలు, ఎతె్తైన కొండల మీంచి కనపడే ప్రకృతి దృశ్యాలు, సీఫుడ్, కాలుష్యం లేని వాతావరణం, సముద్ర సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని 75 శాతం చేపల జాతులు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇంకా 600 జాతుల పక్షులు, ఐదు జాతుల రక్షిత సముద్ర తాబేళ్లు, 57 జాతుల ఫ్రింప్ చేపలు, ఇక్కడ మాత్రమే లభ్యమయ్యే 27 జాతుల రీఫ్ చేపలు, కొండ గుహల్లో పారే నీరు, అనేక రంగుల ఇసుకగల ఈ ద్వీపాలు సుందరంగా ఉంటాయి. కనీసం 15 మంది పర్యాటకులతో 285 అమెరికన్ డాలర్లకు సరిపడ ఇండోనేషియన్ కరెన్సీతో ఇక్కడికి వెళ్లి రావచ్చు. ఏర్‌కండిషనల్ ఫెర్రీలో ఫైవ్‌స్టార్ వంట వాళ్లుంటారు. మే నించి సెప్టెంబర్ దాకా సీజన్. ఇండోనేషియా ట్రావెల్‌గైడ్‌లో రాజా అంపట్ గురించి లభ్యం కాదు. హైదరాబాద్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకి విమానంలో, అక్కడి నించి రోడ్డు, సముద్ర మార్గాల్లో రాజా అంపట్ ద్వీపాలకు చేరుకోవచ్చు. ఇక్కడి స్థానికులే గైడ్లుగా వ్యవహరిస్తూంటారు. వారికి పోకచెక్కలు, మిఠాయిలు ఇస్తే ఎంతో సంతోషిస్తారు.-ఆశ్లేష(సౌజన్యం: ఆంధ్ర భూమి)